Begin typing your search above and press return to search.

నేర చరిత ఉన్న నేతలకు గన్ మెన్లు ఇవ్వటమా?

By:  Tupaki Desk   |   25 Aug 2019 8:03 AM GMT
నేర చరిత ఉన్న నేతలకు గన్ మెన్లు ఇవ్వటమా?
X
ఏపీ హైకోర్టు ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. ప్రజాప్రతినిధులు.. నేతలకు రక్షణగా గన్ మెన్లు పెట్టుకోవటం తెలిసిందే. స్థాయితో సంబంధం లేకుండా చాలామంది డాబు కోసం గన్ మెన్లను ఏర్పాటు చేసుకోవటంపై ఒత్తిడిని తీసుకొస్తారు. ఇలాంటి వాటికి ప్రభుత్వం నో చెబితే.. కోర్టును ఆశ్రయించటం లాంటివి చేస్తారు.

తాజాగా ఇలాంటి ప్రయత్నానికి చెక్ చెప్పింది హైకోర్టు. ఇంతకీ ఎవరికి ఇలాంటి అనుభవం ఎదురైందంటే.. తెలుగుదేశం పార్టీ కదిరి నియోజకవర్గ ఇంఛార్జ్ కందికుంట వెంకటప్రసాద్.. తనకు రక్షణగా గన్ మెన్లు ఇవ్వాలని కోరారు. 2009లో తాను టీడీపీ ఎమ్మెల్యేగా కదిరికి ప్రాతినిధ్యం వహించినట్లు చెప్పారు. తనకున్న 2 ప్లస్ 2 గన్ మెన్లను ఇటీవల ప్రభుత్వం తొలగించిందని.. తిరిగిన గన్ మెన్లను నియమించాలని ఆయన కోరారు.

ఇదిలా ఉంటే.. ఆయన దాఖలు చేసుకున్న పిటిషన్ పై కోర్టు విచారణ జరిపింది. ఈ సందర్భంగా ఆసక్తికర అంశాలు తెర మీదకు వచ్చాయి. కందికుంట మీద మొత్తం 22 కేసులు ఉన్నాయని.. ఇందులో నకిలీ డీడీలకు సంబంధించిన రెండు కేసుల్లో శిక్ష కూడా పడినట్లు తేలింది. అంతేకాదు.. ప్రస్తుతం ఆయన తాజా మాజీ ఎమ్మెల్యే కూడా కాదని.. ఇలాంటప్పుడు ఆయనకు గన్ మెన్లు ఎలా ఇస్తారని ప్రశ్నించింది.

ఇంతటి నేర చరిత్ర ఉన్న వ్యక్తికి గన్ మెన్లు ఎలా ఇస్తారు? అని ప్రశ్నించటంతోపాటు.. గన్ మెన్లను తిరిగి నియమించాలని కోరటంలో అర్థం లేదని స్పష్టం చేసింది. ఆసక్తికరమైన విషయం ఏమంటే.. కందికుంటకు గన్ మెన్లను నియమించాల్సిన అవసరం లేదని హైకోర్టు స్పష్టం చేయటంతోపాటు.. అక్షింతలు వేయటంతో టీడీపీకి చెందిన తాజా మాజీ ఎమ్మెల్యే అత్తార్ చాంద్ బాషా వర్గం తెగ ఖుషీ కావటం విశేషం. ఇదిలా ఉంటే.. తమకు గన్ మెన్లను తొలగించిన వేళ.. తాజా మాజీ ఎమ్మెల్యే అత్తార్ చాంద్ బాషాకు కూడా గన్ మెన్లను తొలగించాలని కోరుకోవటం ఆసక్తికరంగా మారింది.