Begin typing your search above and press return to search.

టీ సర్కార్ కు హైకోర్టు సూటి ప్రశ్న...వారందరికీ న్యాయం చేస్తారా?

By:  Tupaki Desk   |   27 Aug 2020 5:32 PM GMT
టీ సర్కార్ కు హైకోర్టు సూటి ప్రశ్న...వారందరికీ న్యాయం చేస్తారా?
X
ప్రత్యేక తెలంగాణ సాధించడంలో చాలామంది ప్రత్యక్షంగా ఉద్యమంలో పాల్గొనగా...మరి కొంత మంది పరోక్షంగా తమ వంతు పాత్ర పోషించారు. వారందరినీ సముచితంగా గౌరవించాలని తెలంగాణ సీఎం కేసీఆర్ ప్రయత్నిస్తున్న సంగతి తెలిసిందే. తెలంగాణ సాయుధ పోరాటాన్ని, తెలంగాణ ఇతి వృత్తాన్ని, ఉద్యమాన్ని ప్రముఖ దర్శకుడు ఎన్ శంకర్ తన సినిమాల ద్వారా ప్రజల్లోకి తీసుకువెళ్లారు. ఈ నేపథ్యంలోని స్టూడియో నిర్మించుకునేందుకు శంకర్ కు శంకర్‌పల్లిలోని మోకిల్లాలో ఎకరాకు రూ.5 లక్షల చొప్పున 5 ఎకరాల భూమిని గత ఏడాది జనవరిలో కేటాయించింది తెలంగాణ ప్రభుత్వం. ఇంత కారు చౌకగా శంకర్ కు భూమిని కేటాయించడంపై కరీంనగర్‌ జిల్లా ధర్మపురికి చెందిన జె.శంకర్‌ హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. దీనిపై గతంలో విచారణ జరిపిన హైకోర్టు...ఆ విషయంపై కౌంటర్ దాఖలు చేయాలని తెలంగాణ ప్రభుత్వాన్ని ఆదేశించింది.. ఈ నేపథ్యంలో తాజాగా గురువారంనాడు మరోసారి ఆ పిటిషన్ పై విచారణ జరిపిన హైకోర్టు...అంత ఖరీదైన భూమిని అంత తక్కువ ధరకు ఎందుకు కేటాయించారంటూ తెలంగాణ ప్రభుత్వాన్ని ప్రశ్నించింది.

తెలంగాణ ఉద్యమంలో ఎన్.శంకర్ కీలకమైన పాత్ర పోషించారని హైకోర్టుకు తెలంగాణ ప్రభుత్వం తరపున అడ్వొకేట్ జనరల్ వెల్లడించారు. తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న వేలాది మందికి కూడా ప్రభుత్వం మద్దతిస్తుందా అని ఏజీని హైకోర్టు ప్రశ్నించింది. ఇప్పటికే హైదరాబాద్ లో అద్భుతంగా నిర్మించిన రామోజీ ఫిల్మ్ సిటీ ఉందని, కావాలంటే చిత్ర పరిశ్రమ కోసం ప్రభుత్వం సొంతగా ఓ స్టూడియోను నిర్మించవచ్చు కదా అని హైకోర్టు అభిప్రాయపడింది. కానీ, అంత విలువైన భూమిని ఇంత కారుచౌకగా ఒక దర్శకుడికి విక్రయించడం సరికాదని తెలిపింది. ఈ పిటిషన్ పై తదుపరి విచారణ రెండు వారాలపాటు హైకోర్టు వాయిదా వేసింది. ఈ పిటిషన్ నేపథ్యంలో హైకోర్టు లేవనెత్తిన అంశాలు ఆలోచింపజేసేలా ఉన్నాయన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఒక వేళ తదుపరి విచారణ సందర్భంగా తెలంగాణ ప్రభుత్వ వాదనలు హైకోర్టుకు సంతృప్తికరంగా లేకుంటే...ఆ భూమిని వెనక్కు తీసుకోవాల్సిందిగా హైకోర్టు ఆదేశాలు జారీ చేసే అవకాశముందని, అదే జరిగితే ఆ నిర్ణయం ఎన్. శంకర్ కు నిరాశ కలిగిస్తుందన్న వాదనలు వినిపిస్తున్నాయి.