Begin typing your search above and press return to search.

ఆంధ్ర‌జ్యోతి ఆర్కేకు షాకిచ్చిన హైకోర్టు

By:  Tupaki Desk   |   4 Dec 2017 9:13 AM GMT
ఆంధ్ర‌జ్యోతి ఆర్కేకు షాకిచ్చిన హైకోర్టు
X
ప్ర‌ముఖ మీడియా సంస్థ ఆంధ్ర‌జ్యోతి ఎండీ వేమూరి రాధాకృష్ణ‌కు హైకోర్టులో చుక్కెదురైంది. ఒక కేసు విచార‌ణ‌కు తాను వ్య‌క్తిగ‌తంగా హాజ‌రు కాలేక‌పోవ‌టానికి అవ‌కాశిస్తూ ఆదేశాలు ఇవ్వాలంటూ కోరిన ఆయ‌న క్వాష్ పిటిష‌న్‌ ను హైకోర్టు కొట్టివేసింది. అస‌లేం జ‌రిగిందంటే..

ఆ మ‌ధ్య‌న ప్ర‌ధాని మోడీని క‌లిసిన ఏపీ విప‌క్ష నేత వైఎస్ జ‌గ‌న్మోహ‌న్ రెడ్డికి సంబంధించి త‌ప్పుడు క‌థ‌నం ప్ర‌చురించిన వైనం తెలిసిందే. ఈ క‌థ‌నంతో త‌మ ప‌రువు ప్ర‌తిష్ఠ‌ల‌ను దెబ్బ తీశార‌ని. ఇందుకు బాధ్యులైన వారిపై చ‌ర్య‌లు తీసుకోవాలంటూ వైఎస్సార్ కాంగ్రెస్ ఎమ్మెల్యే ఆళ్ల రామ‌కృష్ణారెడ్డి కోర్టులో కంప్లైంట్ చేశారు.

ఈ కేసు విచార‌ణ ఆ మ‌ధ్య‌న నాంప‌ల్లి కోర్టులో జ‌రిగింది. కోర్టుకు హాజ‌రు కాకుండా ఉండ‌టంపై కోర్టు ఆగ్ర‌హం వ్య‌క్తం చేసింది. అసెంబ్లీ స‌మావేశాలు జ‌రుగుతున్నందున తాను వ్య‌క్తిగ‌తంగా కోర్టుకు హాజ‌రు కాలేక‌పోతున్నట్లుగా కోర్టుకు లాయ‌ర్ ద్వారా సందేశం పంపారు. దీనిపై నాంప‌ల్లి కోర్టు తీవ్ర అసంతృప్తిని వ్య‌క్తం చేస్తూ ఆగ్ర‌హం వ్య‌క్తం చేసింది. ఇదిలా ఉంటే.. కోర్టు హాజ‌రుకు సంబంధించి హైకోర్టులో దాఖ‌లు చేసిన క్యాష్ పిటిష‌న్‌ ను తాజాగా తోసిపుచ్చింది.

హైకోర్టు నుంచి చుక్కెదురు అయిన నేప‌థ్యంలో.. మంగ‌ళ‌వారం జ‌రిగే విచార‌ణ‌కు రాధాకృష్ణ స్వ‌యంగా హాజ‌రు కావాల్సి ఉంటుంది.

నాంప‌ల్లి కేసు విచార‌ణ‌కు ఆర్కే తోపాటు.. ఆంధ్ర‌జ్యోతి ఎడిట‌ర్ కె.శ్రీ‌నివాస్‌.. ప‌బ్లిష‌ర్‌.. మ‌రికొంద‌రు ఉద్యోగులు హాజ‌రుకావాల్సి ఉంటుంది. ఇప్ప‌టికే కోర్టు విచార‌ణ‌కు హాజ‌రు కాక‌పోవ‌టంపై కోర్టు ఆగ్ర‌హం వ్య‌క్తం చేసింది. తాజా ప‌రిణామాల నేప‌థ్యంలో రేపు రాధాకృష్ణ అండ్ కో త‌ప్ప‌నిస‌రిగా కోర్టుకు వెళ్లాల్సి ఉంటుంది.