Begin typing your search above and press return to search.

ప్రభుత్వ ఆర్థిక వ్యవహారాలతో మీకు పనేంటి?.. RRR పై హైకోర్టు అసహనం..!

By:  Tupaki Desk   |   16 Jun 2022 5:30 AM GMT
ప్రభుత్వ ఆర్థిక వ్యవహారాలతో మీకు పనేంటి?.. RRR పై హైకోర్టు అసహనం..!
X
ఏపీ బేవరేజెస్‌ కార్పొరేషన్‌కు చెల్లించే పన్నులను ఆదాయంగా చూపి ఆర్థిక సంస్థల నుంచి రుణం పొందేందుకు వైఎస్ జగన్ ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలను అడ్డుకోవాలంటూ వైఎస్సార్సీపీ అసమ్మతి ఎంపీ రఘురామకృష్ణరాజు దాఖలు చేసిన ప్రజా ప్రయోజన వ్యాజ్యం (పిల్‌)పై హైకోర్టు అసహనం వ్యక్తం చేసింది. అప్పు పొందకుండా ప్రభుత్వ యత్నాలను అడ్డుకోవాలన్న రఘురామకృష్ణరాజు అభ్యర్థనను కోర్టు తోసిపుచ్చింది. ప్రభుత్వ ఆర్థిక వ్యవహారాలను శాసించేందుకు మీరెవరంటూ నిలదీసింది.

అసలు ఈ పిల్ నిరర్థకమైందని, ఈ వ్యాజ్యాన్ని తామెందుకు విచారించాలని న్యాయస్థానం ప్రశ్నించింది. ప్రభుత్వం ఆర్థిక ఇబ్బందుల్లో ఉండాలన్న ఉద్దేశంతోనే ఈ వ్యాజ్యాన్ని దాఖలు చేశారని రఘురామకృష్ణరాజునుద్దేశించి ఘాటుగా వ్యాఖ్యానించింది. ప్రభుత్వ సంక్షేమ పథకాలను ఆపేందుకే ఈ వ్యాజ్యాన్ని దాఖలు చేసినట్లు అనిపిస్తోందని మండిపడింది. ప్రభుత్వ ఆర్థిక వ్యవహారాల్లో తాము జోక్యం చేసుకోబోమని పునరుద్ఘాటించింది. తాము జారీ చేయబోయే ఉత్తర్వులపై అభ్యంతరం ఉంటే సుప్రీంకోర్టుకు వెళ్లవచ్చని ధర్మాసనం ఈ సందర్భంగా రఘురామకృష్ణరాజుకు తేల్చి చెప్పింది.

ప్రభుత్వ ఆర్థిక వ్యవహారాలు ఎలా సాగాలో చూసేందుకు తామేమీ కంపెనీ సెక్రటరీలం కాదని, హైకోర్టు జడ్జీలమని హైకోర్టు వ్యాఖ్యానించింది. ప్రభుత్వాలను తాము నడపడం లేదని, ఆర్థిక వ్యవహారాల్లో జోక్యం చేసుకోవడం కోర్టుల పని కాదని పేర్కొంది. ఈ వ్యాజ్యంలో ప్రభుత్వం నుంచి కనీస వివరణ కూడా కోరబోమని స్పష్టం చేసిన ధర్మాసనం దీనిపై తగిన ఉత్తర్వులు జారీ చేస్తామని తెలిపింది. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి (సీజే) జస్టిస్‌ ప్రశాంత్‌కుమార్ మిశ్రా, న్యాయమూర్తి జస్టిస్‌ డీవీఎస్‌ఎస్‌ సోమయాజులతో కూడిన ధర్మాసనం తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది.

ఏపీ (విదేశీ మద్యం, దేశీయ తయారీ విదేశీ మద్యం వ్యాపార నియంత్రణ) చట్టానికి సవరణలు చేస్తూ వైఎస్ జగన్ ప్రభుత్వం ఇటీవల తెచ్చిన రెండు చట్టాలను సవాల్ చేస్తూ రఘురామకృష్ణరాజు హైకోర్టులో పిల్‌ దాఖలు చేయడం తెలిసిందే.

కొత్త సవరణ చట్టాల ద్వారా సంచిత నిధికి చెందిన మొత్తాలను ప్రభుత్వం ఆదాయంగా చూపి రుణాలను పొందేందుకు ప్రయత్నిస్తోందని, స్పెషల్‌ మార్జిన్‌ మనీని తాకట్టు పెట్టి బ్యాంకులు, ఆర్థిక సంస్థల నుంచి ఎలాంటి రుణం పొందకుండా రాష్ట్ర ప్రభుత్వాన్ని నియంత్రిస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేయాలని కోరారు. ఈ వ్యాజ్యంపై గతంలో విచారణ జరిపిన సీజే ధర్మాసనం తాజాగా మరోసారి విచారించింది.

పిటిషనర్‌ తరఫు న్యాయవాది అంబటి సుధాకరరావు వాదనలు వినిపిస్తూ.. రాష్ట్ర ప్రభుత్వం సంచిత నిధికి వెళ్లాల్సిన మొత్తాలను ఆదాయంగా చూపుతూ ఆర్థిక సంస్థల నుంచి రుణాలు పొందుతోందన్నారు. స్పెషల్‌ మార్జిన్‌ మనీని తాకట్టు పెట్టి రుణాలు తీసుకుంటుందన్నారు. ఈ సమయంలో ధర్మాసనం స్పందిస్తూ.. ప్రభుత్వ ఆర్థిక వ్యవహారాలను మీరెలా శాసిస్తారంటూ రఘురామకృష్ణరాజును ప్రశ్నించింది. ప్రభుత్వం రుణాలు ఎలా తీసుకోవాలో మీరు నిర్దేశిస్తారా? అంటూ అసహనం వ్యక్తం చేసింది. ప్రభుత్వ ఆర్థిక వ్యవహారాలను శాసించేందుకు అసలు మీరెవరంటూ నిలదీసింది. తన ఆర్థిక వ్యవహారాలను ఎలా చక్కబెట్టుకోవాలో ప్రభుత్వానికి బాగా తెలుసని వ్యాఖ్యానించింది.