Begin typing your search above and press return to search.

ఈశ్వరిపైన దేశద్రోహం కేసు పెట్టారు

By:  Tupaki Desk   |   19 Dec 2015 4:27 AM GMT
ఈశ్వరిపైన దేశద్రోహం కేసు పెట్టారు
X
మాటల తూటాలతో ఒకరు తప్పు చేస్తే.. చట్టప్రకారం వారిపై చర్యలు తీసుకునే క్రమంలో పోలీసుల అత్యుత్సాహం ఏపీ సర్కారు మెడకు చుట్టుకోనుందా? అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఒకరికి ఒకరు ఏ మాత్రం తీసిపోని విధంగా వ్యవహరిస్తున్నారన్న వాదనలకు బలం చేకూరేలా తాజా పరిణామాలు చోటు చేసుకోవటం గమనార్హం. బాక్సైట్ తవ్వకాల ఉదంతంలో ఏపీ విపక్ష సభ్యురాలు.. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన పాడేరు ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి ముఖ్యమంత్రి చంద్రబాబుపై అనుచిత వ్యాఖ్యలు చేయటం తెలిసిందే.

బాక్సైట్ తవ్వకాల విషయంలో ప్రభుత్వం అనుసరిస్తున్న తీరును తప్పు పట్టిన ఆమె.. ఈ విషయంలో గిరిజనులు సంప్రదాయ ఆయుధాలతో సీఎం తలను తెగ నరికేస్తారంటూ వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలపై సర్వత్రా నిరసన వ్యక్తమైంది. ముఖ్యమంత్రిపై ఒక ఎమ్మెల్యే అలాంటి వ్యాఖ్యలు చేయటం ఏమిటన్న మాట వినిపించింది. ఈశ్వరి చేసిన వ్యాఖ్యలపై పోలీసులు కేసు నమోదు చేశారు. అయితే.. ఈ సందర్భంగా పోలీసులు అత్యుత్సాహాన్ని ప్రదర్శించారు. ముఖ్యమంత్రి చంద్రబాబుపై చేసిన వ్యాఖ్యలపై పోలీసులు దేశద్రోహం కేసు నమోదు చేయటం విస్మయం వ్యక్తమవుతోంది.

పోలీసులు పెట్టిన సెక్షన్లపై అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ.. తనను అరెస్ట్ చేయకూడదంటూ ఎమ్మెల్యే ఈశ్వరి హైకోర్టును ఆశ్రయించారు. ఈ ఉదంతంపై విచారణ జరిపిన న్యాయస్థానం.. దేశద్రోహం కేసును నమోదు చేయటంపై విస్మయాన్ని వ్యక్తం చేసింది. రాజ్యంపై కుట్రపూరితంగా వ్యవహరించినప్పుడే దేశద్రోహం కేసు పెట్టాలి కానీ.. వ్యక్తులపై వ్యాఖ్యలు చేయటంపై దేశద్రోహం కేసు నమోదు చేయటం ఏమిటన్న వాదనలు వ్యక్తమయ్యాయి. ఇరు పక్షాలు చేసిన వాదనల్ని విన్న న్యాయమూర్తి.. ఈ వ్యవహారంపై ప్రాధమికంగా స్పందిస్తూ.. ఒకరికి మించి మరొకరు మాట్లాడుతున్నారని.. ఎవరూ సంయమనాన్ని ప్రదర్శించటం లేదని.. తమ స్థాయి మర్చి మాట్లాడటం జరుగుతుందని వ్యాఖ్యానించారు. ఈ కేసు విషయంలో దేశ ద్రోహం కేసు ఎలా పెడతారన్న సందేహాన్ని వ్యక్తం చేయటం గమనార్హం. రాజకీయ కక్షలకు పోలీసుల్ని వాడుకుంటారా? అంటూ ప్రశ్నిస్తూ.. ఈశ్వరిపై నమోదు చేసిన కేసులో ఆమెను అరెస్ట్ చేయకూడదని ఆదేశించారు. అదే సమయంలో ఈ కేసు దర్యాప్తు కొనసాగించుకోవచ్చని పేర్కొనటం గమనార్హం.