Begin typing your search above and press return to search.

రేవంత్ ఎక్క‌డికైనా వెళ్లొచ్చు: కోర్టు

By:  Tupaki Desk   |   8 Sep 2015 5:50 AM GMT
రేవంత్ ఎక్క‌డికైనా వెళ్లొచ్చు: కోర్టు
X
టీ టీడీపీ ఎమ్మెల్యే రేవంత్‌ రెడ్డిపై ఏసీబీ అధికారులు విధించిన ఆంక్ష‌లు తొల‌గాయి. తెలంగాణ ఎమ్మెల్సీ ఎన్నిక‌ల సంద‌ర్భంగా ఓటుకు నోటు కేసులో రేవంత్ అరెస్టు అయిన సంగ‌తి తెలిసిందే. త‌ర్వాత కొద్ది రోజుల పాటు జైలులో ఉన్న రేవంత్‌ కు కోర్టు ష‌రతుల‌తో కూడిన బెయిల్‌ ను మంజూరు చేసింది. ఆయ‌న తాను ప్రాధినిత్యం వ‌హిస్తున్న కొడంగ‌ల్ నియోజ‌క‌వ‌ర్గానికి మాత్ర‌మే ప‌రిమితం కావాల‌ని సూచించింది. దీంతో రేవంత్ అప్ప‌టి నుంచి కొడంగ‌ల్‌ లోనే ఉంటూ కోర్టుకు మాత్ర‌మే హైద‌రాబాద్ వ‌స్తున్నారు.

తాజాగా రేవంత్ తాను పార్టీ కార్య‌క‌లాపాల్లో పాల్గొనేందుకు...త‌న నియోజ‌క‌వ‌ర్గ అభివృద్ధి ప‌నుల నిమిత్తం హైద‌రాబాద్ ఎక్కువ‌గా రావాల్సి ఉందంటూ కోర్టును ఆశ్ర‌యించారు. రేవంత్ పిటిష‌న్‌ ను ప‌రిశీలించిన హైకోర్టు ఆయ‌న ఇక‌పై ఆయ‌న దేశంలో ఎక్క‌డికైనా వెళ్ల‌వ‌చ్చ‌ని చెప్పింది. అయితే ఓటుకు నోటు కేసులో సాక్షుల‌ను బెదిరించ‌డం గాని..ప్ర‌భావితం కాని చేయ‌కూడ‌దంటూ ఆదేశాలు జారీ చేసింది. రేవంత్ సాక్షుల‌ను ప్ర‌భావిం చేసిన‌ట్టు త‌మ దృష్టికి వ‌స్తే బెయిల్ ర‌ద్దు చేస్తామ‌ని చిన్న‌పాటి హెచ్చ‌రిక కూడా జారీ చేసింది. ప్ర‌తి సోమ‌వారం సాయంత్రం 5 గంట‌లకు స్టేష‌న్‌ కు వ‌చ్చి సంత‌కం పెట్టాల‌ని కూడా కోర్టు పేర్కొంది.

రేవంత్‌ పై విధించిన ఆంక్ష‌ల‌ను ఎత్తివేయ‌డంతో ఆయ‌న బుధ‌వారం రాత్రి హైద‌రాబాద్‌ కు రానున్నారు. చంద్ర‌బాబు కూడా బుధ‌వార‌మే హైద‌రాబాద్ వ‌స్తుండ‌డంతో రేవంత్ ముందుగా ఆయ‌న్ను క‌లుసుకుని తెలంగాణ‌లో పార్టీ క‌మిటీల‌ను ఏర్పాటుపై చ‌ర్చించ‌నున్న‌ట్టు తెలుస్తోంది. ముందుగా రేవంత్ ఎల్బీన‌గ‌ర్ నియోజ‌క‌వ‌ర్గంలో కాంగ్రెస్ నుంచి టీడీపీలోకి వ‌స్తున్న ప‌లువురు కార్య‌క‌ర్త‌ల‌కు ఆయ‌న ప‌సుపు కండువాక‌ప్పి పార్టీలోకి ఆహ్వానించ‌నున్నారు. త‌ర్వాత బుధ‌, గురువారాల్లో చంద్ర‌బాబుతో భేటీ అయ్యి ఈ కేసుతో పాటు తెలంగాణ‌లో పార్టీ క‌మిటీలు, ఇత‌ర‌త్రా అంశాల గురించి చ‌ర్చించ‌నున్నారు.హైకోర్టు రేవంత్‌ కు విధించిన ష‌రతుల‌ను ఎత్తివేయ‌డంతో రెండు తెలుగు రాష్ర్టాల్లో టీడీపీ కార్య‌క‌ర్త‌లు సంబ‌రాలు చేసుకుంటున్నారు.