Begin typing your search above and press return to search.

ఐదేళ్ల ఆ ఇన్సురెన్సు తప్పనిసరి .. హైకోర్టు సంచలన తీర్పు

By:  Tupaki Desk   |   27 Aug 2021 5:30 PM GMT
ఐదేళ్ల ఆ ఇన్సురెన్సు తప్పనిసరి .. హైకోర్టు సంచలన తీర్పు
X
ఏదైనా వాహనం కొనుగోలు చేసేటప్పుడు ప్రస్తుతం అందరూ ఆ వాహనం ఎంత మైలేజ్ ఇస్తుంది , ఎంత సిసి , స్టైల్ ఎలా ఉంది ఇవి మేజర్ గా చూస్తున్నారు. కానీ, ఇకపై అవి మాత్రమే చూసుకుంటే సరిపోదు. వాహన ఇన్సురెన్స్ పై కూడా ప్రత్యేక దృష్టి పెట్టాల్సిందే. ఏదైనా వాహనం కొనుగోలు చేసేప్పుడు కొనుగోలుదారులు, అటు ఇన్సురెన్సు కంపెనీలు బాధ్యతగా వ్యవహరించాలని మద్రాస్‌ హైకోర్టు సంచలన తీర్పు వెల్లడించింది. వాహనం నడిపే వారి సంక్షేమాన్ని పరిగణలోకి తీసుకుని బంపర్‌ టూ బంపర్‌ ఇన్సురెన్సును తీసుకోవాల్సిందే అని కీలక తీర్పు వెల్లడించింది.

వాహనాలకు తప్పనిసరిగా ఇన్సూరెన్స్‌ తీసుకోవాలని అధికారులు పదేపదే చెప్తుంటారు. ఈ రోజుల్లో వాహన ఇన్సూరెన్స్‌ లేని కార్లు, ద్విచక్ర వాహనాలకు ట్రాఫిక్‌ పోలీసులు భారీగా జరిమానా విధిస్తున్నారు. దీనితో చాలా మంది ఇన్సూరెన్స్‌ ను తప్పనిసరిగా చేసుకుంటారు. వివిధ సంస్థలు ఆన్‌ లైన్‌ లోనే సులభంగా ఇన్సూరెన్స్‌ పాలసీలను నిర్ణీత రుసుము చెల్లించిన తర్వాత సంబంధిత వాహనానికి ఇన్సూరెన్స్‌ పాలసీ అమల్లోకి వస్తుంది. కానీ ఆన్‌ లైన్‌ పాలసీని కొనుగోలు చేయడానికి ముందు దానికి సంబంధించిన లాభ నష్టాలను తెలుసుకోవాలి.

మద్రాసు హైకోర్టు తీర్పు ప్రకారం 2021 సెప్టెంబరు 1 నుంచి కొనుగోలు చేసే కొత్త వాహనాలకు బంపర్‌ టు బంపర్‌ ప్రాతిపదికన వాహన యజమాని, డ్రైవరు, ప్రయాణికులందరికీ వర్తించేలా బీమా తీసుకోవాల్సిందే. ఈ బీమా కాలపరిమితి ఐదేళ్లుగా ఉండాలని నిర్దేశించింది. లక్షల రూపాయలు పెట్టి వాహనం కొనేప్పుడు మైలేజీ, పవర్‌, డిజైన్‌ లపై ఉన్న శ్రద్ధ తమపై కూడా పెట్టాలని వాహన కొనుగోలుదారులకు సూచించింది. కొద్దిపాటీ ప్రీమియం కట్టేందుకు నిర్లక్క్ష్యం చేస్తే, అవాంఛనీయ సంఘటనలు జరిగినప్పుడు భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తోందంటూ కోర్టు తెలిపింది.

అసలు మద్రాస్ హైకోర్టు ఈ తరహా తీర్పు చెప్పడానికి అసలు కారణం ఏమిటంటే...తమిళనాడులోని హొగినేకల్‌ లో 2016లో జరిగిన రోడ్డు యాక్సిడెంట్ లో సడయప్పన్‌ అనే వ్యక్తి మృతి చెందాడు. దీని పై నష్టపరిహారం కోరుతూ కుటుంబ సభ్యులు ఈరోడ్‌ మోటారు వాహన ప్రమాద పరిహార ట్రైబ్యునల్‌ ను కోరారు. విచారణ తర్వాత సడయప్పన్‌ కుటుంబానికి రూ.14,.65 లక్షలు పరిహారం చెల్లించాలని ఇన్సురెన్సు కంపెనీని ట్రిబ్యునల్‌ ఆదేశాలు జారీ చేశారు. అయితే , ఆ తీర్పుని వ్యతిరేకిస్తూ న్యూ ఇండియా అస్యూరెన్స్‌ కంపెనీ మద్రాస్‌ హైకోర్టును ఆశ్రయించింది.

వాహన డ్రైవరు, యజమాని అనే ప్రాతిపదికన మాత్రమే వాహనానికి థర్డ్‌ ఫార్టీ బీమా చేశారని, డ్రైవరు కాని వ్యక్తి మృతి చెందితే లక్ష రూపాయలు మాత్రమే పరిహారం చెల్లిస్తామని బీమా సంస్థ తెలిపింది. సడయప్పన్‌ ప్రమాద సమయంలో వాహనం నడపలేదని రుజువులు చూపింది. ఈ కేసును విచారించిన న్యాయమూర్తి వైద్యనాథన్‌ ఈరోడ్‌ ట్రైబ్యునల్‌ ఆదేశాలను రద్దు చేశారు. వాహన యజమాని, డ్రైవరుతో పాటు అందులో ప్రయాణించే అందరి సంక్షేమాన్ని కాంక్షిస్తూ బంపర్‌ టూ బంపర్‌ ఇన్సురెన్సుని తప్పనిసరి గా చేస్తూ తీర్పు ఇచ్చారు.