Begin typing your search above and press return to search.

ఈ మూడు రోజులూ డేంజర్.. డేంజరేనంట

By:  Tupaki Desk   |   14 April 2016 5:29 AM GMT
ఈ మూడు రోజులూ డేంజర్.. డేంజరేనంట
X
ఎండలు మండిపోతున్నాయి. ఏప్రిల్ రెండో వారంలోనే బండలు పగిలేలా భానుడి చెలరేగిపోతున్నాడు. నిప్పులు చెరుగుతున్న సూరీడితో దశాబ్దాల రికార్డులు బద్ధలైపోతున్నాయి. తాజాగా పెరిగిన ఎండ తీవ్రత జనాల్ని బెంబేలెత్తేలా చేస్తోంది. రెండు తెలుగు రాష్ట్రాల్లో తెలంగాణ.. రాయలసీమలో ఎండల తీవ్రతకు జనాలు వణికిపోతున్నారు. ఉదయం పది గంటల తర్వాత బయటకు అడుగు పెట్టాలంటే భయపడే పరిస్థితి నెలకొంది. బుధవారం నమోదైన పగటి ఉష్ణోగ్రతలు 43 ఏళ్ల రికార్డుల్ని బద్ధలు చేయటం చూసినప్పుడు ఎండ తీవ్రత ఏ స్థాయిలో ఉందో అర్థమవతుంది. అంతేకాదు.. రానున్న మూడు రోజులూ జాగ్రత్తగా ఉండాలని.. ఉష్ణోగ్రతలు తీవ్రంగా ఉండే అవకాశం ఉందన్న హెచ్చరికల్ని వాతావరణ నిపుణులు వ్యక్తం చేస్తున్నారు.

బుధవారం నల్గొండలో గరిష్ఠ ఉష్ణోగ్రత 44 డిగ్రీలుగా నమోదు అయితే.. హైదరాబాద్ లో దశాబ్దాల రికార్డులు చెరిపేస్తూ.. ఏప్రిల్ నెలలో అత్యధిక ఉష్ణోగ్రత 43గా నమోదైంది. ఎండ తీవ్రతకు జనాలు విలవిలాడిపోతున్నారు. సెగలు కక్కుతున్న ఎండ తీవ్రతకు.. ఉక్కపోత చంపేస్తున్న పరిస్థితి నెలకొంది. హైదరాబాద్ చరిత్రలో ఏప్రిల్ రెండో వారంలో ఇంత గరిష్ఠంగా ఉష్ణోగ్రత నమోదు కావటం గమనార్హం.

మరింతగా భయపెట్టే మరో నిజం ఏమిటంటే.. మే లో ఎండల తీవ్రత మరింత ఎక్కువగా ఉండటం ఖాయమని చెబుతున్నారు. గడిచిన 125 ఏళ్లలో ఎప్పుడూ లేనంత ఎండ తీవ్రత ఉండే అవకాశం ఉందని వాతావరణనిపుణులు అంచనాలు వేస్తున్నారు. 45 డిగ్రీల కంటే అధికంగా పగటి ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని చెబుతున్నారు. తెలంగాణలోని అన్ని ప్రాంతాలతో పాటు.. రాయలసీమలోని ప్రాంతాలన్నింటిలోనూ ఇదే స్థాయిలో పగటి ఉష్ణోగ్రతలు నమోదు కావటం గమనార్హం.

శేషాచల అడవులు చుట్టూ ఉండే తిరుపతి పట్టణంలో బుధవారం 43.5 (44గా చెప్పేయొచ్చు) డిగ్రీలు నమోదైంది. ఒక్క కోస్తాంధ్రా మినహా.. మిగిలిన తెలుగు ప్రాంతాలన్నింటిలోనూ మండుతున్న ఎండల కారణంగా.. ప్రజలు ఆరోగ్య జాగ్రత్తలు తీసుకోవాలని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. పగటి ఉష్ణోగ్రత 40 డిగ్రీలు దాటితే పలు ఆరోగ్య సమస్యలు ఎదురవుతాయి. ఇక.. 43.. 44 డిగ్రీల ఎండలు నమోదయ్యే వేళ.. బయట తిరగకపోవటం చాలా ముఖ్యం.

అన్నింటికి మించి మధ్యాహ్నం 12 గంటల నుంచి సాయంత్రం 5 గంటల మధ్యలో వీలైనంత తక్కువగా బయటకు వెళ్లే పనులు పెట్టుకోవటం మంచిది. ఒకవేళ బయటకు వెళ్లినా.. అందుకు తగ్గట్లుగా ఏర్పాట్లు చేసుకోవాలన్న విషయాన్ని మర్చిపోకూడదు. రానున్న మూడు రోజులు మండే ఎండలు పక్కా అని తేలిన నేపథ్యంలో జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది.