Begin typing your search above and press return to search.

అక్రమ మైనింగ్ పై ఏపీ ప్రభుత్వానికి ఆక్షింతలు

By:  Tupaki Desk   |   24 Oct 2018 11:10 AM GMT
అక్రమ మైనింగ్ పై ఏపీ ప్రభుత్వానికి ఆక్షింతలు
X
ఏపీ ప్రభుత్వానికి హైకోర్టు మొట్టికాయలు వేసింది. సున్నపురాయి అక్రమ తవ్వకాలపై నిలదీసింది. టీడీపీ ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు, ఆయన అనచురులు అక్రమంగా వెలికి తీసిన సున్నపురాయి వల్ల ప్రభుత్వ ఖజానాకు రూ.31.39 కోట్లు నష్టం వచ్చిందని.. దీనిపై సీబీఐ దర్యాప్తు చేయమని కోరితే.. సీఐడీ విచారణ ఎలా చేస్తారని రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు నిలదీసింది.

సున్నపురాయి అక్రమ తవ్వకాలపై హైకోర్టు సీబీఐ విచారణ చేయమని ఆదేశాలు ఇచ్చినా అధికారులు స్పందించడం లేదంటూ మాజీ ఎమ్మెల్సీ టీజీవీ కృష్ణారెడ్డి హైకోర్టులో పిల్ దాఖలు చేశారు. ఈ పీటీషన్ ను విచారించిన కోర్టు తీవ్ర వ్యాఖ్యలు చేసింది. ప్రభుత్వం అక్రమ వ్యవహారాలకు అండగా నిలబడేలా వ్యవహరించిందని ధ్వజమెత్తింది. సున్నపురాయి అక్రమాలపై ప్రభుత్వ చర్యలు తీసుకోకపోతే మరింత మంది ఎమ్మెల్యేలు ఇలాంటి చేస్తూనే ఉంటారని హైకోర్టు వ్యాఖ్యానించింది.

సున్నపురాయి క్వారీయంగ్ పై ఆడిట్ చేసి నివేదిక ఇవ్వాలని ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. ఈ సందర్భంగా ప్రభుత్వం తీరుపై ఆగ్రహం వ్యక్తి చేసింది. కోర్టు ఆగ్రహిస్తే కానీ స్పందించరా అని నిలదీసింది. ప్రభుత్వ పాలనలో కోర్టు జోక్యం చేసుకోవాలా? అని ప్రశ్నించింది. సరిహద్దులు చెరిపేసి మరీ అక్రమ మైనింగ్ చేస్తుంటే ప్రభుత్వం కళ్లప్పగించి చూస్తూ ఉందని హైకోర్టు తీవ్రంగా తప్పుపట్టింది.

సున్నపురాయి అక్రమాలపై నిజాలు నిగ్గు తేల్చి హైకోర్టు ముందుకు ఉంచుతామని.. మూడు వారాలు గడువు కావాలని ఏపీ ఏజీ హైకోర్టును కోరగా.. కోర్టు నిరాకరించింది. కేవలం వారం రోజులు మాత్రమే గడువు ఇస్తూ తదుపరి విచారణను ఈనెల 30కి వాయిదా వేసింది.