Begin typing your search above and press return to search.

పోలీసుల ముందు హాజ‌రు కావాల్సిందే: సునీల్ క‌నుగోలుకు హైకోర్టు ఆదేశం

By:  Tupaki Desk   |   3 Jan 2023 4:30 PM GMT
పోలీసుల ముందు హాజ‌రు కావాల్సిందే:  సునీల్ క‌నుగోలుకు హైకోర్టు ఆదేశం
X
`తెలంగాణ గళం` పేరుతో సోషల్‌ మీడియాలో సర్క్యులేట్‌ అయిన మీమ్స్‌ వీడియోల కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న కాంగ్రెస్ పార్టీ వ్యూహకర్త సునీల్‌ కనుగోలుకు హైకోర్టులో చుక్కెదురైంది. ఆయ‌న‌పై తెలంగాణ సైబ‌ర్ క్రైం పోలీసులు న‌మోదు చేసిన కేసు విష‌యంలో స్వ‌యంగా హాజ‌రు కావాల‌ని.. హైకోర్టు ఆదేశించింది. అంతేకాదు, పోలీసుల విచార‌ణ‌కుసైతం స‌హ‌క‌రించాల‌ని సూచించింది. అయితే, పిటిష‌న‌ర్ అభ్య‌ర్థ‌న మేర‌కు ఈ నెల 8న అత‌నిని విచారించాల‌ని పోలీసుల‌కు సూచించింది.

ఆ రోజు ఖ‌చ్చితంగా పోలీసుల ముందుకు సునీల్ వెళ్లి తీరాల‌ని స్ప‌స్టం చేసింది. ఈ మేర‌కు మంగ‌ళ‌వారం హైకోర్టు తీర్పు ఇచ్చింది. ప్ర‌స్తుతం కాంగ్రెస్ తెలంగాణ వ్యూహ‌క‌ర్త‌గా ఉన్న సునీల్ క‌నుగోలు..  `తెలంగాణ గళం` పేరుతో ఒక వేదిక‌ను సృష్టించుకున్నారు. దీని ద్వారా.. ప్ర‌భుత్వంపై విమ‌ర్శ‌లు చేస్తున్నార‌నేది ప్ర‌ధాన ఆరోప‌ణ‌. ఈ క్ర‌మంలోనే తుకారాంగేట్‌ ప్రాంతానికి చెందిన ప్రైవేట్‌ ఉద్యోగి ఆర్‌.సామ్రాట్ గతేడాది నవంబర్‌ 24న హైదరాబాద్‌ సైబర్‌ క్రైమ్‌ పోలీసుస్టేషన్‌లో తెలంగాణ గ‌ళంపై ఫిర్యాదు చేశారు.

దీంతో కేసు న‌మోదు చేసిన పోలీసులు ఈ నెల 13న రాత్రి మాదాపూర్‌లోని మైండ్‌షేర్‌ యునైటెడ్‌ ఫౌండేషన్‌లో ఉన్న కార్యాలయంపై దాడి చేశారు. సోషల్‌ మీడియాలో మీమ్స్‌ వీడియోల కేసుకు సంబంధించి   సునీల్‌ కనుగోలుకు సిటీ సైబర్‌క్రైమ్‌ పోలీసులు ఇటీవల సీఆర్పీసీ 41 (ఏ) కింద  నోటీసులు ఇచ్చారు. విచారణకు రాకపోతే అరెస్టు సహా ఇతర చర్యలు తీసుకుంటామని నోటీసుల్లో పోలీసులు స్పష్టం చేశారు.

అయితే, ఈ నోటీసుల‌ను సునీల్ క‌నుగోలు హైకోర్టులో స‌వాల్ చేశారు. 41 ఏ సీఆర్‌పీసీ సెక్షన్ కింద ఇచ్చిన నోటీసుపై స్టే ఇవ్వాలని కోరారు. దీనిపై తాజాగా  విచారణ జరిపిన హైకోర్టు.. సైబ‌ర్ క్రైం పోలీసుల వాద‌న‌తో ఏకీభ‌వించింది. విచార‌ణ‌కు వెళ్లాల‌ని, ఈ ద‌శ‌లో జోక్యం చేసుకోలేమ‌ని  స్ప‌ష్టం చేసింది. అయితే, సునీల్‌ కనుగోలును అరెస్ట్‌ చేయవద్దని ఆదేశించింది.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.