Begin typing your search above and press return to search.

సీరియస్‌: మీవల్ల కాకపోతే చెప్పండి!

By:  Tupaki Desk   |   15 April 2015 6:06 AM GMT
సీరియస్‌: మీవల్ల కాకపోతే చెప్పండి!
X
ఎక్కడబడితే అక్కడ, ఎవరిది బడితే వారి ఆనందాలను, గొప్పలను ప్లెక్సీల రూపంలో ముద్రించి రోడ్లపై కట్టేయడం ఫ్యాషన్‌ అయిపోయింది. సందర్భం ఏదైనా... తమ అభిమానాన్ని చాటుకోవడానికి ప్లెక్సీలను, బ్యానర్లను, కొన్ని సార్లు కటౌట్ల ను కూడా నడిరోడ్లపై అమర్చేస్తున్నారు. వీటిపై ఎన్ని ఇబ్బందులను ఎదుర్కొన్నా... ఎవరికి చెప్పుకోవాలో తెలియని పరిస్థితి. వీటిపై హైకోర్టు చాలా సీరియస్‌ గా స్పందించింది. బహిరంగ ప్రదేశాల్లో అనుమతులు లేకుండా వెలిసిన ఫ్లెక్సీలు, బ్యానర్లు, హోర్డింగ్‌ లు, కటౌట్లను వెంటనే తొలగించాలని సూచించింది. గతంలోనే హైకోర్టు ఈ దిశగా ఆదేశాలు ఇచ్చినా... అధికారులు స్పందించకపోవడంతో... గతంలో ఇచ్చిన ఆదేశాలను ఈ నెల 17లోగా అమలు చేసి తీరాల్సిందేనని హైకోర్టు ధర్మాసనం స్పష్టం చేసింది. అనుమతులు లేకుండా అనధికారికంగా ఏర్పాటు చేస్తున్న ఫ్లెక్సీలు, బ్యానర్లు, కటౌట్లు, హోర్డింగ్‌లను తొలగించాలన్న కోర్టు ఆదేశాలను అమలు చేయడంలో అధికారులు పూర్తిగా విఫలమయ్యారని కోర్టు అభిప్రాయపడింది.

ఈ విషయాన్ని సీరియస్‌ గా తీసుకున్న కోర్టు... ''వాటిని తొలగించడం మీవల్ల కాకపోతే చెప్పండి... వాటిని తొలగించడానికి మేమే చర్యలు చేపడతాం'' అని హెచ్చరించింది. ప్రముఖుల పుట్టిన రోజులు, పండగ రోజులు, సినిమా విడుదలకు... శుభాకాంక్షలకు... ఏదైనా సరే ప్లెక్సీల రూపంలో కనిపించాల్సిందే! వీటిని తొలగించకపోవడంపై హైకోర్టు అసంతృప్తి వ్యక్తం చేసింది. ఇప్పటికైనా కోర్టు ఆదేశాలను అధికారులు పరిగణలోకి తీసుకుంటే... ఈ నెల 17 లోపు అనధికారిక ఫ్లెక్సీలు, బ్యానర్లు, కటౌట్లు, హోర్డింగ్‌లను తొలగిస్తారన్నమాట! అలా కాని పక్షంలో కోర్టు వారే ఆపనికి పూనుకుంటారు!