Begin typing your search above and press return to search.

కేఈ కుమారుడిపై కోర్టు నజర్..

By:  Tupaki Desk   |   15 Feb 2017 6:41 AM GMT
కేఈ కుమారుడిపై కోర్టు నజర్..
X
చంద్రబాబు కేబినెట్లోని మంత్రులు కుమారులు కోర్టు కేసుల్లో చిక్కుకుంటున్నారు. ఇప్పటికే రావెల కిశోర్ బాబు తనయుడు ఏకంగా నిర్భయ కేసునే ఎదుర్కోగా తాజాగా ఉప ముఖ్యమంత్రి కేఈ కృష్ణమూర్తి కుమారుడు శ్యాంబాబు కూడా కోర్టు కంట్లో పడ్డారు. శ్యాంబాబు చేస్తున్న అక్రమాలు. ఆయన కారణంగా జరుగుతున్న నష్టంపై నివేదిక ఇవ్వాలంటూ హైకోర్టు అధికారులను ఆదేశించింది.

కర్నూలు జిల్లా హంద్రీ నది నుంచి వందలాది లారీలతో నిత్యం ఇసుకను అక్రమంగా తరలిస్తూ భూగర్బజలాలతో పాటు, చుట్టుపక్కల వ్యవసాయ భూములను నాశనం చేస్తున్నారంటూ కొందరు హైకోర్టులో కేసు వేశారు. దీనిని కోర్టు సీరియస్‌ గా తీసుకుంది. ఇంత జరుగుతున్నా అధికారులు, కలెక్టర్ ఎందుకు స్పందించడం లేదని హైకోర్టు మండిపడింది. దీనికి కారకులెవరు.. జరుగుతున్న నష్టం వివరాలతో వెంటనే నివేదిక ఇవ్వాలని ఆదేశించింది. కర్నూలు జిల్లా కోడుమూరు, కృష్ణగిరికి చెందిన 11 మంది రైతులు ఇసుక అక్రమ రవాణాను అడ్డుకోవడంతో ప్రభుత్వం విఫలమైందని ప్రజాప్రయోజనాల వ్యాజ్యం వేయడంతో కోర్టు ఇలా స్పందించింది.

పిటిషన్ దారులు మొత్తం వివరాలు కోర్టుకు తెలిపారు. ఇసుక మాఫియాను నడుపుతున్న డిప్యూటీ సీఎం కేఈ కృష్ణమూర్తి కుమారుడు శ్యాంబాబు అని కోర్టు దృష్టికి తెచ్చారు. ఈ పిల్‌పై విచారణ జరిపిన న్యాయస్థానం అక్కడ జరుగుతున్న దారుణం తెలుసుకుని ఆశ్చర్యపోయింది. ఈ అక్రమాలపై నివేదిక ఇవ్వాలని హైకోర్టు ఆదేశించింది. ఇసుక మాఫియాపై వస్తున్న ఫిర్యాదులను కేవలం మైనింగ్ శాఖకు బదిలీ చేసి కలెక్టర్ కార్యాలయం చేతులు దులుపుకుంటోందని ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇసుక మాఫియా కారణంగా ధ్వంసమైన రోడ్లు, వ్యవసాయ భూములకు సంబంధించిన ఫోటోలను కూడా తమకు అందజేయాలని పిటిషనర్లను హైకోర్టు కోరింది. మొత్తానికి ఇదేదో కేఈకి ఇబ్బందులు తెచ్చే వ్యవహారంలాగే ఉంది.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/