Begin typing your search above and press return to search.

తెలంగాణ స‌ర్కారుకు హైకోర్టు పంచ్

By:  Tupaki Desk   |   11 Oct 2018 7:41 AM GMT
తెలంగాణ స‌ర్కారుకు హైకోర్టు పంచ్
X
తెలంగాణ స‌ర్కారుకు హైకోర్టులో గురువారం గ‌ట్టి ఎదురుదెబ్బ త‌గిలింది. స‌ర్పంచ్‌ల ప‌ద‌వీకాలం ముగిసినా తిరిగి ఎన్నిక‌లు నిర్వ‌హించ‌క‌పోవ‌డంపై ప్ర‌భుత్వానికి హైకోర్టు మొట్టికాయ‌లు వేసింది. పంచాయ‌తీల్లో ప్ర‌త్యేక అధికారుల‌ను నియ‌మించి పాల‌న కొన‌సాగించ‌డం చ‌ట్ట విరుద్ధ‌మ‌ని అభిప్రాయ‌ప‌డింది. మూడు నెల‌ల్లోగా పంచాయ‌తీ ఎన్నిక‌లు నిర్వ‌హించాలంటూ స్ప‌ష్ట‌మైన ఆదేశాలు జారీ చేసింది. హైకోర్టు తాజా తీర్పు తెలంగాణ ప్ర‌భుత్వానికి గ‌ట్టి ఎదురుదెబ్బేన‌ని ప‌లువురు విశ్లేషిస్తున్నారు.

తెలంగాణ‌లో స‌ర్పంచ్‌ ల ప‌ద‌వీ కాలం ఈ ఏడాది ఆగ‌స్టు నాటికే పూర్త‌యింది. అయితే, ముంద‌స్తు అసెంబ్లీ ఎన్నిక‌లకు వెళ్లాల‌ని నిర్ణ‌యించుకున్న కేసీఆర్ ప్ర‌భుత్వం.. స‌ర్పంచ్ ఎన్నిక‌లను వాయిదా వేయాల‌ని నిర్ణ‌యించుకుంది. శాస‌న‌స‌భ ఎన్నిక‌ల‌కు ముందు స‌ర్పంచ్ ఎన్నిక‌లు జ‌రిపితే.. వాటితోనే బిజీ అవ్వాల్సి వ‌స్తుంద‌ని, అసెంబ్లీ ఎన్నిక‌ల‌పై పూర్తిగా దృష్టి పెట్ట‌డం వీలుకాద‌ని భావించ‌డ‌మే అందుకు కార‌ణం. దీంతో స‌ర్పంచ్‌ ల ప‌ద‌వీకాలాన్ని పొడిగించ‌డం వంటి ప్ర‌త్యామ్నాయాల‌ను ప‌రిశీలించింది. చివర‌కు వారి ప‌ద‌వీకాలం పెంపున‌కు బ‌దులుగా.. ప్ర‌త్యేక అధికారుల‌ను నియ‌మించ‌డం మేల‌ని భావించింది. ప్ర‌తి గ్రామ పంచాయ‌తీకి ఒక‌రి చొప్పున‌ ప్ర‌త్యేక అధికారుల‌ను నియ‌మించింది. వారికే పాల‌నా బాధ్య‌త‌లు అప్ప‌గించింది.

త‌మ ప‌ద‌వీకాలాన్ని పొడిగించ‌కుండా ప్ర‌భుత్వం అధికారుల‌కు బాధ్య‌త‌లు అప్ప‌జెప్ప‌డంపై చాలామంది స‌ర్పంచ్‌ లు నొచ్చుకున్నారు. తిరిగి వెంట‌నే ఎన్నిక‌లు నిర్వ‌హించాల‌ని డిమాండ్ చేశారు. అందుకు ప్ర‌భుత్వం ససేమిరా అన‌డంతో దాదాపు 500 మంది మాజీ స‌ర్పంచ్‌ లు ఇటీవ‌ల హైకోర్టును ఆశ్ర‌యించారు. గ‌డువు ముగిసినా స‌ర్పంచ్ ఎన్నిక‌ల‌ను ప్ర‌భుత్వం నిర్వ‌హించ‌డం లేదంటూ ఫిర్యాదు చేశారు. సంబంధిత పిటిష‌న్ల‌న్నింటినీ సంయుక్తంగా విచార‌ణ నిర్వ‌హించిన హైకోర్టు.. వారి వాద‌న‌తో ఏకీభ‌వించింది. గ్రామ పంచాయ‌తీల‌కు ప్ర‌త్యేక అధికారుల నియామ‌కం చ‌ట్ట విరుద్ధ‌మ‌ని, రాజ్యాంగ విరుద్ధ‌మ‌ని తేల్చిచెప్పింది. మూడు నెల‌ల్లోగా స‌ర్పంచ్‌ ఎన్నిక‌లు నిర్వ‌హించాల‌ని ఆదేశాలు జారీ చేసింది. మ‌రి అసెంబ్లీ ఎన్నిక‌ల‌తో బిజీగా ఉన్న టీ-స‌ర్కారు.. స‌ర్పంచ్ ఎన్నిక‌ల‌కు ఎలా స‌న్నాహాలు చేస్తుందో తెలుసుకోవాలంటే వేచి చూడాల్సిందే!