Begin typing your search above and press return to search.

కేంద్రం చేతకానితనం బయటకొచ్చింది

By:  Tupaki Desk   |   12 Aug 2015 6:12 AM GMT
కేంద్రం చేతకానితనం బయటకొచ్చింది
X
పెద్దన్నలా వ్యవహరించాల్సిన కేంద్రం.. గోడ మీద పిల్లి వాటాన నిలబడటం తెలిసిందే. రెండు తెలుగు రాష్ట్రాల మధ్య నడుస్తున్న పంచాయితీల్లో తల దూర్చే విషయంలో ఏ మాత్రం ఆసక్తి ప్రదర్శించని కేంద్రం.. నెత్తి మీదకొచ్చిన విషయాన్ని కూడా పక్కన పెట్టేస్తూ.. తనకేమీ పట్టనట్లుగా వ్యవహరించటం తెలిసిందే.

ఏపీ స్థానికత ఉందని చెబుతూ దాదాపు 1200 మంది వరకు విద్యుత్తు ఉద్యోగుల్ని తెలంగాణ సర్కారు టోకుగా రిలీవ్ చేసేయటం తెలిసిందే. వారికి.. తాము ఉద్యోగాలు ఇవ్వలేమని ఏపీ సర్కారు మోకాలడ్డటం జరిగింది. మరి.. మా సంగతేమిటంటూ కేంద్రం దృష్టికి ఈ విషయాన్ని తీసుకెళితే.. మేం చూస్తామని చెప్పిన హోంశాఖ.. చివరకు తెలంగాణ సర్కారుకు ఆదేశాలు జారీ చేసింది. వారిని వెనక్కి తీసుకోవాలని సూచించింది. కానీ.. అందుకు తెలంగాణ సర్కారు నో చెప్పేసింది.

దీంతో.. విషయం మరోసారి కేంద్రం దృష్టికి వెళ్లటం.. తామేమీ చేయలేమన్న అశక్తతను వ్యక్తం చేస్తూ.. కోర్టును ఆశ్రయించాలని చెప్పటం తెలిసిందే. దీంతో.. ఈ వ్యవహారం తాజాగా కోర్టు దృష్టికి వెళ్లింది. ఇప్పటివరకూ ఈ వ్యవహారాన్ని చూస్తున్న సింగిల్ జడ్జి నుంచి హైకోర్టు ధర్మాసనానికి కేసు బదిలీ అయ్యింది. ఈ సందర్భంగా విచారించిన హైకోర్టు.. కేంద్రం తీరును తప్పు పట్టటమే కాదు.. కేంద్రం అలసత్వం కారణంగానే వివాదం ఉత్పన్నమైందని పేర్కొంటూ.. తదుపరి విచారణకు హాజరు కావాలని పేర్కొంది. పని చేయాల్సిన వ్యవస్థలు మొహమాటం లేకుండా పని చేస్తే ఇన్ని తిప్పలు ఉండవు. కానీ.. మాకెందుకీ గొడవ అన్న రీతిలో కేంద్రం అనుసరించిన వైఖరిని.. హైకోర్టు బాగానే క్వశ్చన్ చేసిందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.