Begin typing your search above and press return to search.

హైకోర్టు ముక్కచివాట్లు పెడితే కానీ సర్కారులో చలనం ఉండదా?

By:  Tupaki Desk   |   11 May 2021 1:40 PM GMT
హైకోర్టు ముక్కచివాట్లు పెడితే కానీ సర్కారులో చలనం ఉండదా?
X
పాలకులు.. ప్రభుత్వాలు ఎందుకు? ప్రజలకు సేవ చేయటానికి. వారి కష్టాల గురించి.. ఇబ్బందుల గురించి గుర్తించటం.. వాటిని దూరం చేసే ప్రయత్నం చేయటం.. వారు సుఖంగా.. సంతోషంగా జీవించటానికి అవసరమైన వసతుల్ని ఏర్పాటు చేయటం.. అనుకోనిది ఏదైనా చోటు చేసుకుంటే.. వారిని ఆ కష్టం నుంచి.. నష్టం నుంచి వీలైనంత త్వరగా బయటపడేయాల్సిన అవసరం ఉంది. అందుకు భిన్నంగా నిమ్మకు నీరెత్తినట్లుగా ఉండటం ఏమిటి? నిజానికి ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వం.. అనుక్షణం ప్రజల గురించి ఆలోచించాలి. వారికి కష్టం కలగకుండా చూడాలి. గడిచిన వందేళ్లలో ఎప్పుడూ రానంత పెద్ద కష్టం కరోనా రూపంలో వచ్చిన వేళ.. ప్రజలకు సేవ చేయటానికి.. వ్యవస్థలోని వివిధ రంగాలకు ఇవ్వాల్సిన ప్రాధాన్యతల్ని మార్చటానికి ప్రభుత్వానికి వచ్చిన సరైన అవకాశం.

ఇలాంటి వేళ.. చారిత్రక చర్యలకు శ్రీకారం చుడితే.. ప్రజలు కూడా హర్షిస్తారు. తాము ఎదుర్కొంటున్న సమస్యలకు పరిష్కారంగా ప్రభుత్వం స్వల్ప వ్యవధి చర్యలతో పాటు.. దీర్ఘకాలిక పరిష్కారాల్ని చూపిందన్న భావన వారిలో పెరుగుతుంది. తద్వారా ఎన్నికల వేళ... మేం అది చేశాం.. ఇది చేశామని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం ఉండదు. ఇందుకు నిలువెత్తు నిదర్శనంగా కేరళలోని విజయన్ ప్రభుత్వాన్ని చెప్పాలి.

ఇప్పటివరకు కరోనా కారణంగా ప్రభుత్వాలు పడిపోయాయి. అందుకు భిన్నంగా విజయన్ ప్రభుత్వం.. రెండోసారి సక్సెస్ ఫుల్ గా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయగలిగింది. కేరళ రాజకీయ చరిత్రలో సరికొత్త రికార్డును క్రియేట్ చేసింది. దీనంతటికి కారణం కోవిడ్ వేళలో.. విజయన్ సర్కారు ప్రదర్శించిన చర్యలు మాత్రమే ఆయనకు వరుసగా రెండోసారి అధికారాన్ని సొంతం చేసుకునేలా చేసిందని చెప్పాలి. మరి.. ఇలాంటి విషయాల్ని మేధావి అయిన కేసీఆర్ ఎందుకు మిస్ అవుతున్నారు. కరోనా కఠిన పరీక్షల్ని విసురుతున్న వేళ.. సమర్థుడైన వైద్య శాఖా మంత్రి ఈటెల (వ్యక్తిగతంగా సవాలచ్చ ఉండొచ్చు. కానీ.. ఇప్పుడు రాజకీయాలు ప్రదర్శించిన సమయం కాదు)ను హుటాహుటిన కేబినెట్ నుంచి బర్తరఫ్ చేయాల్సిన అవసరం ఏమిటి?

ప్రజల ఆరోగ్యం.. వారి సంక్షేమం కంటే కూడా తన రాజకీయ ఎజెండానే ముఖ్యమన్నట్లుగా కేసీఆర్ వ్యవహరించటాన్ని చాలామంది జీర్ణించుకోలేకపోతున్నారు. ఎవరు అవునన్నా.. కాదన్నా కేసీఆర్ లో సహజసిద్ధమైన దొరతనం ఉంటుంది. అదే సమయంలో మంచి మనసు ఉంటుంది. కష్టాలకు స్పందించే గుణంతో పాటు.. ఎవరైనా ఆయనకు నచ్చిన రీతిలో తమ సమస్యల్ని చెప్పుకొని.. ఆయన మాత్రమే తీర్చగలరన్న విషయాన్ని చెప్పగలిగితే.. వారిదెంత క్లిష్టమైన సమస్య అయినా పరిష్కరించేందుకు సిద్ధమయ్యే గుణం ఉంటుంది. అదేసమయంలో నేనెందుకు చేయాలన్న భావన వచ్చిందో.. దేనికైనా సిద్ధమన్న టెంపరితనం కేసీఆర్ లో కొట్టొచ్చినట్లు కనిపిస్తుంది.

అందుకే చైతన్యవంతమైన తెలంగాణ ప్రజలకు ఆయనపై వ్యతిరేకత వ్యక్తమైనా.. ఆయనలోని మరో గుణం.. ఆ వ్యతిరేకతను మంచుముక్కలా మార్చుకోవటం చేస్తుంటారు. అదే ఆయనకు శ్రీరామరక్షగా నిలుస్తోంది. అయితే.. కేసీఆర్ తో వచ్చిన చిక్కు.. కొన్ని అంశాల విషయంలో ఆయన ప్రదర్శించే నిర్లక్ష్యం కొన్నిసార్లు చాలా దారుణంగా ఉంటుంది. అందుకు చక్కని ఉదాహరణ కరోనా సెకండ్ వేవ్ ఎపిసోడే. పాజిటివ్ కేసులు ఎక్కువగా నమోదు కావటంతో పాటు.. లాక్ డౌన్ తప్పనిసరి పరిస్థితిని ఎప్పటి నుంచో సలహాలు.. సూచనలు అందుతున్నాయి. చివరకు హైకోర్టు తనకు తాను సీరియస్ అయి.. ప్రభుత్వ తీరును కడిగిపారేసే సీరియస్ అయితే తప్పించి.. లాక్ డౌన్ నిర్ణయాన్ని వెల్లడించలేదు. అది కూడా.. హైకోర్టుకు ఆగ్రహం కలిగించేలా.

ఎందుకంటే.. కరోనా విషయానికి సంబంధించి.. ముందస్తుగా నిర్ణయాలు తీసుకోవాలే కానీ.. ఆఖరి నిమిషంలో హడావుడి నిర్ణయాలు వద్దంటూ ఎప్పటి నుంచో మొత్తుకుంటూ ఉంది హైకోర్టు. లాక్ డౌన్ ను సడన్ గా ప్రకటించే కన్నా.. రెండు మూడు రోజుల సమయం ఇచ్చి ప్రకటించి ఉంటే బాగుండేది. ఇప్పుడు హడావుడి పెరిగిపోవటం.. అనవసరమైన రద్దీకి అవకాశం ఇచ్చినట్లు అవుతుందన్నది మర్చిపోకూడదు. ప్రజల కష్టాల మీద సహజసిద్ధమైన అవగాహన ఉండాలే కానీ.. ఎవరో చెప్పారు కాబట్టి అన్నట్లుగా కేసీఆర్ వ్యవహరించటం సరి కాదనే చెప్పాలి అది ఆయన తీరుకు భిన్నమైనది. ఇటీవల కాలంలో ఆయన ఎందుకిలా వ్యవహరిస్తున్నారు? అన్నదిప్పుడు పెద్ద ప్రశ్న.