Begin typing your search above and press return to search.

అమ‌రావ‌తి రైతుల కౌలు చెల్లింపుకు డెడ్ లైన్ పెట్టిన హైకోర్టు...!

By:  Tupaki Desk   |   8 Oct 2021 2:41 PM GMT
అమ‌రావ‌తి రైతుల కౌలు చెల్లింపుకు డెడ్ లైన్ పెట్టిన హైకోర్టు...!
X
ఏపీ రాజ‌ధాని అమ‌రావ‌తిని వికేంద్రీక‌రిస్తూ ఏపీ ప్ర‌భుత్వం తీసుకున్న నిర్ణ‌యంపై అక్క‌డ రైతులు, ప్రజ‌లు భ‌గ్గుమంటున్నారు. అమ‌రావ‌తిని రాజ‌ధానిగా కొనసాగించాల‌ని అక్క‌డ చేప‌ట్టిన దీక్ష‌లు, నిర‌స‌న‌లకు ప్ర‌భుత్వం నుంచి ఎలాంటి స్పంద‌నా లేదు. మ‌రోవైపు ఏపీ ప్ర‌భుత్వం మాత్రం మూడు రాజ‌ధానుల నిర్ణ‌యం ప్ర‌క‌ట‌న‌కే క‌ట్టుబ‌డి ఉంది. ఇక టీడీపీ ప్ర‌భుత్వం అధికారంలో ఉన్న‌ప్పుడు రాజ‌ధాని కోసం ఏకంగా రైతుల నుంచి 33 వేల ఎక‌రాలు ల్యాండ్ ఫూలింగ్ ద్వారా సేకరించింది. ఈ క్ర‌మంలోనే వారికి ప్లాట్లు కేటాయించే వ‌ర‌కు కౌలు చెల్లిస్తామ‌ని హామీ ఇచ్చింది.

ఇక జ‌గ‌న్ ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చాక రాజ‌ధాని వికేంద్రీక‌ర‌ణ నిర్ణ‌యం తీసుకోవ‌డంతో అక్క‌డ రైతుల ప‌రిస్థితి కుడితిలో ప‌డిన ఎలుక చందంగా మారింది. అస‌లే త‌మ భూముల విలువ ప‌డిపోయింద‌ని వారు వాపోతున్నారు. దీనికి తోడు ప్ర‌భుత్వం కూడా రైతుల‌కు చెల్లించాల్సిన కౌలు స‌క్ర‌మంగా చెల్లించ‌డం లేదు. దీంతో వారు కోర్టుల్లో కేసులు వేసి ప్ర‌భుత్వంపై పోరాటం చేస్తూనే ఉన్నారు. ఈ క్ర‌మంలోనే ఈ రోజు అమ‌రావ‌తి రైతుల కౌలుపై ప్ర‌భుత్వంపై ఆగ్ర‌హం వ్య‌క్తం చేసింది.

తాము ఎన్ని సార్లు కౌలు చెల్లించాల‌ని చెప్పినా ప్ర‌భుత్వం ప‌ట్టించుకోవ‌డం లేద‌ని ఫైర్ అయ్యింది. ఈ రైతుల కౌలు మొత్తం నాలుగు వారాల్లోపు చెల్లించాల‌ని చెప్పింది. ఇప్ప‌టికే 2021 సంవత్స‌రం వ‌చ్చి 10 నెల‌లు అవుతోంద‌ని.. ప్ర‌భుత్వం కౌలు చెల్లించ‌క‌పోవ‌డంతో రైతు కుటుంబాల పోష‌ణ‌, వారి వైద్య ఖ‌ర్చుల‌కు కూడా ఆయా కుటుంబాల్లో తీవ్ర ఇబ్బంది ఎదుర‌వుతోంద‌ని.. పిటిష‌న్ల త‌ర‌పున న్యాయ‌వాది ల‌క్ష్మీనారాయ‌ణ వాదించారు. చివ‌ర‌కు కోర్టు ప్ర‌భుత్వానికి నాలుగు వారాల డెడ్‌లైన్ విధిస్తూ.. తక్ష‌ణ‌మే కౌలు చెల్లించాల‌ని స్ప‌ష్టం చేసింది. మ‌రి జ‌గ‌న్ ప్ర‌భుత్వం ఈ డెడ్‌లైన్ లోగా కౌలు చెల్లిస్తుందో ? లేదో ? చూడాలి.