Begin typing your search above and press return to search.

ఇది కూడా హైకోర్టే చెప్పాలా చంద్రుళ్లు?

By:  Tupaki Desk   |   28 March 2016 12:21 PM GMT
ఇది కూడా హైకోర్టే చెప్పాలా చంద్రుళ్లు?
X
పాలకుడి పని ఏంది? ఈ ప్రశ్నకు ఒకే ఒక్క మాటతో సమాధానం చెప్పాలంటే.. తమ పరిధిలో ప్రజలందరి సంక్షేమం చూడటమే. ప్రాధమికంగా వారేం చేయాలో.. వారి కనీస బాధ్యతను కూడా కోర్టులే గుర్తు చేయాల్సిన దుస్థితి ఉందా? అన్న ప్రశ్న వేసుకుంటే అవునని చెప్పక తప్పదు. తాజాగా ఉమ్మడి హైకోర్టు వెలువరించి తాజా ఆదేశం చూస్తే.. తెలుగు ప్రాంతాల్లో పాలకుల స్పందన మరీ ఇంత అధ్వానంగా ఉందా? అనిపించక మానదు.

రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉష్ణోగ్రతలు తీవ్రంగా ఉండి.. వడగాలుల తీవ్రత కూడా భారీగా ఉండటంపై హైకోర్టు తాజాగా విచారణ చేపట్టింది. వడగాలులపై కార్యాచరణ ప్రణాళికను రెండు తెలుగు రాష్ట్రాలు హైకోర్టు సమర్పించాయి. వీటిని పరిశీలించిన ప్రభుత్వం.. వెంటనే కార్యాచరణను అమలు చేయాలంటూ ప్రభుత్వాల్ని ఆదేశించింది. ఇంతకీ కోర్టు ఏం చెప్పిందో చూస్తే.. ఎండ తీవ్రత ఎక్కువగా ఉంటే పొలాల్లో కార్మికులు పని చేయకుండా చూడటం.. ఎండల్లో బయటకు వెళ్లకుండా చూడటం లాంటి అంశాల మీద ప్రజల్లో చైతన్యం పెరిగేలా చూడటం లాంటివి చూడాలని హైకోర్టు సూచించింది.

ఈ కేసు ఉదంతంపై తదుపరి విచారణను మూడు వారాలకు వాయిదా వేసింది. ఎండల తీవ్రత ఎక్కువగా ఉండి.. వడదెబ్బ బాధితులు ఎక్కువగా ఉండి.. ఎండల తీవ్రతకు పిట్టల్లా ప్రజలు రాలిపోతుంటే.. ఇలాంటి చర్యలు హైకోర్టులు ఆదేశిస్తే తప్ప రెండు తెలుగు రాష్ట్ర ముఖ్యమంత్రులకు చురుకుపుట్టదా? వాతావరణంలో వచ్చిన మార్పుల్ని కూడా చంద్రుళ్లు గుర్తించలేనంత బిజీగా ఉన్నారా? ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు సంగతి పక్కన పెడితే.. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ఎండ తీవ్రతను స్వయంగా రెండు సందర్భాల్లో ఫేస్ చేశారు.

ఈ మధ్యన వరంగల్ పర్యటనకు వెళ్లిన ఆయన.. ఎండ తీవ్రత ఎక్కువగా ఉండటంతో తన ప్రయాణానికి గంటకు పైగా వాయిదా వేసుకొని.. హెలికాఫ్టర్ ను ఫుల్ కూలింగ్ లోకి వచ్చిన తర్వాతే ప్రయాణానికి బయలు దేరారు. ఇదొక్కటే కాదు.. తెలంగాణ స్పీకర్ మధుసూధనాచారి వడదెబ్బకు గురై అస్వస్థతకు గురి అయ్యారు. స్వయంగా ఎండ తీవ్రత తనకే ఎదురైనప్పుడు సాదాసీదా ప్రజల గురించిన ఆలోచన కేసీఆర్ కు ఎందుకు రానట్లు..?