Begin typing your search above and press return to search.

సారు సర్కారు ఉక్కిరిబిక్కిరి అయ్యేలా హైకోర్టు ప్రశ్నలు

By:  Tupaki Desk   |   19 May 2020 6:15 AM GMT
సారు సర్కారు ఉక్కిరిబిక్కిరి అయ్యేలా హైకోర్టు ప్రశ్నలు
X
ప్రశ్న అడిగే అవకాశం ఉన్న వ్యవస్థలపై కస్సుమనే ప్రభుత్వాలతో.. ప్రశ్నించే తత్త్వం తగ్గి పోతుంటే.. ప్రశ్నకు సమాధానం చెప్పే జవాబుదారీ తనం ప్రభుత్వాల్లో మిస్ అవుతోంది. ఒకవేళ ఎవరైనా ధైర్యం చేసి ప్రశ్నించే ప్రయత్నం చేస్తే..వారికి ఎలాంటి సమాధానాలు ఎదురవుతున్నాయో ఇటీవల కాలంలో చూస్తున్నదే. మాయదారి రోగంతో ఉక్కిరిబిక్కిరి అవుతున్న వేళ.. ప్రభుత్వాలు వ్యవహరించాల్సిన తీరు విషయంలో ఒక్కో ప్రభుత్వం ఒక్కోలా వ్యవహరిస్తోంది.

ఎక్కడి దాకానో ఎందుకు? రెండు తెలుగు రాష్ట్రాల సంగతే చూద్దాం. ఏపీలో అనుమానిత పరీక్షలు భారీగా చేస్తుంటే.. తెలంగాణలో మాత్రం ఆచితూచి అన్నట్లు చేస్తున్నారు. ఎందుకిలా అంటే.. అతకని వాదనను వినిపిస్తున్నారు. అదెలా అన్న సందేహాన్ని సంధిస్తే.. ఎంసీఆర్ గైడ్ లైన్సు ను ప్రస్తావించి.. అందులోని ఒక క్లాజ్ ను తాము ఫాలో అవుతున్నట్లుగా చెప్పే పరిస్థితి.

ఒక ప్రత్యేక సమయంలో.. ఎవరికి తోచినట్లు వారుకాకుండా.. అందరూ ఒకేలా వ్యవహరిస్తే బాగుంటుంది. కానీ.. అలాంటి పరిస్థితి ఇప్పుడు లేదు. ఇదిలా ఉంటే.. తెలంగాణ హైకోర్టు వేసిన ప్రశ్నలు సారు సర్కారును ఉక్కిరిబిక్కిరి చేశాయని చెప్పాలి. ఇదే తరహాలో ప్రశ్నల్ని సంధించాల్సిన మీడియా.. అందుకు భిన్నంగా మౌనంగా వ్యవహరిస్తోంది. ఈ సమయంలో హైకోర్టు వేసిన ప్రశ్నలు ఆసక్తికరంగానే కాదు.. ప్రభుత్వాల్లో అప్రమత్తతను మరింత పెంచేలా ఉన్నాయని చెప్పాలి.

సూర్యాపేటలో పెద్ద ఎత్తున పాజిటివ్ లు రావటం.. ఆ తర్వాత కొద్ది రోజులకే సూర్యాపేట జిల్లాను మాయదారి రోగ రహిత జిల్లాగా ప్రభుత్వం ప్రకటించింది. ఇదే అంశాన్ని హైకోర్టు తాజాగా ప్రశ్నించింది. అలా ఎలా చేస్తారో చెప్పాలని కోరింది. అంతేకాదు.. సూర్యాపేటతో సహా రాష్ట్ర వ్యాప్తంగా ఏప్రిల్ 22 నుంచి ఇప్పటివరకూ రాష్ట్రంలో ఎన్ని నిర్దారణ పరీక్షలు చేశారో చెప్పాలని కోరింది.

కేరళలో మాదిరి మొబైల్ టెస్టింగ్ కేంద్రాలు ఉన్నాయా? ప్రజలు స్వచ్చందంగా పరీక్షలు చేయించుకోవటానికి అవసరమైన ల్యాబ్ లు ఉన్నాయా? అన్న ప్రశ్నల్ని ధర్మాసనం సంధించింది. మాయదారిరోగ నిర్దారణకు సంబంధించి జాతీయ సగటుతో పోలిస్తే.. తెలంగాణలో తక్కువ పరీక్షలు చేస్తున్నట్లు కోర్టు ముందుకువచ్చింది. ఫలితంగా సామూహిక వ్యాప్తికి దారి తీసే ప్రయమాదం ఉందన్నారు. మీడియా అడిగే ప్రశ్నలకు సమాధానం ఇవ్వకుండా తిట్ల వర్షం కురిపించే సారు సర్కారు.. హైకోర్టుకు ఏమని బదులిస్తారన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.