Begin typing your search above and press return to search.

అమ్మాయిలు సరదా కోసం ఎఫైర్ పెట్టుకోరు: హైకోర్టు సంచలన వ్యాఖ్యలు

By:  Tupaki Desk   |   15 Aug 2021 2:41 PM GMT
అమ్మాయిలు సరదా కోసం ఎఫైర్ పెట్టుకోరు: హైకోర్టు సంచలన వ్యాఖ్యలు
X
భారతదేశంలో అమ్మాయిలు సరదా కోసం శారీరక సంబంధాలు పెట్టుకోరని.. వివాహం చేసుకుంటానని నమ్మకంగా చెబితే తప్ప లైంగిక చర్యలకు అంగీకరించరని మధ్యప్రదేశ్ హైకోర్టు సంచలన వ్యాఖ్యలు చేసింది.

అటువంటి సంబంధం పెట్టుకోవాలని భావించే పురుషులు ఎవరైనా పర్యవసనాలు కూడా ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండాలని హైకోర్టు స్పష్టం చేసింది.

ఉజ్జయినికి చెందిన ఓ యువకుడు.. వివాహం చేసుకుంటానని నమ్మించి 2018 అక్టోబర్ నుంచి ఓ యువతిపై పలుమార్లు అత్యాచారం చేశాడు. యువతిపై మోజు తీరిపోయిందేమో కానీ వేరే అమ్మాయితో తాజాగా పెళ్లికి సిద్ధపడ్డాడు.

మరో యువతిని పెళ్లి చేసుకుంటున్నానని.. తనను వదిలేయి అని ప్రియురాలికి చెప్పడంతో ఆమె ఆత్మహత్యాయత్నం చేసింది. దీంతో యువకుడిపై పోలీసులు అత్యాచారంతోపాటు పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేసి అరెస్ట్ చేశారు.

తాజాగా యువకుడు బెయిల్ కోసం మధ్యప్రదేశ్ హైకోర్టుకు అప్పీల్ చేసుకోగా.. అతడి బెయిల్ పిటీషన్ ను విచారించిన హైకోర్టు యువకుడి వాదనను తోసిపుచ్చింది. 21 నిండిన అమ్మాయి మేజర్ అని.. ఆమె ఇష్టప్రకారమే తనతో లైంగిక చర్యలో పాల్గొందని యువకుడు వాదించాడు. పెళ్లిచేసుకుంటానని చెప్పడంతో యువతి లైంగిక సంబంధానికి ఒప్పుకుందని హైకోర్టు అభిప్రాయపడింది. దేశంలో అమ్మాయిలు వారి సరదా కోసం అబ్బాయిలతో శారీరక సంబంధం పెట్టుకోరని.. భవిష్యత్ లో వివాహం, వాగ్ధానం చేసినప్పుటే సమ్మతిస్తారని కోర్టు తెలిపింది. సరదా కోసమే అయితే బాధితురాలు ఎందుకు ఆత్మహత్యా ప్రయత్నం చేస్తుందని కోర్టు ప్రశ్నించింది. ఆత్మహత్యకు ప్రయత్నించిందంటే మీతో ఆమె ఎంత సీరియస్ గా బంధాన్ని తీసుకుందో తెలుస్తోందని కోర్టు పేర్కొంది. దీన్ని సరదాగా పరిగణించలమేని యువకుడికి షాకిస్తూ హైకోర్టు బెయిల్ నిరాకరించింది.