Begin typing your search above and press return to search.

కేసీఆర్‌ కు పంచ్ ప‌డేసేలా హైకోర్టు వ్యాఖ్య‌లు

By:  Tupaki Desk   |   13 Jun 2017 5:42 AM GMT
కేసీఆర్‌ కు పంచ్ ప‌డేసేలా హైకోర్టు వ్యాఖ్య‌లు
X
హైకోర్టు నుంచి తెలంగాణ ప్ర‌భుత్వానికి మ‌రో ఎదురుదెబ్బ త‌గిలింది. తెలంగాణ‌లో గ్రూప్ 2 నియామ‌కాల ప్ర‌క్రియ‌ను తాత్కాలికంగా నిలిపివేస్తూ ఉమ్మ‌డి హైకోర్టు సోమ‌వారం మ‌ధ్యంత‌ర ఉత్త‌ర్వులు జారీ చేసింది. ఫ‌లితాలు వెల్ల‌డితో పాటు.. ధ్రువీక‌ర‌ణ ప‌త్రాల ప‌రిశీలన నిమిత్తం పిలిచిన అభ్య‌ర్థుల్లో అన‌ర్హులు ఉన్నారంటూ హైకోర్టులు దాఖ‌లైన వ్యాజ్యాల్ని విచారిస్తున్న జ‌స్టిస్ ఎంఎస్ రామ‌చంద్ర‌రావు తాజాగా మ‌ధ్యంత‌ర ఉత్త‌ర్వులు జారీ చేశారు. మూడు వారాలు నియామ‌క ప్ర‌క్రియ‌ను నిలిపివేయాల‌ని ఆదేశాలు జారీ చేశారు. అదే స‌మ‌యంలో పూర్తి వివ‌రాల‌తో కూడిన కౌంట‌ర్లు జారీ చేయాల‌న్నారు.

ఇటీవ‌ల వెల్ల‌డించిన గ్రూప్ 2 ప‌రీక్ష‌లో అన‌ర్హులైన అభ్య‌ర్థులు మెరిట్ జాబితాలో ఉండ‌టంతో మొత్తం ప్ర‌క్రియ‌లో లోపాలు ఉన్నాయ‌ని పేర్కొంటూ హైద‌రాబాద్‌ కు చెందిన వి. రామ‌చంద్రారెడ్డి మ‌రో 14 మంది.. శ్రీచ‌ర‌ణ్ దాస్ గోస్వామి మ‌రో 20 మంది వేర్వేరుగా రెండు వ్యాజ్యాల్ని దాఖ‌లు చేశారు. ఈ సంద‌ర్భంగా త‌మ వాద‌న‌లు వినిపించిన పిటీష‌న‌ర్ త‌ర‌పు న్యాయ‌వాదులు కీల‌క‌మైన అంశాల్ని తెర మీద‌కు తీసుకొచ్చారు. వీరి వాద‌న ప్ర‌కారం ఓఎంఆర్ షీట్ నింప‌టానికి సంబంధించి టీఎస్ పీఎస్సీ మార్గ‌ద‌ర్శ‌కాలు జారీ చేసిందని చెబుతూ .. "రెండోసారి దిద్ద‌టం.. వైట్ న‌ర్ లు వాడ‌టం వంటివి చేయ‌కూడ‌దు. అయితే.. ఈ నిబంధ‌నను స‌వాలు చేస్తూ కొంద‌రు హైకోర్టును ఆశ్ర‌యించారు. చేతితో దిద్దుబాట్లు.. వైట్ న‌ర్ వాడితే కంప్యూట‌ర్ అంగీక‌రించ‌దని టీఎస్ పీఎస్సీ పేర్కొంది. దీంతో.. దిద్దిన‌.. వైట్ న‌ర్ వాడిన ప‌త్రాల్ని మూల్యాంక‌నం చేయాలంటూ దాఖ‌లైన వాజ్యాన్ని హైకోర్టు కొట్టివేస్తూ ఏప్రిల్ 24న తీర్పు వ‌చ్చింది. ఈ తీర్పు ప్ర‌కారం అన‌ర్హులైన వారి పేర్లు మెరిట్ లిస్ట్ లో ఉండ‌టం ఆశ్చ‌ర్యం క‌లిగించింది. ఇది చూసిన‌ప్పుడు క‌మిష‌న్ త‌న సొంత మార్గ‌ద‌ర్శ‌కాల్ని అమ‌లు చేస్తుంద‌ని తేలింది. ప‌రీక్ష‌ల నిర్వ‌హ‌ణ‌లో జంబ్లింగ్ విధానాన్ని కూడా అమ‌లు చేయ‌లేదు" అని చెప్పారు.

అన‌ర్హులైన వారి పేర్లు కొన్ని మెరిట్ జాబితాలోకి ఉండ‌టం ఆశ్చ‌ర్య‌క‌ర‌మైన అంశం అంటూ కోర్టు దృష్టికి తెచ్చారు. ఈ మొత్తం ప్ర‌క్రియ‌లో లోపాలు ఉన్న‌ట్లుగా కోర్టు దృష్టికి తీసుకురావ‌టంతో.. వీరి వాద‌న‌లు విన్న న్యాయ‌మూర్తి గ్రూప్ 2 నియామ‌కాల ఫ‌లితాల్ని నిలిపివేస్తూ నిర్ణ‌యం తీసుకున్నారు. కోర్టు ఆదేశాల మేర‌కు మంగ‌ళ‌వారం నుంచి మొద‌లు కావాల్సిన అభ్య‌ర్థుల ధ్రువీక‌ర‌ణ ప‌త్రాల ప‌రిశీల‌న‌ను వాయిదా వేసిన‌ట్లుగా టీఎస్ పీఎస్సీ పేర్కొంది. నిష్ప‌క్ష‌పాతంగా నియామ‌కాలు సాగుతాయ‌ని చెప్పే ముఖ్య‌మంత్రి కేసీఆర్ మాట‌ల‌కు భిన్నంగా చోటు చేసుకున్న ప‌రిణామాలు ఆయ‌న ఇమేజ్‌ను దెబ్బ తీసేలా ఉన్నాయ‌న్న వాద‌న వినిపిస్తోంది. ఉద్యోగాల క‌ల్ప‌న‌లో ఇప్ప‌టికే ఆల‌స్య‌మ‌వుతుంద‌న్న విమ‌ర్శలు ఎదుర్కొంటున్న తెలంగాణ ప్ర‌భుత్వానికి తాజా ప‌రిణామాలు మ‌రింత ఇబ్బంది పెట్టేవిగా మార‌తాయ‌న‌టంలో సందేహం లేద‌ని చెప్ప‌క త‌ప్ప‌దు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/