Begin typing your search above and press return to search.

హైకోర్టు వ్యాఖ్య‌లు: థియేట‌ర్లోనూ తింటూ ఉండాలా?

By:  Tupaki Desk   |   22 Aug 2018 5:04 AM GMT
హైకోర్టు వ్యాఖ్య‌లు: థియేట‌ర్లోనూ తింటూ ఉండాలా?
X
మ‌ల్టీఫ్లెక్సుల్లో విక్ర‌యించే ఆహార‌ప‌దార్థాల‌పై భారీ బాదుడుకు సంబంధించి ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌ల్ని చేసింది హైకోర్టు. మైమూవీ.. మైథియేట‌ర్ పేరుతో మ‌హారాష్ట్రలో ఉద్య‌మం త‌ర‌హాలో సాగ‌టం.. మ‌ల్టీఫ్లెక్సుల్లో అధిక ధ‌ర‌ల‌పై అక్క‌డి కోర్టు క‌న్నెర్ర చేయ‌టం.. బ‌య‌ట ఆహారాన్ని థియేట‌ర్ల‌కు అనుమ‌తించేలా మ‌హారాష్ట్ర ప్ర‌భుత్వం నిర్ణ‌యం తీసుకోవ‌టం తెలిసిందే.

ఇదే అంశంపై తాజాగా హైకోర్టులో దాఖ‌లు చేసిన ప్ర‌జాహిత వ్యాజ్యానికి గ‌ట్టి ఎదురుదెబ్బ త‌గిలింది. మ‌ల్టీఫ్లెక్స్ థియేట‌ర్ల‌లో ప్రేక్ష‌కులు బ‌య‌ట నుంచి తెచ్చుకునే ఆహార‌ప‌దార్థాల‌ను అనుమ‌తిచ్చేలా ఆదేశాలు జారీ చేయాల‌ని కోరిన వైనంపై హైకోర్టు ఊహించ‌నిరీతిలో వ్యాఖ్య‌లు చేసింది. ఈ పిల్ నుకొట్టేసింది.

అధిక ధ‌ర‌ల‌తో వ‌స్తువుల అమ్మ‌కాలు.. నాణ్య‌తా లోపాల విష‌యాల్ని ఆశ్ర‌యించ‌టానికి వినియోగ‌దారుల ఫోరంతో పాటు ప్ర‌త్యామ్నాయ మార్గాలు ఉన్న‌ట్లుగా వెల్ల‌డించింది. థియేట‌ర్ల‌లోనూ తింటూ ఉండాలా? ఆ మూడు గంట‌లు తినాల్సిన అవ‌స‌రం ఏముచ్చింది? అంటూ హైకోర్టు ప్ర‌శ్న‌లు సంధించింది.

రెగ్యులేష‌న్ చ‌ట్టం..ఆహార భ‌ద్ర‌త చ‌ట్టం.. తూనిక‌లు కొల‌త‌ల చ‌ట్టాల‌తో ముడిప‌డి ఉన్న ఈ వ్య‌వ‌హారం ప్ర‌జాహిత వ్యాజ్యంగా కింద దాఖ‌లు చేశార‌ని.. ఈ విష‌యంపై న్యాయ స‌మీక్ష సాధ్యం కాద‌ని తేల్చింది. అంతేకాదు.. సంబంధిత మ‌ల్టీఫ్లెక్సుల యాజ‌మాన్యాల్ని ప్ర‌తివాదులుగా చేర్చ‌లేద‌ని పేర్కొంటూ వ్యాజ్యాన్ని కొట్టేసింది. ఈ నిర్ణ‌యాన్ని ఉమ్మ‌డి రాష్ట్ర హైకోర్టు ప్ర‌ధాన న్యాయ‌మూర్తి జ‌స్టిస్ టీబీఎన్ రాధాకృష్ణ‌న్.. జ‌స్టిస్ వి.రామ‌సుబ్ర‌మ‌ణియ‌న్ తో కూడిన ధ‌ర్మాస‌నం ఆదేశాలు జారీ చేసింది. హైకోర్టు తాజా నిర్ణ‌యంతో మై మూవీ.. మై ఫుడ్ నినాదానికి భారీగా దెబ్బ ప‌డిన‌ట్లే.