Begin typing your search above and press return to search.

స‌దావ‌ర్తిలో ఆళ్ల‌దే విజ‌యం!

By:  Tupaki Desk   |   1 Nov 2017 4:24 AM GMT
స‌దావ‌ర్తిలో ఆళ్ల‌దే విజ‌యం!
X
గుంటూరు జిల్లా ప‌రిధిలోని స‌దావ‌ర్తి స‌త్రానికి త‌మిళ‌నాడులో ఉన్న‌ భూముల వేలానికి సంబంధించి వైసీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామ‌కృష్ణారెడ్డి విజ‌యం సాధించేశారు. వెయ్యి కోట్ల‌కు పైగా విలువ క‌లిగిన ఈ భూముల‌ను టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడు స‌ర్కారు త‌న పార్టీకి చెందిన ఓ కీల‌క నేతకు కారు చౌక‌గా క‌ట్ట‌బెట్టేందుకు చ‌డీచ‌ప్పుడు లేకుండా పెద్ద త‌తంగ‌మే న‌డిపింద‌న్న ప్ర‌చారం జ‌రిగింది. ఈ ప్రచారం వాస్త‌వేమేనంటూ రంగంలోకి దిగేసిన ఆళ్ల రామ‌కృష్ణారెడ్డి నేరుగా కోర్టును ఆశ్ర‌యించారు. ఫ‌లితంగా తొలుత రూ.23 కోట్ల మేర‌కే ఈ భూముల‌ను ద‌క్కించుకున్న టీడీపీ నేత ఆ త‌ర్వాత వెన‌క్కు త‌గ్గ‌క త‌ప్ప‌లేదు. వ్య‌వ‌హారం కోర్టు గ‌డ‌ప తొక్కిన నేప‌థ్యంలో ఎలాగైనా ఈ వ్య‌వ‌హారాన్ని త‌మ‌కు అనుకూలంగా మ‌ల‌చుకోవాల‌ని టీడీపీ స‌ర్కారు య‌త్నించింద‌న్న వాద‌న కూడా వినిపించింది. అయితే ఏ ఒక్క‌రూ చేయ‌లేని ధైర్యం చేసిన ఆళ్ల‌... ఆ భూముల విలువ చాలా ఎక్కువ‌గా ఉంద‌ని, తిరిగి వేలం నిర్వ‌హించాల‌ని, వేలం కోర్టును అభ్య‌ర్థించిన విష‌యం తెలిసిందే.

తొలుత జ‌రిగిన వేలంలో ప‌లికిన ధ‌ర కంటే కూడా ఈ భూముల‌కు భారీ ధ‌ర ప‌లుకుతుంద‌ని కూడా ఆయ‌న వాదించారు. అయితే బాబు స‌ర్కారు కూడా త‌న‌దైన వాద‌న వినిపించ‌డంతో కోర్టు ఆళ్లకు పెద్ద షాకే ఇస్తూ... తొలుత జ‌రిగిన వేలంలో వ‌చ్చిన మొత్తానికి రూ.5 కోట్లను అద‌నంగా డిపాజిట్ చేయాల‌ని, మొత్తంగా రూ.27 కోట్ల‌ను జ‌మ చేయాల‌ని ఆదేశాలు జారీ చేసింది. అయితే ఈ విష‌యంపై మంచి పట్టు సాధించిన ఆళ్ల ఏమాత్రం వెన‌క్కు త‌గ్గ‌కుండా కోర్టు ఆదేశాల మేరకు ప్ర‌భుత్వానికి రూ.27 కోట్ల‌ను జ‌మ చేశారు. త‌ర్వాత జ‌రిగిన వేలంలో ఈ భూములు రూ. 50 కోట్ల‌కు పైగా ప‌ల‌క‌డంతో బాబు స‌ర్కారు షాక్ తిన్న‌ది. రెండో ద‌ఫా జ‌రిగిన వేలంలో ఆళ్ల కూడా పాలుపంచుకున్నా... పెద్ద‌గా ఎక్కువ ధ‌ర‌ను కోట్ చేయ‌లేదు. ఇదే క్ర‌మంలో త‌మిళ‌నాడు ప్ర‌భుత్వం ఈ వ్య‌వ‌హారంలో జోక్యం చేసుకుంటూ... అస‌లు త‌మ రాష్ట్ర ప‌రిధిలోని స‌ద‌రు భూములు స‌దావ‌ర్తి స‌త్రానికి చెందిన‌వి కావ‌ని మ‌రో పిటిష‌న్ దాఖ‌లు చేసింది. ఫ‌లితంగా ఈ భూములు ఎవ‌రివో తేల్చేదాకా వేలం నిర్వ‌హ‌ణ కుద‌ర‌ద‌ని తేల్చేసింది.

మ‌రి ఆళ్ల రామకృష్ణారెడ్డి ప్ర‌భుత్వం వ‌ద్ద డిపాజిట్ చేసిన డ‌బ్బుల మాటేమిటి? అన్న ప్ర‌శ్న ఇక్క‌డ ఉద‌యించింది. ఇదే విష‌యంపై కోర్టును ఆశ్ర‌యించిన ఆళ్ల‌... త‌న డ‌బ్బును త‌న‌కు ఇప్పించాల‌ని విన్న‌వించారు. దీనిపై నిన్న సుదీర్ఘ విచార‌ణ జ‌రిపిన తెలుగు రాష్ట్రాల ఉమ్మ‌డి హైకోర్టు ఆళ్ల‌కు అనుకూలంగా తీర్పునిచ్చింది. ఈ మొత్తాన్ని రెండు వారాల్లోగా ఆళ్ల‌కు తిరిగి ఇచ్చేయాల‌ని కూడా స్ప‌ష్ట‌మైన తీర్పు చెప్పింది. అంతేకాకుండా అస‌లు ఈ భూములు ఎవ‌రివో తేల్చాలంటూ కూడా బాబు స‌ర్కారుకు ఆదేశాలు జారీ చేసింది. త‌మిళ‌నాడు ప్ర‌భుత్వం వేసిన పిటిష‌న్‌ కు కౌంట‌ర్ దాఖ‌లు చేయాల‌ని ఆదేశించింది. ఈ వ్యవ‌హారంలో అస‌లు విజ‌యం ఎవ‌రిని వ‌రించింది అన్న విష‌యానికి వ‌స్తే.. ముమ్మాటికీ వైసీపీ కీల‌క నేత ఆళ్ల రామ‌కృష్ణారెడ్డే విజ‌యం సాధించార‌ని చెప్ప‌క త‌ప్ప‌దు.

ఎందుకంటే... ప్ర‌భుత్వం గుట్టుచ‌ప్పుడు కాకుండా జ‌రిపించిన వేలంలో అధికార పార్టీకి చెందిన నేత‌లు ఆ భూముల‌ను చాలా త‌క్కువ ధ‌ర‌ల‌కు కొన్నార‌ని, దీనిని ర‌ద్దు చేయాల‌ని ఆళ్ల పిటిష‌న్ వేశారు. ఆళ్ల కోరుకున్న‌ట్టుగానే ఆ భూముల వేలం ర‌ద్దు కాగా... ఇప్పుడు ఆయ‌న కోర్టు ఆదేశాల మేర‌కు క‌ట్టిన సొమ్మును కూడా తిరిగి తీసుకునేందుకు అవ‌కాశం చిక్కింది. అదే స‌మ‌యంలో ఈ భూములు ఎవ‌రివో తేల్చాలంటూ బాబు స‌ర్కారుకు కోర్టు నోటీసుల మీద నోటీసులు జారీ చేస్తుండ‌టం కూడా ఇప్పుడు పెద్ద చ‌ర్చ‌నీయాంశంగా మారింది. వెర‌సి ఆళ్ల చేసిన పోరాటంలో బాబు స‌ర్కారు బొక్క బోర్లా ప‌డ‌గా, స‌దావ‌ర్తి స‌త్రం భూములు మాత్రం అన్యాక్రాంతం కాకుండా కోర్టే ప‌క్కా ఆదేశాలు జారీ చేసింది. ఇప్ప‌టికే ఈ వ్య‌వ‌హారంలో త‌లబొప్పి క‌ట్టిన బాబు సర్కారు ఎలా బ‌య‌ట‌ప‌డుతుందో చూడాలి.