Begin typing your search above and press return to search.

సినిమా టికెట్ల జీవో ర‌ద్దు.. ఏపీ స‌ర్కారుకి హైకోర్టు షాక్‌

By:  Tupaki Desk   |   14 Dec 2021 11:31 AM GMT
సినిమా టికెట్ల జీవో ర‌ద్దు.. ఏపీ స‌ర్కారుకి హైకోర్టు షాక్‌
X
సినిమా టికెట్ ధరలు తగ్గిస్తూ ఆంధ్రప్రదేశ్‌లో ప్రభుత్వం జారీ చేసిన జీవోను రాష్ట్ర హైకోర్టు కొట్టివేసింది. సినిమా టికెట్ల ధరలను నిర్ణయించే హక్కు రాష్ట్ర ప్రభుత్వానికి లేదంటూ సినిమా థియేటర్ల యజమానులు హైకోర్టులో పిటీషన్‌ వేశారు. పిటీషనర్ల తరఫున న్యాయవాదులు చేసిన వాదనతో కోర్టు ఏకీభవించింది. ప్రభుత్వం జారీ చేసిన జీవో నం.35ను సస్పెండ్‌ చేసింది. దీంతో ఇక నుంచి రాష్ట్రంలోని సినిమా థియేటర్లలో పాత రేట్లే అమల్లోకి వస్తాయి.

పవన్ కల్యాణ్ 'వకీల్‌సాబ్‌' సినిమా విడుదల సమయం నుంచి టికెట్‌ రేట్ల గురించి ఏపీ ప్రభుత్వానికి, సినిమా పరిశ్రమకు చర్చలు జరుగుతూ ఉన్నాయి. పలుమార్లు ఇదే విషయంపై చర్చించడానికి సినీ ప్రముఖులు ఏపీ ప్రభుత్వం చుట్టూ తిరిగారు. ఏపీ మంత్రి పేర్ని నాని ఈ విషయంపై పలు సందర్భాల్లో ప్రెస్‌మీట్లు పెట్టి మరీ మాట్లాడారు. రీసెంట్‌గా ఏపీలో సినిమా టికెట్ల ధరలు ఇలానే ఉండాలంటూ.. టికెట్ ధరల పట్టికను కూడా ప్రభుత్వం విడుదల చేసింది.

ప్రభుత్వం తీసుకున్న ఆన్‌లైన్‌ వ్యవహారంపై సంతృప్తికరంగానే ఉన్న టాలీవుడ్ ప్రముఖులు.. టికెట్ల ధరల విషయంలోనే ఒక్కసారి ఆలోచించాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. కానీ ప్రభుత్వం వైపు నుండి ఎటువంటి స్పందన రాలేదు. దీంతో ఈ విషయం కోర్టు వరకు వెళ్లాయి. నేడు(మంగళవారం) కోర్టు ఇచ్చిన తీర్పుతో రిలీజ్‌కు రెడీగా ఉన్న సినిమాల నిర్మాతలే కాకుండా, ఇండస్ట్రీకి చెందిన పలువురు ప్రముఖులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

దీంతో సినిమా టికెట్ల రేట్లను తగ్గిస్తూ ప్రభుత్వం ఇచ్చిన జీవోను హైకోర్టు రద్దు చేసింది. పాత విధానంలోనే టికెట్ల రేట్లు నిర్ణయించేందుకు పిటిషనర్లకు వెసులుబాటు కల్పించింది. థియేటర్ల యజమానుల పిటిషన్‌పై హైకోర్టులో సీనియర్‌ న్యాయవాదులు వాదించారు. కోర్టు ఆదేశాలకు విరుద్ధంగా ప్రభుత్వం జీవో ఇచ్చిందని వారు కోర్టుకు వివరించారు. టికెట్ల రేట్ల తగ్గింపుపై కోర్టు ఆదేశాలు ఉన్నాయని పిటిషనర్లు తెలిపారు. కొత్త సినిమాలకు రేట్లు పెంచుకునే హక్కు ఉంటుందని పేర్కొన్నారు.