Begin typing your search above and press return to search.

ఆ మూడు హైకోర్టు పేర్లు మారనున్నాయ్

By:  Tupaki Desk   |   6 July 2016 4:41 AM GMT
ఆ మూడు హైకోర్టు పేర్లు మారనున్నాయ్
X
రాష్ట్ర రాజధాని పేరు ఒకటి.. ఆ రాష్ట్ర హైకోర్టు పేరు మరొకటి ఉన్న ఉదంతాలు దేశంలోని కొన్ని రాష్ట్రాల్లో ఉన్నాయి. తమిళనాడు విషయానికే వస్తే.. ఆ రాష్ట్ర రాజధాని చెన్నై.. కానీ దాని హైకోర్టును మాత్రం చెన్నై హైకోర్టు అని వ్యవహరించకుండా.. మద్రాస్ హైకోర్టుగా వ్యవహరిస్తుంటారు. నిజానికి ఇప్పటి చెన్నైను గతంలో మద్రాస్ గా పిలిచేవారు. దీంతో.. రాష్ట్ర రాజధాని పేరు మారినా.. అందుకు తగ్గట్లుగా హైకోర్టు పేరును మార్చకపోవటంతో.. కొన్ని రాష్ట్ర రాజధానుల పేర్లు ఒకలా.. హైకోర్టుల పేర్లు మరోలా ఉండే పరిస్థితి.

ఆ తీరును మార్చేలా తాజాగా కేంద్రమంత్రివర్గం కొత్త నిర్ణయాన్ని తీసుకుంది. దీంతో.. దేశంలోని మూడు రాష్ట్రాల్లోని హైకోర్టు పేర్లు మారాయి. దీనికి సంబంధించిన తీర్మానాన్ని కేంద్రం ఆమోదించిన మీదట.. రాష్ట్రపతి రాజముద్ర సాంకేతికాంశం కానుందనే చెప్పాలి. ఇక.. పేర్లు మారనున్న ఆయా హైకోర్టుల విషయానికి వస్తే.. ఇప్పటివరకూ మద్రాస్ హైకోర్టుగా పిలుస్తున్న స్థానే ఇకపై చెన్నై హైకోర్టుగా పిలుస్తారు. ఇక.. బాంబే హైకోర్టును ముంబయి హైకోర్టుగా.. కలకత్తా హైకోర్టును కోల్ కతా హైకోర్టుగా పిలవాలన్న అంశంపై కేంద్ర క్యాబినెట్ ఓకే చెప్పేసింది. సో.. రాష్ట్రపతి ఆమోదం పొందిన తర్వాత నుంచి ఈ మూడు హైకోర్టులను కొత్త పేర్లతో పిలవాల్సిన అవసరం ఉంది. ఇది మరికొద్దిరోజుల్లోనే పూర్తి అవుతుందని చెప్పొచ్చు.