Begin typing your search above and press return to search.

రేవంత్ దూకుడుతో కేసీఆర్ ఝ‌ల‌క్ తిన్న‌ట్లేనా?

By:  Tupaki Desk   |   15 Feb 2017 8:24 AM GMT
రేవంత్ దూకుడుతో కేసీఆర్ ఝ‌ల‌క్ తిన్న‌ట్లేనా?
X
తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీఆర్‌ పై పట్టువ‌ద‌ల‌ని విక్ర‌మార్కుడిలాగా విరుచుకుప‌డుతున్న తెలంగాణ టీడీపీ కార్య‌నిర్వాహ‌క అధ్య‌క్షుడు రేవంత్ రెడ్డి మ‌రోద‌ఫా త‌న‌దైన శైలిలో రాష్ట్ర ప్రభుత్వాన్ని ఇర‌కాటంలో ప‌డేశారు. నిబంద‌న‌ల‌కు విరుద్ధంగా రాష్ట్ర ప్రభుత్వ సలహాదారులు - ప్రత్యేక ప్రతినిధులు - వివిధ కార్పొరేషన్ల చైర్మన్లకు కేబినెట్ ర్యాంకు ఇచ్చారని గ‌తంలో రేవంత్ ఆరోపించిన సంగ‌తి తెలిసిందే. అయితే త‌న డిమాండ్ల‌కు కేసీఆర్ స‌ర్కార్ స్పందించ‌ని నేప‌థ్యంలో హైకోర్టులో ప్ర‌జా ప్ర‌యోజ‌న వాజ్యం దాఖ‌లు చేశారు. రేవంత్ రెడ్డి దాఖ‌లు చేసిన ఈ పిల్‌ ను ధర్మాసనం విచారణకు స్వీకరించింది. దీనిపై వచ్చే రెండు వారాల్లోగా అఫిడవిట్లలో వివరణ ఇవ్వాలంటూ హైకోర్టు ధర్మాసనం తెలంగాణ ప్రభుత్వానికి, కేబినెట్ హోదా అనుభవిస్తున్న ప్రతివాదులకు మంగళవారం నోటీసులు జారీ చేసింది.

ప్రభుత్వ సలహాదారులు జి వివేకానంద - ఆర్ విద్యాసాగరరావు - ఏకె గోయల్ - ఎ రామకృష్ణ - బీవీ పాపారావు - కేవీ రమణాచారి - జిఆర్ రెడ్డి (ఫైనాన్స్) - దేవులపల్లి ప్రభాకరరావు - పేర్వారం రాములు - సోమారపు సత్యనారాయణ - సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి - పిడమర్తిరవి - ప్రశాంత్ రెడ్డి - చీఫ్ విప్ కొప్పుల ఈశ్వర్ - ఢిల్లీలో ప్రత్యేక ప్రతినిధి వేణుగోపాలాచారి - కెఎం సాన్హి - రామచంద్రుడు తేజోవత్‌ లకు కేబినెట్ హోదా కల్పించడాన్ని రేవంత్‌ రెడ్డి పిటిషన్‌ లో ప్రశ్నించారు. రాజ్యాంగంలోని 164 (1ఏ) అధికరణ ప్రకారం కేబినెట్ హోదా 15శాతం కంటే మించి మంత్రులు ఉండరాదని స్పష్టం చేసిందన్నారు. రేవంత్ రెడ్డి దాఖలు చేసిన పిల్‌ ను తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రమేష్ రంగనాథన్, జస్టిస్ షామీమ్ అక్తర్‌ తో కూడిన ధర్మాసనం విచారణకు స్వీకరించింది. పిల్‌ పై తెలంగాణ అడ్వకేట్ జనరల్ రామకృష్ణారెడ్డి వాదనలు వినిపిస్తూ కేబినెట్ ర్యాంకులు ఇవ్వడంపై ప్రత్యేకంగా మార్గదర్శకాలు, నిబంధనలు లేవన్నారు. ఈ పదవుల్లో ఉన్నవారికి ప్రభుత్వం గౌరవంతోనే కేబినెట్ ర్యాంకు ఇస్తున్నట్టు చెప్పారు. అయితే దీనిపై రేవంత్ అభ్యంత‌రం వ్య‌క్తం చేశారు. కేబినెట్ ర్యాంక్ క‌ల్పించే విష‌యంలో ఖ‌చ్చిత‌మైన నిబంధ‌న‌లు ఉన్న‌ప్ప‌టికీ ప్ర‌భుత్వం ఉద్దేశ‌పూర్వ‌కంగా ఉల్లంఘిస్తోంద‌ని తెలిపారు. వాద‌న‌లు విన్న న్యాయ‌స్థానం ఈ విష‌యంలో కౌంట‌ర్ దాఖ‌లు చేయాల‌ని ప్ర‌భుత్వం స‌హా కేబినెట్ హోదా అనుభ‌విస్తున్న వారికి నోటీసులు జారీచేసింది.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/