Begin typing your search above and press return to search.

కేంద్రానికి ఏపీ ప్ర‌భుత్వం చెప్ప‌నేలేదా?

By:  Tupaki Desk   |   4 Dec 2018 7:03 AM GMT
కేంద్రానికి ఏపీ ప్ర‌భుత్వం చెప్ప‌నేలేదా?
X
విశాఖప‌ట్నం విమానాశ్ర‌యంలో ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప్ర‌తిప‌క్ష నేత వై.ఎస్‌.జ‌గ‌న్‌మోహ‌న్ రెడ్డి పై కోడి క‌త్తితో చోటుచేసుకున్న దాడి కేసులో తాజాగా మ‌రో కీల‌క విష‌యం వెలుగులోకి వ‌చ్చింది. జ‌గ‌న్‌ పై హ‌త్యాయ‌త్నం సంబంధిత స‌మాచారాన్ని ఏపీ ప్ర‌భుత్వం కేంద్రానికి తెలియ‌జేయ‌నేలేద‌ట‌. విమానాశ్ర‌య ప‌రిధిలో చోటుచేసుకున్న నేర‌పూరిత‌ ఘ‌ట‌న‌ల‌పై కేంద్రానికి స‌మాచారం అందించ‌డం త‌ప్ప‌నిస‌రి అని నిబంధ‌న‌లు స్ప‌ష్టం చేస్తున్న‌ప్ప‌టికీ టీడీపీ ప్ర‌భుత్వం వాటిని ఎందుకు పాటించ‌లేద‌నే విష‌యం పై స‌ర్వ‌త్రా చ‌ర్చ జ‌రుగుతోంది.

త‌న‌పై జ‌రిగిన హ‌త్యాయ‌త్నానికి సంబంధించిన కేసు ద‌ర్యాప్తును పక్కదారి పట్టించేలా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, డీజీపీ మాట్లాడిన నేపథ్యంలో కేసు దర్యాప్తును స్వతంత్ర సంస్థకు అప్పగించేలా ఆదేశాలు ఇవ్వాలంటూ జగన్‌ హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. ఈ పిటిష‌న్‌ పై హైకోర్టు సోమ‌వారం విచార‌ణ నిర్వ‌హించింది. ఈ సంద‌ర్భంగా జగన్‌ తరఫు న్యాయవాది వాదనలు వినిపించారు. విమానాశ్ర‌యాల్లో జ‌రిగే ఘ‌ట‌న‌ల‌ పై ద‌ర్యాప్తు చేసే అధికారం నేష‌న‌ల్ ఇన్వెస్టిగేష‌న్ ఏజెన్సీ(ఎన్ఐఏ)కు ఉంద‌న్నారు. చంద్ర‌బాబు ప్ర‌భుత్వం మాత్రం కేసును నీరుగార్చాల‌న్న ఉద్దేశంతో రాష్ట్ర పోలీసుల‌తో ఈ ద‌ర్యాప్తు జ‌రిపిస్తోంద‌ని ఆరోపించారు.

జ‌గ‌న్ త‌ర‌ఫు న్యాయ‌వాది వాద‌న‌తో హైకోర్టు ఏకీభ‌వించింది. నిబంధ‌నల ప్ర‌కారం విమానాశ్ర‌యాల్లో దాడుల విష‌యాన్ని కేంద్రానికి నివేదించాల్సి ఉన్నా అలా ఎందుకు చేయ‌లేద‌ని నిల‌దీసింది. ఈ వ్య‌వ‌హారం పై ఇప్పుడు రాష్ట్రమంత‌టా చ‌ర్చ న‌డుస్తోంది. జ‌గ‌న్‌ పై హ‌త్యాయ‌త్నం కేసును నీరుగార్చాల‌నే ఉద్దేశ‌మే లేకుంటే కేసు సంబంధిత వివ‌రాల‌ను చంద్ర‌బాబు ప్ర‌భుత్వం క‌చ్చితంగా కేంద్రానికి నివేదించేది క‌దా అని ప‌లువురు ప్ర‌శ్నిస్తున్నారు. రాష్ట్ర పోలీసుల‌తో తూతూమంత్రంగా ద‌ర్యాప్తు జ‌రిపించి దాడి ఘ‌ట‌న‌ను చిన్న‌దిగా చూపించాల‌న్న‌దే చంద్ర‌బాబు వ్యూహం కావొచ్చ‌ని వారు అభిప్రాయ‌ప‌డుతున్నారు. కేంద్రంలో బీజేపీ స‌ర్కారుతో ప్ర‌స్తుతం బాబుకు పొస‌గ‌డం లేద‌ని కూడా గుర్తుచేస్తున్నారు. ఈ ప‌రిస్థితుల్లో కేంద్ర సంస్థ‌ల‌కు ద‌ర్యాప్తు బాధ్య‌త‌ను అప్ప‌గిస్తే.. తాము చిక్కుల్లో ప‌డ‌తామ‌ని బాబు బెదిరిపోయి ఉండొచ్చని కొంద‌రు విశ్లేష‌కులు చెప్పుకొచ్చారు. ఏది ఏమైనా హైకోర్టు జోక్యంతో ఇప్పుడు చంద్ర‌బాబు ప్ర‌భుత్వం త‌ల ప‌ట్టుకుంటోంద‌ని పేర్కొన్నారు. జ‌గ‌న్‌ పై హ‌త్యాయ‌త్నం కేసు పై జాతీయ మీడియాలోనూ ప్ర‌చారం జ‌రిగిన సంగ‌తిని మ‌రికొంద‌రు గుర్తుచేస్తున్నారు. అలాంట‌ప్పుడు దాడి స‌మాచారాన్ని త‌మ‌కు అంద‌జేయాలంటూ కేంద్ర‌మే నేరుగా రాష్ట్ర ప్ర‌భుత్వాన్ని ఆదేశించి ఉండొచ్చు క‌దా.. మ‌రి కేంద్రం ఎందుకు ఈ విష‌యాన్ని ప‌ట్టించుకోలేదు? అని వారు ఆశ్చ‌ర్య‌పోతున్నారు