Begin typing your search above and press return to search.

‘‘సెక్సియస్ట్’’ అని సారీ చెబితే సరిపోతుందా?

By:  Tupaki Desk   |   26 Jan 2016 4:38 AM GMT
‘‘సెక్సియస్ట్’’ అని సారీ చెబితే సరిపోతుందా?
X
తెలంగాణ సీఎంవో అదనపు కార్యదర్శి స్మితా సబర్వాల్ పై ఔట్ లుక్ వారపత్రిక ప్రచురించిన వ్యంగ్య కథనంపై హైకోర్టు అసంతృప్తి వ్యక్తం చేసింది. సదరు కథనంలో ఉపయోగించిన బాషపై అభ్యంతరం వ్యక్తం చేసింది. ఔట్ లుక్ కథనంపై స్మితా సబర్వాల్ న్యాయపోరాటం చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే.. ఈ వ్యవహారానికి సంబంధించి స్మితా సబర్వాల్ న్యాయపోరాటానికి ప్రభుత్వం నిధులు మంజూరు చేయటంపై ఔట్ లుక్ కేసు వేసింది. ఈ కేసు విచారణకు ఓకే చెప్పిన కోర్టు ప్రతివాదులకు నోటీసులు జారీ చేసింది. తాత్కాలిక హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దిలీప్ బి.బొసాలే.. న్యాయమూర్తి జస్టిస్ ఎస్ వీ భట్ లతో కూడిన ధర్మాసనం ఈ కేసును విచారించింది. ఈ కేసు తాజా విచారణలో ఔట్ లుక్ తరఫు న్యాయవాది వాదనలపై హైకోర్టు పలుమార్లు అసంతృప్తిని వ్యక్తం చేయటం గమనార్హం.

స్మితా సబర్వాల్ పై సెక్సియస్ట్ వ్యాఖ్యలు సరికావని.. చేయాల్సిందంతా చేసేసి సారీ చెప్పేస్తే సరిపోతుందా? అంటూ ప్రశ్నించటంతో పాటు.. ఈ కేసుకు సంబందించిన న్యాయపోరాటం చేసేందుకు స్మితా సబర్వాల్ కు నిధులు మంజూరు చేస్తూ జారీ చేసిన జీవో విషయంలో మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వలేమని పేర్కొంది.

న్యాయపరమైన ఖర్చుల నిమిత్తం స్మిత సబర్వాల్ కు తెలంగాణ ప్రభుత్వం రూ.15లక్షలు విడుదల చేసిన విషయాన్ని ప్రస్తావించిన తెలంగాణ రాష్ట్ర అడ్వొకేట్ జనరల్ కె.రామకృష్ణా రెడ్డి వాదనలు వినిపిస్తూ.. ఔట్ లుక్ ప్రచురించిన కథనం.. తదనంతర పరిణామాల గురించి వివరించారు. దీనికి కౌంటర్ గా ఔట్ లుక్ తరఫు న్యాయవాది తన వాదనను వినిపిస్తూ విధి నిర్వహణకు సంబంధించి ప్రభుత్వోద్యోగులు కేసు దాఖలు చేయటనికి వీల్లేదని.. ఇదే విషయాన్ని సుప్రీంకోర్టు స్పష్టం చేసిన అంశాన్ని ప్రస్తావించారు.

దీనిపై స్పందించిన ధర్మాసనం.. కార్టూన్ వేసి.. అభ్యంతరకర వ్యాఖ్యలు చేయటం ఎంతవరకు సబబు? అని ధర్మాసనం ప్రశ్నించింది. ఔట్ లుక్ ప్రచురించిన కథనం ఎంత అభ్యంతరకరంగా ఉందన్నది చదివితే అర్థమవుతుందని.. మహిళల హుందాతనాన్ని.. గౌరవాన్ని కాపాడాల్సిన బాధ్యత అందరిపై ఉందని వ్యాఖ్యానించింది. ‘‘మీరు రాస్తారు. నష్టం చేస్తారు. తర్వాత సారీ చెబుతారు. మీరు రాసిన సారీని ఎంతమంది చదివి ఉంటారు?కథనంలో చేసిన సెక్సియస్ట్ వ్యాఖ్యలు ఏ మాత్రం సంతృప్తికరంగా లేం’’ అని వ్యాఖ్యలు చేశారు. ఆమెకు మీరు సారీ చెప్పినంతమాత్రాన ఆమె కేసు వేయకూడదా? అంటూ హైకోర్టు ప్రకటించింది. చూస్తుంటే.. తాజా కేసులో ఔట్ లుక్ కు ఇబ్బందికర పరిస్థితి తప్పదన్న అభిప్రాయాన్ని పలువురు న్యాయనిపుణులు వ్యక్తం చేస్తున్నారు.