Begin typing your search above and press return to search.

శత్రుచర్లకు భారీ షాకిచ్చిన హైకోర్టు

By:  Tupaki Desk   |   17 Oct 2016 5:48 PM GMT
శత్రుచర్లకు భారీ షాకిచ్చిన హైకోర్టు
X
కాంగ్రెస్ సీనియర్ నేతగా అందరికి సుపరిచితమై.. రాష్ట్ర విభజన అనంతరం చోటు చేసుకున్న పరిణామాలతో తెలుగుదేశం పార్టీలో చేరిన మాజీ మంత్రి శత్రుచర్ల విజయరామరాజుకు హైకోర్టు నుంచి ఊహించని షాక్ తగిలింది. 1999 నుంచి 2004 వరకు శ్రీకాకుళం జిల్లా నాగూరు ఎమ్మెల్యేగా ఉన్న శత్రుచర్ల ప్రాతినిధ్యం వహించింది ఎస్టీ నియోజకవర్గం. స్వతహాగా క్షత్రియుడైన విజయరామరాజు ఎస్టీగా పోటీ చేయటంపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ.. నిమ్మక జయరాజు కోర్టును ఆశ్రయించారు.

ఈ వ్యవహారంపై సుదీర్ఘంగా సాగిన వాదనల అనంతరం తాజాగా ఈ అంశంపై హైకోర్టు సంచలన నిర్ణయాన్ని వెల్లడించింది. ఎస్టీ నియోజకవర్గం నుంచి శత్రుచర్ల ఎన్నిక చెల్లదన్న అంశంపై సుప్రీంకోర్టువరకూ వాదోపవాదాలు సాగటం.. అక్కడ ఆయనకు ఎదురుచుక్క ఎదురైంది. విజయరామరాజు క్షత్రియుడేనని తేల్చిన అత్యున్నత న్యాయస్థానం.. ఆయన ఎన్నిక సరికాదని తేల్చింది. ఇదిలా ఉంటే.. 2014లో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో విజయరామరాజు శ్రీకాకుళం జిల్లా పాతపట్నం నియోజకవర్గం నుంచి పోటీ చేసి.. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి రమణమూర్తి చేతిలో పరాజయం పాలయ్యారు.

ఇదిలా ఉంటే.. ఎమ్మెల్యేగా శత్రుచర్ల ఎన్నిక సరికాదని తేలిన నేపథ్యంలో.. ఆయన పొందిన ‘‘ఎమ్మెల్యే వేతనం’’ సంగతి ఏమిటంటూ ఒక పిటీషన్ దాఖలైంది. దీనిపై విచారణ జరిపిన హైకోర్టు తాజాగా తన నిర్ణయాన్ని వెల్లడించింది. తప్పుడు వివరాలతో ఎన్నికైన శత్రుచర్ల.. ఎమ్మెల్యేగా ప్రభుత్వం నుంచి పొందిన వేతనం మొత్తాన్ని తిరిగి ఇచ్చేయాలంటూ తేల్చింది. తాజా తీర్పు దేశ రాజకీయాల్లో పెను చర్చకు దారి తీస్తుందన్న వాదన వ్యక్తమవుతోంది. చాలామంది నాయకులు తమ కులాల్నితప్పుగా పేర్కొని.. రిజర్వ్ స్థానాల నుంచి పోటీ చేసి విజయం సాధించటం.. అనంతరం వారి నియామకం చెల్లదని కోర్టులు తేలుస్తున్న వేళ.. ఇలాంటి వారిపై తీసుకోవాల్సిన చర్యలకు సంబంధించి తాజాగా హైకోర్టు వెలువరించిన తీర్పు కొత్తగా దిశానిర్దేశం చేస్తుందన్న వాదనలు వినిపిస్తున్నాయి. కొసమెరుపు ఏమిటంటే.. శత్రుచర్ల ఏ నియోజకవర్గం నుంచి ఎన్నికయ్యారో.. సదరు నియోజకవర్గం 2009లో జరిగిన నియోజకవర్గాల పునర్విభజనలో భాగంగా మాయమైంది. ఇప్పుడు అసెంబ్లీ నియోజకవర్గంగా లేని స్థానానికి ఎమ్మెల్యేగా పదవీ కాలం పూర్తి అయ్యాక.. తాను పొందిన జీతాన్ని శత్రుచర్ల తిరిగి ఇవ్వాల్సిన పరిస్థితి. ఇలాంటి తప్పులకు పాల్పడే నేతలకు.. ఇలాంటి సింఫుల్ జరిమానాలతో సరిపుచ్చకుండా ఎన్నికల్లో పోటీ చేయకుండా నిషేధాన్ని విదించాలన్న అభిప్రాయాన్ని పలువురు వ్యక్తం చేస్తున్నారు. మరి.. ఈ వాదనను కోర్టు దృష్టికి తీసుకొస్తూ.. ఎవరైనా పిటిషన్ దాఖలు చేస్తారో చూడాలి.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/