Begin typing your search above and press return to search.

విశాఖ కలెక్టర్ కు హైకోర్టు షాక్

By:  Tupaki Desk   |   31 Dec 2021 6:33 AM GMT
విశాఖ కలెక్టర్ కు హైకోర్టు షాక్
X
ప్రభుత్వ భూమిలో అక్రమ నిర్మాణాలు చేపట్టకుండా చర్యలు తీసుకోవాలన్న తమ ఆదేశాలను అమలు చేయడంలో విఫలమైనందుకు వివరణ ఇవ్వాలని విశాఖపట్నం జిల్లా కలెక్టర్ ను హైకోర్టు ఆదేశించింది. జనవరి 3న వ్యక్తిగతంగా హాజరై వివరణ ఇవ్వాలని కోరింది.

విశాఖపట్నం జిల్లా సబ్బవరం గ్రామ పరిధిలోని సర్కార్ భూమిలో దుర్గా ప్రసాద్ అనే వ్యక్తి అక్రమ నిర్మాణాలు చేపడుతున్నారంటూ విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ఉద్యోగి వెంకటేశ్వర్లు హైకోర్టులో పిటీషన్ దాఖలు చేశారు. దీనిపై విచారించిన ధర్మాసనం ప్రభుత్వ భూమిలో ఎలాంటి నిర్మాణాలు చేపట్టకుండా చూడాలని కలెక్టర్ ను ఆదేశించింది.

అయితే అక్రమ నిర్మాణాలు ఆగడం లేదంటూ వెంకటేశ్వర్లు రాష్ట్ర హైకోర్టులో పిటీషన్ దాఖలు చేశాడు. ఇది గురువారం విచారణకు వచ్చింది. ఈ సందర్భంగా పిటీషనర్ తరుఫున న్యాయవాది ఎన్.హెచ్ అక్బర్ హైకోర్టులో వాదనలు వినిపించారు. హైకోర్టు ఆదేశాలను అమలు చేయడంలో అధికారులు విఫలం అవుతున్నారంటూ అక్రమ నిర్మాణాలకు సంబంధించిన ఫొటోలను ధర్మాసనం ముందుంచారు.

వీటిని పరిశీలించిన హైకోర్టు కలెక్టర్ పై ఆగ్రహం వ్యక్తం చేసింది. కోర్టు ఆదేశాలు ఉన్నప్పటికీ అక్రమ నిర్మాణాల విషయంలో ఎందుకు అలక్ష్యంగా వ్యవహరిస్తున్నారని కలెక్టర్ ను ప్రశ్నించారు. ఈ మేరకు వ్యక్తిగతంగా జనవరి 3న హాజరై వివరణ ఇవ్వాలని ఆదేశించింది.

కాగా కోర్టు ఆదేశాల అమలులో నిర్లక్ష్యం వహించినట్టు తేలితే కోర్టు ధిక్కరణ కింద చర్యలు చేపడుతామని హైకోర్టు వ్యాఖ్యానించింది.