Begin typing your search above and press return to search.

అసెంబ్లీ లో హైడ్రామా ..అజిత్ రూటు మారుస్తాడా!

By:  Tupaki Desk   |   25 Nov 2019 10:48 AM GMT
అసెంబ్లీ లో హైడ్రామా ..అజిత్ రూటు మారుస్తాడా!
X
బహుశా ప్రస్తుతం మహారాష్ట్ర లో జరుగుతున్నన్ని పరిణామాలు దేశ రాజకీయ చరిత్ర లో ఎప్పుడు జరిగి ఉండవేమో? ప్రజా తీర్పు వచ్చి రోజులు గడుస్తున్నా ప్రజా పాలన గురించి ఆలోచించే నాయకుడే లేకుండా పోయారు. ఎన్నికల ఫలితాలలో ఏ పార్టీ కి కూడా సరైన మెజారిటీ రాకపోవడంతో .. అధికారం కోసం అన్ని పార్టీలు తమ తమ వ్యూహాలని అమలుచేస్తున్నాయి. కాకపోతే బీజేపీ వేసిన వ్యూహానికి మిగిలిన పార్టీల వ్యూహాలు చెల్లా చెదురు అయి పోయాయి. తెల్ల వారితే అధికారం మాదే అనుకున్న శివసేన కు షాక్ ఇస్తూ బీజేపీ అధికారాన్ని చేజిక్కించుకుంది. కానీ , ఆ అధికారాన్ని నిలబెట్టుకోవడం అంత సులభం కాక పోవచ్చు.

బీజేపీ ..ఎన్సీపీ అజిత్ పవార్ వర్గం సహాయం తో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి ముందుకు వచ్చిన బీజేపీ కి ఇక ఇప్పుడు అసలు పరీక్ష ఎదురుకానుంది. విశ్వాస పరీక్షలో నెగ్గితే కానీ బీజేపీ అధికారం నిలవదు. కానీ , ఎన్సీపీ అధినేత శరద్ పవార్ మాత్రం ..బీజేపీ కి మద్దతు ఇచ్చేదే లేదు అని తేల్చేసారు. దీనితో మహారాష్ట్రలో ఇంకా అయోమయం కొనసాగుతూనే ఉంది. ఇటువంటి తరుణంలో మహారాష్ట్ర అసెంబ్లీ లో సోమవారం హై డ్రామా చోటుచేసుకుంది.

త్వరలోనే బీజేపీ-ఎన్సీపీ (అజిత్‌ వర్గం) బల పరీక్ష ఎదుర్కోనున్న నేపథ్యం లో అసెంబ్లీ లో సీఎం దేవేంద్ర ఫడ్నవిస్‌ తో అజిత్‌ పవార్‌ సోమవారం భేటీ అయి చర్చలు జరిపారు. ఆ తరువాత ఎన్సీపీ నేతలు ఆయనను ఆయన గదిలో కలిసి.. కాసేపు చుట్టు ముట్టినట్టు తెలుస్తోంది. ఈ సందర్భం గా పార్టీ అధినేత శరద్‌ పవార్‌ తో మాట్లాడించినట్టు సమాచారం. ఈ సమయం లోనే అజిత్‌ పవార్‌ ను అసెంబ్లీ లోని ఆయన గదిలో కాసేపు ఎన్సీపీ నేతలు నిలువరించినట్టు తెలుస్తోంది.

ఇక ఎన్సీపీ అధినేత శరద్ పవార్ ఎట్టి పరిస్థితుల్లో బీజేపీకి మద్దతు ఇచ్చేది లేదు అని తేల్చేయడంతో అజిత్‌ మనస్సు మార్చుకొని తిరిగి ఎన్సీపీ గూటికి వస్తారా? లేక బీజేపీతో ముందుకు సాగుతారా? అన్నది అందరిలో ఆసక్తి రేపుతోంది. మరోవైపు చివరి నిమిషంలో ప్లేటు ఫిరాయించిన అజిత్‌కు ఎమ్మెల్యేలెవరూ మద్దతునివ్వడం లేదని, ఎన్సీపీకి 54మంది ఎమ్మెల్యేలు ఉండగా.. 53మంది శరద్‌ పవార్‌ వెంటే ఉన్నారని, స్వయంగా ఎమ్మెల్యే అయిన అజిత్‌ ఒక్కడే బీజేపీకి మద్దతు ఇస్తున్నారని ఎన్సీపీ నేతలు చెప్తున్నారు.