Begin typing your search above and press return to search.

బకాయిలు నిలిపేసిన సర్పంచ్ పై హైకోర్టు సంచలన నిర్ణయం

By:  Tupaki Desk   |   12 Sep 2021 9:37 AM GMT
బకాయిలు నిలిపేసిన సర్పంచ్ పై హైకోర్టు సంచలన నిర్ణయం
X
ఏపీలోని ఒక సర్పంచ్ తీసుకున్న నిర్ణయంపై రాష్ట్ర హైకోర్టు తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేసింది. అంతేకాదు.. సంచలన నిర్ణయాన్ని తీసుకుంది. మహాత్మాగాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం పనులకు సంబంధించిన చెల్లింపుల్ని చెల్లించకపోవటమే కాదు.. పాత బకాయిల్ని క్లియర్ చేసే విషయంలో సర్పంచ్ తీరుపై తీవ్రంగా ఫైర్ అయ్యింది. గతంలో చేసిన పనుల బకాయిల్ని చెల్లించకుండా ఆపే అధికారం మీకెక్కడిది? అని సూటిగా ప్రశ్నించింది. ఇంతకూ జరిగిందేమంటే..

గుంటూరు జిల్లాలోని వి అప్పాపురం సర్పంచ్ గా కె. రోజారాణి వ్యవహరిస్తున్నారు. గ్రామ సచివాలయ నిర్మాణానికి జమ చేసిన నిధుల్ని నిర్మాణదారుకు చెల్లించకుండా నిలిపివేశారు. దీనిపై జిల్లా పంచాయితీ అధికారి షోకాజ్ నోటీసు జారీ చేశారు. అధికారి ఆదేశించినట్లుగా వివరణ ఇవ్వకుండా ఉండటాన్ని ఆమె పాటించకపోవటంతో ఆయన చర్యలకు తెర తీశారు. మూడు నెలల పాటు సర్పంచ్ చెక్ పవర్ ను రద్దు చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. దీంతో.. ఈ ఉత్తర్వులను సవాలు చేస్తూ సర్పంచ్ రోజారాణి హైకోర్టును ఆశ్రయించారు.

గ్రామ సచివాలయ భవన నిర్మాణంపై గ్రామస్థుల నుంచి కంప్లైంట్ అందిందని.. నిర్మాణ పనుల రికార్డులు తనవద్ద లేవని ఆమె తన వాదనలు వినిపించారు. అందుకే నిధులు చెల్లించలేదని సర్పంచ్ తరఫు లాయర్ తన వాదనల్ని వినిపించారు. ఆ వాదనల్ని తోసిపుచ్చిన న్యాయస్థానం సర్పంచ్ మీద ఆగ్రహాన్ని వ్యక్తం చేసింది. మీరు ఎన్నిక కాక ముందు జరిగిన పనులకు చెల్లించాల్సిన నిధుల్ని ఆపే అధికారం మీకెక్కడిది? గతంలో నిర్వహించిన ఉపాధి పనులకు బకాయిలు చెల్లించాలంటూ న్యాయస్థానం జారీ చేసిన ఆదేశాల అమలుకు అడ్డుపడేలా మీ చర్యలు ఉన్నాయంటూ సర్పంచ్ పై మండిపడింది.

అంతేకాదు.. దీనిపై సుమోటోగా తీసుకొని కోర్టు ధిక్కారణ చర్యలు ప్రారంభిస్తామని జస్టిస్ బట్టు దేవానంద్ హెచ్చరించారు. దీంతో.. సర్పంచ్ తరఫు న్యాయవాది తమ వ్యాజ్యాన్ని ఉపసంహరించుకోవటానికి అనుమతి ఇవ్వాలని అభ్యర్థించారు. అందుకు అంగీకరించిన న్యాయమూర్తి కోర్టు సమయాన్ని వృథా చేసినందుకు రూ.5వేలు చెల్లించాలన్నారు. ఈ మొత్తాన్ని ఏపీ న్యాయ సేవాధికార సంస్థకు రెండు వారాల్లో జమ చేయాలన్న సూచన చేశారు. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేశారు.