Begin typing your search above and press return to search.

‘జబర్దస్త్’తో జరిగే నష్టమేమిటో చెప్పిన హైకోర్టు

By:  Tupaki Desk   |   18 Feb 2017 4:58 AM GMT
‘జబర్దస్త్’తో జరిగే నష్టమేమిటో చెప్పిన హైకోర్టు
X
తెలుగు లోగిళ్లలో ప్రసారమయ్యే జబర్దస్త్ ఎప్పుడూ హాట్ టాపిక్కే. హాస్యం పేరుతో డబుల్ మీనింగ్ డైలాగులతో పాటు.. పంచ్ లంటూ ప్రాసకోసం పాకులాడే అవస్థ భారీగానే కనిపిస్తుంది. చిన్నపిల్లల నుంచి వృద్ధుల వరకూ అన్ని వర్గాల వారు.. అన్ని ప్రాంతాల వారు.. చూసే ప్రోగ్రాంగా దీనికి పేరుంది. ఇంతమంది చూస్తున్న జబర్దస్త్ కు మరో విచిత్రమైన లక్షణం ఉంది. ఈ కార్యక్రమాన్ని తిడుతూ.. విమర్శలు చేస్తూనే చూడటం కనిపిస్తుంది.

హాస్యం పేరుతో మోతాదుకు మించిన మొరటుదనం ఈ కార్యక్రమంలో ఉంటుందన్న విమర్శతో పాటు.. చులకనా భావం ఎక్కువే. ఏదో ఒక వివాదం ఎప్పుడూ వెంటాడుతూనే ఉంటాయి. ఇన్ని మైనస్ లున్నా.. ఆ కార్యక్రమాన్ని మాత్రం రెగ్యులర్ గా ఫాలో అయ్యే వారెందరో. 2014 జులై 10న జబర్దస్త్ కార్యక్రమంలో ప్రసారమైన ఒక స్కిట్ లో న్యాయమూర్తుల్ని.. న్యాయవాదుల్ని కించపరిచేలా చేశారని.. దీని వల్ల న్యాయస్థానం పరువు ప్రతిష్ఠలు డ్యామేజ్ అయ్యాయని పేర్కొంటూ న్యాయవాది అరుణ్ కుమార్ కరీంనగర్ జిల్లా హుజురబాద్ కోర్టులో ఫిర్యాదు చేశారు.

అనంతరం ఈ కేసు రెండు తెలుగు రాష్ట్రాల ఉమ్మడి హైకోర్టుకు చేరింది. తాజాగా ఈ కేసుపై తీర్పును ఇచ్చే క్రమంలో హైకోర్టు కొన్ని వ్యాఖ్యలు చేసింది. టీవీ కార్యక్రమాల్ని చిన్నా.. పెద్దా.. గ్రామీణ.. పట్టణ ప్రాంతానికి చెందిన అన్ని వర్గాల ప్రజలు చూస్తుంటారని.. న్యాయవ్యవస్థపై చేసే వ్యాఖ్యలు ప్రజానీకం మనసుల్లో న్యాయవ్యవస్థ హుందాతనానికి భంగం వాటిల్లుతుందని.. తప్పుడు అభిప్రాయం కలిగేలా చేస్తుందని వ్యాఖ్యానించింది.

జబర్దస్త్ లాంటి కార్యక్రమాలపై చట్టపరంగా ఎలాంటి నిషేదాన్ని.. నియంత్రణను చేయలేమని.. ఇలాంటివాటిని అడ్డుకోవటానికి మార్గదర్శకాలు రూపొందిస్తే తప్ప న్యాయవ్యవస్థ ప్రతిష్ఠను దిగజార్చే కార్యక్రమాల్ని అడ్డుకోవటం సాధ్యం కాదని పేర్కొనటం గమనార్హం. ఇక.. ఈ కేసు విషయంలో ఫిర్యాదు చేసిన వారిపై ఎలాంటి చర్యలుతీసుకోలేమంటూ కేసును కొట్టేసింది. జబర్దస్త్ కార్యక్రమానికి న్యాయనిర్ణేతలుగా వ్యవహరించే నాగాబాబు.. రోజా.. యాంకర్ రష్మీ..అనసూయ.. ఇతర నటీనటులకు ఈ తీర్పు ఊరటనివ్వటం ఖాయం. కేసును కొట్టేసిన ఆనందమే తప్పించి.. ఆ సందర్భంగా కోర్టు చెప్పిన మాటల్ని ఆరోపణలు ఎదుర్కొనే వారు.. జబర్దస్త్ టీం కాస్త దృష్టి పెడితే.. మరోసారి వేలెత్తి చూపించుకోకుండా జాగ్రత్త పడొచ్చు. అలాంటి అవకాశం ఉందా?

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/