Begin typing your search above and press return to search.
వెంకన్నపై ఆ స్టార్ హీరో తండ్రికి అంత అక్కసెందుకో?
By: Tupaki Desk | 19 Dec 2017 11:43 AM GMTతిరుమల వెంకన్న... దేశంలోనే అత్యధిక ఆదాయం ఆర్జిస్తున్న దేవుడిగా రికార్డులకెక్కాడు. తిరుమల కొండపై వెలసిన ఈ దేవుడిని దర్శనం కోసం ఒక్క తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా పొరుగు రాష్ట్రాలు తమిళనాడు - కర్ణాటకతో పాటు దేశంలోని దాదాపుగా అన్ని రాష్ట్రాలు - ఇతర విదేశాలకు చెందిన వారు కూడా పోటెత్తుతున్న వైనం మనకు తెలియనిదేమీ కాదు. ఒక రకంగా చెప్పాలంటే వెంకన్నపై భక్తి తెలుగోళ్ల కంటే కూడా తమిళ తంబీలకే అధికమన్న వాదన కూడా లేకపోలేదు. గతంలో తిరుమల తమ రాష్ట్ర పరిధిలోనే ఉండేదని, అనుకోని కారణాలతో ఆ ఆలయం ఏపీలోకి వెళ్లిపోయిందని తెగ బాధపడే తమిళ తంబీలు లేకపోలేదు.
అయినా ఇప్పుడు వెంకన్న - ఆయనకున్న అశేష భక్త జనం విషయం ఎందుకంటే... తమిళనాడుకు చెందిన ఓ ప్రముఖుడు తిరుమల వెంకటేశుడిపై అనుచిత వ్యాఖ్యలు చేశాడు. అయితే అందుకు ఫలితం కూడా ఆయన అనుభవిస్తున్నాడుకోండి. ఆ ప్రముఖుడు మరెవరో కాదు... తమిళనాట సూపర్ స్టార్ గా వెలిగిపోతున్న స్టార్ హీరో విజయ్ తండ్రి ఎస్ ఏ చంద్రశేఖరే. ఓ నెల క్రితం చెన్నైలో జరిగిన ఓ కార్యక్రమానికి హాజరైన చంద్రశేఖర్... చేతికి మైకు అందింది కదా... ఏమైనా మాట్లాడవచ్చంటూ ఏకంగా తిరుమల వెంకన్నపైనే అనుచిత వ్యాఖ్యలు చేశారు. తిరుమల వెంకన్నను వస్తున్న విరాళాలన్నీ కూడా లంచాలేనని కూడా ఆయన ఘాటు కామెంట్ చేశాడు. ఈ కామెంట్ చెవినపడ్డ వారు నోరెళ్లబెట్టగా... ఓ హిందూ సంస్థ మాత్రం చంద్రశేఖర్ చేసిన వ్యాఖ్యలను అంత ఈజీగా వదిలపెట్టదలచుకోలేదు.
అంతే... వెంకన్నపై అనుచిత వ్యాఖ్యలు చేసిన చంద్రశేఖర్ పై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ ఏకంగా మద్రాస్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. ఈ పిటిసన్ ను విచారించిన ధర్మాసనం... చంద్రశేఖర్ చేసిన వ్యాఖ్యలపై దర్యాప్తునకు ఆదేశాలు జారీ చేయడంతో పాటుగా తక్షణమే ఆయనను అరెస్ట్ చేయాలంటూ చెన్నై నగర పోలీసు శాఖకు ఆదేశాలు జారీ చేసింది. అయినా విజయ్ ఫ్యామిలీకి ఈ వివాదమే కొత్త కాదు. తన తాజా చిత్రం మెర్సెల్ ద్వారానూ విజయ్ పెద్ద వివాదాన్నే రేపాడు. హిందువుల మనోభావాలు దెబ్బ తినేలా సదరు చిత్రంలో విజయ్ పలు కామెంట్లు చేశాడు. దీనిపై బీజేపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేయడంతో అసలు ఆ చిత్రం రిలీజవుతుందా? అన్న అనుమానాలు కూడా వ్యక్తమయ్యాయి. అయితే ఊహించని పరిణామాల నేపథ్యంలో సదరు వివాదం సద్దుమణగగా... తాజాగా విజయ్ తండ్రి చంద్రశేఖర్... ఏకంగా తిరుమల వెంకన్ననే టార్గెట్ చేస్తూ కొత్త వివాదాన్ని రేకెత్తించడం గమనార్హం.