Begin typing your search above and press return to search.

ఈటలకు షాకిచ్చిన తెలంగాణ హైకోర్టు

By:  Tupaki Desk   |   11 March 2022 11:07 AM GMT
ఈటలకు షాకిచ్చిన తెలంగాణ హైకోర్టు
X
తెలంగాణ అసెంబ్లీ బ‌డ్జెట్ స‌మావేశాల నుంచి బీజేపీ ఎమ్మెల్యేలు ఈటల రాజేందర్, రాజాసింగ్, రఘునందన్ లను సస్పెండ్ చేసిన సంగతి తెలిసిందే. అయితే, తమ స‌స్పెన్ష‌న్‌ ను సవాల్ చేస్తూ ఆ ముగ్గురు ఎమ్మెల్యేల‌ు హైకోర్టును ఆశ్రయించారు.

స్పీక‌ర్ విధించిన స‌స్పెన్ష‌న్‌పై స్టే విధించాలని వారు హైకోర్టును కోరారు. ఈ కేసుపై మ‌రింత విస్తృతంగా విచార‌ణ చేప‌ట్టేలా మ‌రోసారి అసెంబ్లీ కార్య‌ద‌ర్శికి నోటీసులు జారీ చేయాలని కోరారు. ఈ నేపథ్యంలోనే ఆ ముగ్గురు ఎమ్మెల్యేలకు హైకోర్టు షాకిచ్చింది.

ఎమ్మెల్యేల స‌స్పెన్ష‌న్‌పై స్టే విధించేందుకు హైకోర్టు నిరాకరించింది. అంతేకాదు, ఈ కేసు త‌దుప‌రి విచార‌ణ‌ను నాలుగు వారాల‌కు వాయిదా వేసింది.

అసెంబ్లీ బ‌డ్జెట్ స‌మావేశాల‌ను గ‌వ‌ర్న‌ర్ ప్ర‌సంగం లేకుండా ఎలా ప్రారంభిస్తారంటూ బీజేపీ ఎమ్మెల్యేలు రాజా సింగ్‌, ర‌ఘునంద‌న్ రావు, ఈట‌ల రాజేంద‌ర్‌లు తొలి రోజు స‌భ‌లో నిర‌స‌నకు దిగిన సంగతి తెలిసిందే. స‌భ ప్రారంభం కాగానే వారు స్పీకర్ వెల్‌లోకి దూసుకెళ్లి ఆయనతో వాగ్వాదానికి దిగారు.

ఈ క్రమంలోనే వారిని బ‌డ్జెట్ స‌మావేశాలు ముగిసేదాకా స‌భ నుంచి స‌స్పెండ్ చేస్తూ స్పీక‌ర్ పోచారం శ్రీనివాస‌రెడ్డి ఉత్తర్వులు జారీ చేశారు. అయితే,

తమను అణిచివేయడం సాధ్యం కాదని, తమ మైకులు కట్ చేసి, సస్పెండ్ చేసి తమ గొంతులను అణచివేయలేరని ఆ ముగ్గురు ఎమ్మెల్యేలు మండిపడుతున్నారు. ప్రతిపక్ష నేతగా ఉన్న సమయంలో కేసీఆర్ గంటల కొద్దీ మాట్లాడారని, ఇపుడు నియంతలా మారారని వారు దుయ్యబడుతున్నారు.