Begin typing your search above and press return to search.

చంద్రుళ్ల‌కు హైకోర్టు సీరియ‌స్ వార్నింగ్‌?

By:  Tupaki Desk   |   3 Sep 2015 5:54 PM GMT
చంద్రుళ్ల‌కు హైకోర్టు సీరియ‌స్ వార్నింగ్‌?
X
విత్తు ముందా.. చెట్టు ముందా? అన్న లెక్క ఒక‌ప‌ట్టానా తేలేది కాదు. అలానే.. విభ‌జ‌న కార‌ణంగా రెండు తెలుగు రాష్ట్రాల మ‌ధ్య‌నున్న పంచాయితీలు ఒక ప‌ట్టాన తీరేవి కావు. ఎవ‌రికి వారు చెప్పే వాద‌న‌ల‌తో పాటు.. ఎదుటోళ్ల మీద చేసే ఆరోప‌ణ‌లు విని.. విని హైకోర్టుకు చిరాకు వేసిన‌ట్లుంది.

విద్యుత్తు ఉద్యోగుల విష‌యంలో రెండు తెలుగు రాష్ట్ర స‌ర్కార్ల‌కు హైకోర్టు సీరియ‌స్‌గా వార్నింగ్ ఇచ్చేసింది. మీరు తేలుస్తారా? మ‌మ్మ‌ల్ని తేల్చ‌మంటారా? అని అడిగి క‌డిగిపారేసినంత ప‌ని చేసింది. ఆంధ్రా మూలాలు ఉన్న ఉద్యోగులు అంటూ తెలంగాణ ప్రాంతంలోప‌ని చేస్తున్న 1200 మంది విద్యుత్తు ఉద్యోగుల్ని తెలంగాణ స‌ర్కారు టోకుగా రిలీవ్ చేసేసింది.

అంత‌మందిని ఒకేసారి రిలీవ్ చేస్తే మేం మాత్రం ఏం చేస్తాం? మేమేం చేయ‌లేమంటూ ఏపీ స‌ర్కారు ఎలాంటి ఆర్డ‌ర్ ఇవ్వ‌కుండా వ‌దిలేసింది. దీంతో.. అటు తెలంగాణ‌కు.. ఇటు ఆంధ్రాకు కాకుండా పోయిన విద్యుత్తు ఉద్యోగులు త్రిశుంక స్వ‌ర్గంలో ఉగిపోతున్న ప‌రిస్థితి. సుప్రీం.. కేంద్రం.. ఇలా అవ‌కాశం ఉన్న ప్ర‌తి గ‌డ‌పా తొక్కిన వారు.. హైకోర్టు దృష్టికి కూడా త‌మ స‌మ‌స్య‌ను తీసుకెళ్లారు.

ఈ కేసు విచార‌ణ సంద‌ర్భంగా రెండు రాష్ట్రాల‌కు చెందిన అధికారులు త‌మ వాద‌న‌ల్ని వినిపిస్తున్న నేప‌థ్యంలో.. తాజాగా హైకోర్టు సీరియ‌స్ వార్నింగ్ ఒక‌టి చేసింది. ఈ అంశంలో రెండు రాష్ట్రాల‌కు చెందిన ముఖ్య అధికారులు ఒక‌చోట కూర్చొని స‌మ‌స్య‌ను సామార‌స్యంగా ప‌రిష్క‌రించుకుంటారా? లేదంటే.. మ‌మ్మ‌ల్నే ఆదేశాలు ఇవ్వాలా? అని అడిగేసింది. ఈ కేసు విచార‌ణ‌ను మ‌రో వారం పాటు వాయిదా వేసింది.

ఈ వారం రోజుల్లో ఇరు రాష్ట్ర అధికారులు కూర్చొని స‌మ‌స్యకు ప‌రిష్కారం క‌నుగొన‌టం లేదంటే.. తామే సీన్లోకి ఎంట‌రై.. తాము చెప్పిందే చేయాల‌న్న అల్టిమేటం జారీ చేస్తామ‌న్న మాట హైకోర్టు ధ‌ర్మాస‌నం మాటల్లోవినిపించింది. మ‌రి.. ఈ సీరియ‌స్ వార్నింగ్ అయినా.. ఇద్ద‌రు చంద్రుళ్ల‌ను క‌దిలిస్తుందో లేదో చూడాలి.