Begin typing your search above and press return to search.

చెన్నై టు గార్డెన్ సిటీ 20 మినిట్స్ ఎలా?

By:  Tupaki Desk   |   5 March 2017 10:20 AM GMT
చెన్నై టు గార్డెన్ సిటీ 20 మినిట్స్ ఎలా?
X
సార్వత్రిక ఎన్నికల ముందు మోడీ కానీ దేశ ప్రధానిగా బాధ్యతలు స్వీకరిస్తే.. మొత్తంగా సీన్ మారిపోతుందని.. అద్భుతాలు జరిగిపోతాయన్న ప్రచారం జోరుగా సాగింది. మిగిలిన సంగతులు ఎలా ఉన్నా.. కొండెక్కి కూర్చున్న పెట్రోల్.. డీజిల్ రేట్లకు మోక్షం కలుగుతుందని.. ధరలు భారీగా తగ్గి.. కారుచౌక కావటం ఖాయమన్న మాట వినిపించింది. అయితే.. అదెంత వరకూ నిజమన్న విషయం గడిచిన రెండున్నరేళ్లుగా తెలుస్తూనే ఉంది.

మోడీ ప్రధాని అయితే దేశంలోకి బుల్లెట్ ట్రైన్స్ వచ్చేస్తాయన్న మాటల ప్రచారం భారీగా సాగింది. ఇందుకు తగ్గట్లే కొన్ని అంచనాలు వేసినా.. వాటిఖర్చు విన్న జనాలకు మైండ్ బ్లాక్ అయిన పరిస్థితి. రెండు నగరాల మధ్య వేసే బుల్లెట్ ట్రైన్ ట్రాక్ కోసం ఏకంగా లక్ష కోట్లకు పైనే ఖర్చు చేయాలన్న మాటతో.. బుల్లెట్ ట్రైన్ టికెట్ ధరలు ఎంత ఉంటాయన్న లెక్కలు వేసుకొని షాక్ తిన్నారు. బుల్లెట్ ట్రైన్ లో ప్రయాణం కంటే.. విమానంలో ప్రయాణమే కారుచౌకగా తేల్చారు.

దీంతో.. అప్పటివరకూ బుల్లెట్ ట్రైన్ల మీద ఆశలు పెట్టుకున్న వారంతా.. వాటినినీళ్లు వదిలేశారు. తాజాగా బుల్లెట్ ట్రైన్ అమ్మ మొగుడు లాంటి కలను చెప్పుకొచ్చారు కేంద్ర రైల్వే మంత్రి సురేశ్ ప్రభు. చెన్నై నుంచి బెంగళూరు మధ్య దూరం 342కిలో మీటర్లు అని..బస్సులో వెళితే ఆరున్నర గంటలు కనీసం పడుతుందని.. అదే ట్రైన్ జర్నీ అయినా ఇంచుమించు అదే సమయం పడుతుందని.. ఫ్లైట్ లో అయితే గంటలో చేరుకునే వీలుందని చెప్పిన ఆయన.. అదే హై స్పీడ్ ట్రైన్స్ ను భారత్ లో ప్రవేశ పెట్టే ఆలోచనను బయటపెట్టారు.

ఇందులో భాగంగా అమెరికాలోని లాస్ ఎంజెల్స్ కు చెందిన హైపర్ లూప్ వన్ కంపెనీకి భారత్ లో ఐదు కొత్త రైల్వే లైన్లు నిర్మించేందుకు ఓకే చెప్పినట్లుగా వెల్లడించారు. ఇందులో భాగంగా బెంగళూరు.. చెన్నై మధ్య ఈ లైన్ కానీ ఏర్పాటు చేస్తే.. ప్రయాణ దూరం 20 నిమిషాలకు తగ్గిపోతుందని.. అదే సమయంలో ముంబయి టూ కోల్ కత్తా వయా చెన్నై అయితే 220నిమిషాలు (నాలుగు గంటల కంటే తక్కువ).. ముంబయి టు చెన్నై వయా బెంగళూరు అయితే కేవలం 50 నిమిషాల వ్యవధిలోనే చేరుకోవచ్చంటూ హైపర్ లూమ్ వన్ సంస్థ కొత్త కలలకు సంబంధించిన రిపోర్ట్ లను ప్రభుత్వం ముందు ఉంచింది. ఈ అంకెల్ని విని కలల్లోకి జారే ముందు.. ఈ ప్రాజెక్టు కోసం ఎంత ఖర్చు అవుతుంది? ఒకవేళ ఈ కల సాకారం అయితే.. టికెట్ ఛార్జీ ఎంత అవుతుందో లెక్క చెబితే మరింత బాగుంటుంది. కలల కంటే ముందు కఠినమైన వాస్తవాలు చెబితే మంచిదేమో.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/