Begin typing your search above and press return to search.

దివాక‌ర్ ట్రావెల్స్‌... బాబుకు గుదిబండేనా!

By:  Tupaki Desk   |   28 Jun 2017 4:31 AM GMT
దివాక‌ర్ ట్రావెల్స్‌... బాబుకు గుదిబండేనా!
X
దివాక‌ర్ ట్రావెల్స్‌... పేరు చెప్ప‌గానే మ‌న‌కు అనంత‌పురం ఎంపీ జేసీ దివాక‌ర్ రెడ్డితో పాటు ఆయ‌న త‌మ్ముడు - అనంత‌పురం జిల్లా తాడిప‌త్రి ఎమ్మెల్యే జేసీ ప్ర‌భాక‌ర్ రెడ్డి గుర్తుకు వ‌స్తారు. అంతేనా... ఆ బ‌స్సుల్లో ప్ర‌యాణించి ప్రాణాలు కోల్పోయిన ఎంద‌రో బాధితులు కూడా గుర్తుకు రాక మాన‌రు. ఓ పాలేరు ప్ర‌మాదం... ఓ మూల‌పాడు ప్ర‌మాదం... ఈ రెండు చాలు ఆ బ‌స్సులు ఏపాటి క్షేమ‌క‌ర‌మో. ఇక మొన్న‌టిదాకా కాంగ్రెస్‌ లో ఉన్న ఈ అన్నాత‌మ్ముళ్లిద్ద‌రూ గ‌డ‌చిన ఎన్నిక‌లకు కాస్త ముందుగా టీడీపీలో చేరిపోయారు. చేరిన వెంట‌నే వారిద్ద‌రికీ టికెట్లు ఇచ్చి మ‌రీ టీడీపీ అధినేత‌ - ఏపీ సీఎం నారా చంద్ర‌బాబునాయుడు అత్యధిక ప్రాధాన్య‌మిచ్చారు. ఇప్పుడు వారి ట్రావెల్స్ బ‌స్సుల కార‌ణంగానే చంద్ర‌బాబుకు ఇబ్బందులు త‌ప్ప‌డం లేద‌న్న వాద‌న వినిపిస్తోంది.

వ‌రుస ప్ర‌మాదాల‌తో ప‌దుల సంఖ్య‌లో జ‌నం ప్రాణాల‌ను తీసేసిన ఆ బ‌స్సులపై ప్ర‌స్తుతం తెలుగు రాష్ట్రాల ఉమ్మ‌డి హైకోర్టులో విచార‌ణ సాగుతోంది. దివాక‌ర్ ట్రావెల్స్ బ‌స్సులు రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా కార్య‌క‌లాపాలు సాగిస్తున్న నేప‌థ్యంలో ఈ కేసుకు సంబంధించి ఏపీతో పాటు తెలంగాణ స‌ర్కారు కూడా కౌంట‌ర్ దాఖ‌లు చేయాల‌ని హైకోర్టు డివిజ‌న్ బెంచ్ రెండు ప్ర‌భుత్వాల‌కు ఆదేశాలు జారీ చేసింది. కోర్టు ఆదేశాల మేర‌కు ఇరు రాష్ట్రాల ప్ర‌భుత్వాలు కూడా త‌మ త‌మ కౌంట‌ర్ పిటిష‌న్ల‌ను దాఖ‌లు చేశాయి. ఈ పిటిష‌న్ల‌ను నిన్న ప‌రిశీలించిన హైకోర్టు ధ‌ర్మాస‌నం... ఏపీ పిటిష‌న్‌ పై ఆశ్చ‌ర్యం వ్య‌క్తం చేసింది. అంతేకాకుండా ఏపీ త‌ర‌ఫున వాద‌న‌లు వినిపించేందుకు వ‌చ్చిన అడ్వొకేట్ జ‌న‌ర‌ల్ ద‌మ్మాల‌పాటి శ్రీనివాస్‌ కు చీవాట్లు పెట్టింది.

అయినా ద‌మ్మాల‌పాటిని కోర్టు అంత‌గా చీవాట్లు ఎందుకు పెట్టింద‌న్న విష‌యానికి వ‌స్తే... దివాక‌ర్ ట్రావెల్స్ బ‌స్సులు నిబంధ‌న‌ల‌కు విరుద్ధంగా న‌డుస్తున్నాయని తెలంగాణ స‌ర్కారు త‌న పిటిష‌న్‌ లో పేర్కొంది. మోటారు వాహ‌న చ‌ట్టాన్నే కాకుండా మోటారు వాహ‌న కార్మికుల నిబంధ‌న‌ల‌ను కూడా దివాక‌ర్ ట్రావెల్స్ ఉల్లంఘించింద‌ని ఆరోపించింది. ఈ కార‌ణంగానే ఆ ట్రావెల్స్ బ‌స్సులు ప్ర‌మాదాల‌కు గుర‌వుతున్నాయ‌ని కూడా తెలంగాణ స‌ర్కారు కాస్తంత స్ప‌ష్ట‌మైన స‌మాచారంతోనే పిటిష‌న్ దాఖ‌లు చేసింది. అయితే అందుకు విరుద్ధంగా దివాక‌ర్ ట్రావెల్స్ మోటారు వాహ‌న చ‌ట్టాన్ని అతిక్ర‌మించ‌లేద‌ని, ఆ బ‌స్సుల్లో అన్నీ స‌రిగానే ఉన్నాయ‌ని తెలిపింది.

దీంతో చిర్రెత్తుకొచ్చిన హైకోర్టు తాత్కాలిక ప్ర‌ధాన న్యాయ‌మూర్తి జ‌స్టిస్ ర‌మేశ్ రంగ‌నాథ‌న్‌ - జ‌స్టిస్ టి. ర‌జ‌నిల‌తో కూడిన ధ‌ర్మాసనం ఏపీ ప్ర‌భుత్వ తీరుపై విరుచుకుప‌డింది. అన్నీ అక్ర‌మ‌మేన‌ని ఓ వైపు తెలంగాణ స‌ర్కారు చెబుతుంటే... కాదు అన్నీ స‌వ్యంగానే ఉన్నాయంటూ మీరెలా చెబుతారంటూ ద‌మ్మాల‌పాటిని నిల‌దీసింది. అంతేకాకుండా కౌంట‌ర్ పిటిష‌న్ ను కూడా తూతూమంత్రంగా రూపొందించార‌ని కూడా ధ‌ర్మాస‌నం చంద్ర‌బాబు స‌ర్కారు తీరుపై ఆగ్ర‌హం వ్య‌క్తం చేసింది. అదే స‌మ‌యంలో ఏపీ కార్మిక శాఖ ముఖ్య కార్య‌ద‌ర్శికి వ్య‌క్తిగ‌త హాజ‌రు నుంచి మిన‌హాయింపు ఇవ్వాల‌ని ద‌మ్మాల‌పాటి కోర‌గా... మ‌రోమారు ఆగ్ర‌హం వ్య‌క్తం చేసిన ధ‌ర్మాసనం అందుకు అంగీక‌రించ‌లేదు.

ఈసారైనా కౌంట‌ర్‌ ను అన్ని వివ‌రాల‌తో స‌మ‌గ్రంగా దాఖ‌లు చేయాల‌ని, అదే స‌మ‌యంలో ఏపీ కార్మిక శాఖ ముఖ్య కార్య‌ద‌ర్శి కూడా త‌దుప‌రి విచార‌ణ‌కు త‌ప్ప‌నిస‌రిగా హాజ‌రుకావాల్సిందేన‌ని కాస్తంత ఘాటు వ్యాఖ్య‌లే చేసింది. దీంతో బెంబేలెత్తిపోయిన ద‌మ్మాల‌పాటి త‌దుప‌రి విచార‌ణ‌లోగా స‌వ‌రించిన కౌంట‌ర్‌ ను దాఖ‌లు చేస్తామ‌ని, అయినా దివాక‌ర్ ట్రావెల్స్ బ‌స్సులు హైద‌రాబాదు నుంచి కార్య‌కలాపాలు సాగిస్తున్నాయ‌ని చెప్పి త‌న‌కు ఎదురైన ఇబ్బంది నుంచి త‌ప్పించుకునేందుకు య‌త్నించారు. దీంతో కోర్టు మ‌రోమారు ఆగ్ర‌హం వ్య‌క్తం చేయ‌డంతో ఆయ‌న త‌న వాద‌న‌ల‌ను ముగించక త‌ప్ప‌లేదు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/