Begin typing your search above and press return to search.

కరోనా పరీక్షలు పెంచాలని తెలంగాణ ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశం

By:  Tupaki Desk   |   8 Jun 2022 10:05 AM GMT
కరోనా పరీక్షలు పెంచాలని తెలంగాణ ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశం
X
ప్రపంచాన్ని పట్టి పీడించిన కరోనా మహమ్మారి పీడ వదిలేలా కనిపించడం లేదు. థర్డ్, ఫోర్త్ వేవ్ ల పేరిట విరుచుకుపడుతూనే ఉంది. దేశంలోనూ మరోసారి కేసులు పెరగడం ఆందోళన కలిగిస్తోంది. దేశంలో టీకాలు పంపిణీ చేయడంతో పెద్దగా వేరియంట్ ప్రభావం చూపించడం లేదు. కానీ కొత్త వేరియంట్లు మాత్రం పుట్టుకొస్తూ ఆందోళనకు కారణమవుతున్నాయి.

తెలంగాణలో కరోనా కొత్త వేరియంట్ బీఏ5 కేసు రాష్ట్ర రాజధాని హైదరాబాద్ లో నమోదైంది. కొన్ని రోజుల కిందే బీఏ4 కేసు నమోదుకాగా.. ఈ రెండు వేరియంట్ కేసులు దేశంలో తొలిసారి మన దగ్గర రికార్డయ్యాయి. బీఏ4, బీఏ5 ఒమిక్రాన్ సబ్ వేరియంట్స్. కాబట్టి తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉండదన్నారు.

తెలంగాణలో కరోనా కేసులు పెరుగుతుండడంపై హైకోర్టు ఆందోళన వ్యక్తం చేసింది. రాష్ట్రంలోనూ కరోనా పరీక్షలను ముమ్మరం చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది.కోవిడ్ జాగ్రత్తలు అందరూ పాటించేలా చూడాలని స్పష్టం చేసింది. కరోనాపై మరింత అప్రమత్తం అవసరం అని తెలిపింది. వైరస్ బారిన పడి చనిపోయిన వారికి ఎక్స్ గ్రేషియా ఇలా ఇస్తున్నారన్న దానిపై నివేదిక ఇవ్వాలని తేల్చిచెప్పింది.

కరోనా పరిస్థితులపై విచారణ చేపట్టిన హైకోర్టు ప్రభుత్వానికి కీలక ఆదేశాలు జారీ చేసింది. తదుపరి విచారణను ఈనెల 22కు వాయిదా వేసింది. గత కొన్ని రోజులుగా దేశంలో కరోనా కేసులు పెరుగుతున్నాయి. తాజాగా కరోనా కేసుల సంఖ్య 5వేల మార్క్ దాటింది. మరోవైపు యాక్టివ్ కేసుల సంఖ్య రెట్టింపు కావడం ఆందోళనకు గురిచేస్తోంది. ప్రస్తుతం క్రియాశీల కేసులు 29వేలకు చేరువలో ఉన్నాయి.

ఈ క్రమంలోనే రాష్ట్రాలను కేంద్రప్రభుత్వం అలెర్ట్ చేసింది. వైరస్ పట్ల అప్రమత్తం ముఖ్యమని సూచిస్తోంది. గడిచిన 24 గంటల్లో 13149 నమూనాలను పరీక్షించగా 119 మందిలో వైరస్ ఉన్నట్లు గుర్తించారు. అంతకుముందు రాష్ట్రంలో 65 కేసులు నమోదయ్యాయి. ప్రస్తుతం తెలంగాణలో యాక్టివ్ కేసుల సంఖ్య 658కు చేరింది.

ఇటీవల హైదరాబాద్ లో క్రమేపీ కేసులు పెరుగుతున్నాయి.దీంతో తెలంగాణ ప్రభుత్వం సైతం అలెర్ట్ అయ్యింది. మాస్క్ ను తప్పనిసరిగా ధరించాలని ఆదేశించింది.