Begin typing your search above and press return to search.

కేసీఆర్ స‌ర్కారుకు హైకోర్టు స్టే షాక్!

By:  Tupaki Desk   |   7 Jan 2016 2:13 PM GMT
కేసీఆర్ స‌ర్కారుకు హైకోర్టు స్టే షాక్!
X
ఇప్ప‌టికే వివాదాస్ప‌ద నిర్ణ‌యంగా తెలంగాణ రాజ‌కీయ పార్టీలు తీవ్ర‌స్థాయిలో విరుచుకుప‌డుతున్న అంశంపై తెలంగాణ అధికార‌ప‌క్షానికి షాక్ త‌గిలింది. జీహెచ్ ఎంసీ ఎన్నిక‌లకు సంబంధించి ఇటీవ‌ల చేసిన ఒక చ‌ట్ట స‌వ‌ర‌ణ‌పై ఉమ్మ‌డి హైకోర్టు స్టే ఇచ్చింది. ఇది.. తెలంగాణ స‌ర్కారుకు మింగుడుప‌డ‌ని వ్య‌వ‌హారంగా చెప్పొచ్చు. గ్రేట‌ర్ ఎన్నిక‌ల షెడ్యూల్ కుదింపుపై ఇటీవ‌ల కేసీఆర్ స‌ర్కారు నిర్ణ‌యం తీసుకున్న సంగ‌తి తెలిసిందే. ఈ నిర్ణ‌యంతో ఎన్నిక‌ల ప్ర‌చారానికి స‌మ‌యం త‌గ్గిపోనుంది. ఈ నిర్ణ‌యం పై తెలంగాణలోని రాజ‌కీయ ప‌క్షాలు తీవ్ర అసంతృప్తిని వ్య‌క్తం చేశాయి. ఇలాంటి చ‌ట్ట స‌వ‌ర‌ణను అధికారుల‌తో పూర్తి చేయ‌టంపై ప‌లు విమ‌ర్శ‌లు వ్య‌క్త‌మ‌య్యాయి.

ఈ వ్య‌వ‌హారంపై రాజ‌కీయ పార్టీలు కోర్టును ఆశ్ర‌యించాయి. దీనిపై విచార‌ణ జ‌రిపిన ఉమ్మ‌డి హైకోర్టు.. ఎన్నిక‌ల గ‌డువును కుదిస్తూ జారీ చేసిన జీవోను కొట్టివేస్తూ నిర్ణ‌యాన్నిప్ర‌క‌టించింది. అదే స‌మ‌యంలో ఎన్నిక‌ల ప్ర‌చారాన్ని కుదించాల‌న్న తెలంగాణ స‌ర్కారు నిర్ణ‌యంపై స్టే విధించింది.

చ‌ట్టాన్ని స‌వ‌రించే అధికారం శాస‌న‌స‌భ‌కు త‌ప్పించి.. అధికారుల‌కు లేద‌ని స్ప‌ష్టం చేసిన హైకోర్టు.. ఇప్ప‌టికే తీసుకున్న నిర్ణ‌యాన్ని త‌ప్ప ప‌ట్టింది. శ‌నివారం లోపు రిజ‌ర్వేష‌న్ల వ్య‌వ‌హారాన్ని తేల్చాలంది. దీంతో.. గ్రేట‌ర్ ఎన్నిక‌ల‌పై నోటిఫికేష‌న్ అయితే శ‌నివారం.. లేదంటే ఆదివారం విడుద‌ల‌య్యే అవ‌కాశం ఉంది. తాజాగా హైకోర్టు ఆదేశాల నేప‌థ్యంలో ఫిబ్ర‌వ‌రి 9 లేదా 10 లోపుగా ఎన్నిక‌ల ప్ర‌క్రియ‌ను పూర్తి చేయాల్సి ఉంటుంది. కోర్టు విధించిన తాజా స్టే పై విపక్షాలు ప్ర‌జాస్వామ్య విజ‌యంగా అభివ‌ర్ణించాయి. గ్రేట‌ర్ ఎన్నిక‌ల విష‌యంలో దూకుడుగా వెళుతున్న కేసీఆర్ స‌ర్కారుకు తాజా ప‌రిణామం కాసింత బ్రేకులు వేసిన‌ట్లేన‌న్న అభిప్రాయం వ్య‌క్త‌మవుతోంది.