Begin typing your search above and press return to search.

హైపవర్ కమిటీ పరిపాలనా వికేంద్రీకరణ కే జై కొడుతుందా ?

By:  Tupaki Desk   |   8 Jan 2020 7:30 AM GMT
హైపవర్ కమిటీ పరిపాలనా వికేంద్రీకరణ కే జై కొడుతుందా ?
X
ప్రస్తుతం ఏపీ లో మూడు రాజధానుల వ్యవహారం బాగా ముదిరిపోయింది. గత నెల 18 వ తేదీన సీఎం జగన్ అసెంబ్లీ లో ఏపీకి మూడు రాజధానులు రావొచ్చు అంటూ కీలక వ్యాఖ్యలు చేసిన అనంతరం నుండి ఏపీలో రాజధాని విషయం పై రచ్చ మొదలైంది. అమరావతి లోని రాజధానిని ఉంచాలంటూ అమరావతి ప్రాంత ప్రజలు ఆందోళనలు నిర్వహిస్తున్నారు. ఇకపోతే వైసీపీ ఎన్నికల తరువాత అధికారం లోకి వచ్చిన సందర్భంలో రాజధాని అమరావతి కొనసాగించాలా వద్దా అనే అంశంపై ఒక నిపుణుల కమిటీని ఏర్పాటు చేసి నిపుణుల కమిటీ నివేదిక ఆధారంగా రాజధానిపై తేల్చి చెప్తామని సంచలన ప్రకటన చేసింది. సీఎం జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు జిఎన్ రావు కమిటీ రాష్ట్రవ్యాప్తంగా పర్యటించి నివేదికను అందజేసింది. అభివృద్ధి వికేంద్రీకరణ, పరిపాలన వికేంద్రీకరణ జరగాలని ఆ నివేదికలో తెలిపింది.

ఇక ఆ తర్వాత జీఎన్‌ రావు నేతృత్వం లోని నిపుణుల కమిటీ సిఫార్సులతో పాటి బోస్టన్‌ కన్సల్టెన్సీ గ్రూప్‌ నివేదిక కూడా వికేంద్రీకరణ వైపే మొగ్గు చూపుతూ నివేదిక ఇచ్చింది. ఇక తాజాగా జిఎన్ రావు కమిటీ , బోస్టన్ కమిటీ నివేదిక మీద అధ్యయనం చేసేందుకు ప్రభుత్వం నియమించిన హైపవర్ కమిటీ కూడా వికేంద్రీకరణ వైపు అడుగులు వేస్తున్నట్లుగా తాజా పరిణామాలతో తెలుస్తోంది. రాజధాని కమిటీల నివేదికల పై అధ్యయనం చేసేందుకు ప్రభుత్వం నియమించిన హై పవర్ కమిటీ తొలిసారిగా విజయవాడ సమావేశమైంది. ఈ సమావేశంలో పరిపాలన వికేంద్రీకరణ, అభివృద్ధి వికేంద్రీకరణ ఆవశ్యకతపై సుదీర్ఘంగా చర్చలు జరిపింది. అంతేకాదు పరిపాలన వికేంద్రీకరణ లో భాగంగా ఎగ్జిక్యూటివ్ రాజధాని ఎక్కడ ఉండాలి. అక్కడ అనుకూలంగా ఉన్న పరిస్థితులు ఏంటి ? అన్న అంశాల పైన హై పవర్ కమిటీ సభ్యులు చర్చించారు. ఈ సమావేశంలో జీఎన్ రావు కమిటీ, బోస్టన్ కమిటీ ప్రతినిధులు కూడా తమ నివేదికలో ప్రస్తావించిన అంశాలపై హైపవర్ కమిటీకి వివరించారు.

గ్రీన్ ఫీల్డ్ రాజధాని నిర్మాణానికి అయ్యే ఖర్చును భరించే స్థోమత ఏపీకి లేదని వివరించింది. ఓవరాల్ గా అధికార వికేంద్రీకరణ తో పాటు అభివృద్ధి వికేంద్రీకరణ జరగాలని హై పవర్‌ కమిటీ సమావేశంలో ప్రాథమికంగా నిర్ణయానికి వచ్చింది. ఈవిధంగానే ఈ హైపవర్ కమిటీ నివేదిక ఇవ్వబోతున్నట్టు తెలుస్తుంది. అయితే పరిపాలన వికేంద్రీకరణ పై రాజధాని రైతుల అభిప్రాయాలను కూడా పరిగణ లోకి తీసుకొని నిర్ణయం తీసుకుంటామని హైపవర్ కమిటీ చెబుతుంది. గత ప్రభుత్వం ఏకపక్షం నిర్ణయం తీసుకుందని విమర్శించారు కమిటీ సభ్యులు..తాము అందరితో చర్చిస్తామని అంటున్నారు. అంతేకాకుండా మరోపక్క విశాఖలో శరవేగంగా సెక్రటేరియట్ ఏర్పాటుకు, ప్రభుత్వ భవనాల ఏర్పాటుకు ప్రయత్నాలు జరుగుతున్న సమయంలో జగన్ 3 రాజధానుల నిర్ణయమే తుది నిర్ణయం గా హై పవర్ కమిటీ కూడా నివేదిక ఇవ్వబోతుందని రాజకీయ వర్గాల్లో జోరుగా చర్చలు జరుగుతున్నాయి.