Begin typing your search above and press return to search.

హైకోర్టు కర్నూలుకు.. జగన్ మాస్టర్ ప్లాన్?

By:  Tupaki Desk   |   25 Jan 2021 12:22 PM GMT
హైకోర్టు కర్నూలుకు.. జగన్ మాస్టర్ ప్లాన్?
X
ఏపీ సీఎం జగన్ ఎంపీలతో కీలక సమావేశం నిర్వహించారు. ఈనెల 29 నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు ఆరంభం కాబోతున్న నేపథ్యంలో ఈ భేటి ప్రాధాన్యత సంతరించుకుంది. ఉభయ సభల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై పార్లమెంట్ సభ్యులకు దిశానిర్ధేశం చేశారు.

కేంద్రప్రభుత్వం ప్రవేశపెట్టే కీలకమైన బిల్లులు, తీర్మాణాలు, రాష్ట్ర ప్రయోజనాలకు అనుకూలంగానే ఉంటేనే మద్దతు ఇవ్వాలని సూచించారు. కేంద్రం నుంచి రాష్ట్రానికి రావాల్సిన నిధులు, బకాయిలను రాబట్టుకోవడంపై గళమెత్తాలని జగన్ పార్టీ ఎంపీలకు హితబోధ చేశారు.

ఈ భేటి ముగిసిన అనంతరం రాజ్యసభ ఎంపీ విజయసాయిరెడ్డి విలేకరులతో మాట్లాడారు. జలవివాదాల పరిష్కారం కోసం దేశవ్యాప్తంగా నదులను అనుసంధానించాలని సీఎం జగన్ సూచించినట్టు తెలిపారు. నదులన్నింటిని జాతీయం చేయడం వల్ల జలవివాదాలకు పుల్ స్టాప్ పడుతుందని పేర్కొన్నారు.

ఇక హైకోర్టును కర్నూలుకు తరలించే విషయం కొత్తగా నోటిఫికేషన్ జారీ చేయాలని సీఎం జగన్ ఇదివరకు కేంద్రప్రభుత్వాన్ని కోరారని.. దాన్ని తాము పార్లమెంట్ లో లేవనెత్తుతామని అన్నారు. అమరావతి నుంచి హైకోర్టును కర్నూలుకు తరలించే విషయంపై కేంద్ర న్యాయమంత్రిత్వశాఖపైనా ఒత్తిళ్లు తీసుకొస్తామని తెలిపారు. దిశ బిల్లులో సవరణలు చేశామని మళ్లీ ఆమోదానికి కేంద్రప్రభుత్వానికి పంపించామని తెలిపారు.

ఇక ఉపాధిహామీ పెండింగ్ బిల్లులు రూ.3707 కోట్ల రూపాయలను వెంటనే మంజూరు చేయాలని కేంద్రాన్ని కోరుతామని చెప్పారు. ఏపీలో ఆలయాలపై దాడుల వెనుక టీడీపీ హస్తం ఉందని కేంద్రం దృష్టికి తీసుకెళ్లనున్నట్లు తెలిపారు.