Begin typing your search above and press return to search.

దేవినేని ఉమకు హైకోర్టు షాక్ ... ఆగస్ట్ 3 వరకు జైల్లోనే !

By:  Tupaki Desk   |   30 July 2021 11:30 AM GMT
దేవినేని ఉమకు హైకోర్టు షాక్ ... ఆగస్ట్ 3 వరకు జైల్లోనే !
X
తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి దేవినేని ఉమపై ఎస్సీ, ఎస్టీ కేసుతో పాటు కుట్ర తదితర కేసులు నమోదైన సంగతి తెలిసిందే. దాదాపు 12 సెక్షన్ల కింద ఆయనపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ నేపథ్యంలో, స్థానిక కోర్టు ఆయనకు 14 రోజుల రిమాండ్ విధించింది. దీంతో, ఆయనను రాజమండ్రి సెంట్రల్ జైలుకు తరలించిన సంగతి తెలిసిందే. మరోవైపు, ఈరోజు ఏపీ హైకోర్టులో దేవినేని ఉమ బెయిల్ పిటిషన్ దాఖలు చేయగా , జి.కొండూరు పోలీస్ స్టేషన్ లో నమోదైన కేసుల్లో బెయిల్ మంజూరు చేయాలని పిటిషన్ లో ఆయన కోరారు.

దేవినేని ఉమ దాఖలు చేసిన పిటిషన్ ను విచారణకు స్వీకరించిన హైకోర్టు, ఇవాళ వాదనలు కూడా ప్రారంభించింది. అయితే, ఈ కేసులో ఉమను ఎలాగైనా రిమాండ్ లో ఉంచాలని భావించిన పోలీసులు, స్టేషన్ రికార్డులను కోర్టుకు సమర్పించలేదు. దీంతో విచారణ వాయిదా వేయాలని కోర్టును వారు కోరారు. దీనిపై దేవినేని ఉమ తరఫు న్యాయవాది అభ్యంతరం తెలిపారు. 30 కిలోమీటర్ల దూరంలో ఉన్న స్టేషన్ నుంచి రికార్డులు వెంటనే తెప్పించాలని హైకోర్టు ధర్మాసనాన్ని కోరారు. తనపై నమోదైన కేసుల రికార్డులను వెంటనే స్టేషన్ నుంచి తెప్పించాలన్న దేవినేని ఉమ లాయర్ తరఫు అభ్యర్ధనను హైకోర్టు అంగీకరించలేదు.

ప్రభుత్వ వాదన తో ఏకీభవించిన హైకోర్టు ఈ పిటిషన్ పై విచారణను వచ్చే, మంగళవారానికి అంటే ఆగస్టు 3వ తేదీకి వాయిదా వేసింది. రేపు, ఎల్లుండి హైకోర్టుకు వారాంతపు సెలవులు ఉండటం, సోమవారం అప్పటికే విచారణకు స్వీకరించిన పిటిషన్లు ఉండటంతో మంగళవారం దేవినేని ఉమ బెయిల్ పై హైకోర్టు విచారణ జరపనుంది. అప్పటివరకూ దేవినేని ఉమకు జైల్లోనే ఉండక తప్పదు. ఆ తర్వాత మాజీ మంత్రి దేవినేని ఉమను పోలీస్ కస్టడీకి ఇవ్వాలని విజయవాడ కోర్టులో పిటిషన్ దాఖలైంది. ఎస్సీ, ఎస్టీ వేధింపులకు సంబంధించి కోర్టులో డీఎస్పీ పిటిషన్ వేశారు. మంగళవారం దేవినేని ఉమను అరెస్ట్ చేసి రాజమండ్రి సెంట్రల్ జైలుకు తరలించారు. హైకోర్టుకు వచ్చిన దేవినేని ఉమ బెయిల్ పిటిషన్ మంగళవారానికి వాయిదా పడింది. ఈలోపు దేవినేని ఉమ నుంచి.. మరిన్ని వివరాలు రాబట్టాలని కస్టడీలోకి ఇవ్వాలని పోలీసులు కోరారు.