Begin typing your search above and press return to search.

వీరప్పన్ పేరిట అన్నదానం..బ్యానర్లు కూడానంట

By:  Tupaki Desk   |   14 Oct 2015 9:09 AM GMT
వీరప్పన్ పేరిట అన్నదానం..బ్యానర్లు కూడానంట
X
గంధపు చెక్కల స్మగ్లర్ గా సుపరిచితుడైన వీరప్పన్ గురించి ఇప్పటి తరానికి కాస్త తక్కువగా తెలుసు కానీ.. ఓ ఇరవైఏళ్ల కిందట అయితే.. అతని పేరు దక్షిణాదిన మారుమోగేది. కర్ణాటక.. తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వాల్ని గడగడలాడించిన అతగాడిని మట్టు పెట్టేందుకు భారీగా ప్రయత్నాలు జరగటం..ఈ ప్రయత్నంలో పెద్ద ఎత్తున పోలీసులు.. విచారణ అధికారులు ప్రాణాలు కోల్పోవటం తెలిసిందే.

అడవిలోని గంధం చెట్లను నరికివేస్తూ.. అక్రమంగా విదేశాలకు తరలించే వీరప్పన్ జోరుకు రెండు రాష్ట్ర సర్కార్లు కిందామీద పడిపోయిన పరిస్థితి. ఇలాంటి నేపథ్యంలో పోలీసు బలగాలు ఆయన్ను హతమార్చటంతో వీరప్పన్ కోసం వెతికే ఎపిసోడ్ ముగిసింది. వీరప్పన్ మరణం తర్వాత.. ఆయన అనుచరులంతా చెట్టుకొకరు.. పుట్టకొకరన్నట్లుగా చెదిరిపోయారు.

రక్తం తాగే వ్యక్తిగా వీరప్పన్ కు పేరు ప్రఖ్యాతులు ఉన్నాయి. అలాంటి వీరప్పన్ మళ్లీ వార్తల్లోకి వచ్చారు. ఈ అక్టోబర్ 18 నాటికి పోలీసుల చేతిలో వీరప్పన్ మరణించి పదేళ్లు కావొస్తోంది. ఈ నేపథ్యంలో ఆయన భార్య ముత్తులక్ష్మి సంస్మరణ కార్యక్రమాన్ని నిర్వహించేందుకు మద్రాస్ హైకోర్టును ఆశ్రయించారు. దీనికి సానుకూలంగా స్పందించిన హైకోర్టు వీరప్పన్ సంస్మరణ కార్యక్రమాలు నిర్వహించుకోవటానికి.. ఆయన పేరిట అన్నదానం జరుపుకోవటానికి అనుమతిని ఇచ్చింది.

సంస్మరణ కార్యక్రమాలకు సంబంధించి కోర్టు ఇచ్చిన అనుమతి ప్రకారం.. అన్నదానం జరిగే ప్రాంతంలో వీరప్పన్ పేరిట బ్యానర్లు పెట్టుకోవచ్చని పేర్కొంది. అన్నదానం పెడుతూ.. వీరప్పన్ పేరిట బ్యానర్లు అంటే.. అందులో ఏం రాస్తారో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదేమో. వీరప్పన్ లాంటి గంధం చెక్కల స్మగ్లర్ల గురించి సంస్మరణ జరుపుకోవటం తప్పేం కాదు.. కానీ.. ఇంటివరకూ పరిమితం చేస్తే బాగుండేదన్న అభిప్రాయం పలువురు వ్యక్తం చేస్తున్నారు.