Begin typing your search above and press return to search.

అర్థరాత్రి పాతబస్తీలో ఉద్రిక్తత.. ఏమైందంటే?

By:  Tupaki Desk   |   16 Jan 2020 4:38 AM GMT
అర్థరాత్రి పాతబస్తీలో ఉద్రిక్తత.. ఏమైందంటే?
X
అందరూ సంక్రాంతి పండుగ వేళ ఎంజాయ్ చేస్తున్న వేళ.. ఊహించని పరిణామం ఒకటి చోటు చేసుకుంది. హైదరాబాద్ పాతబస్తీతో సహా పలు ప్రాంతాల్లో ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకున్నాయి. ఎలాంటి గొడవలు లేనప్పటికీ.. తప్పు దారి పట్టించేలా పోలీసులకు అందిన మెసేజ్ తో ఇలాంటి పరిస్థితి చోటు చేసుకున్నట్లు గుర్తించారు. ఇంతకూ జరిగిందేమంటే?

కేంద్రప్రభుత్వం తీసుకొచ్చిన ఎన్ ఆర్ సీ.. సీఏఏలకు వ్యతిరేకంగా పలువురు మెరుపు ధర్నాకు పిలుపు ఇచ్చినట్లుగా సర్క్యులేట్ అయిన మెసేజ్ తో గందరగోళం చోటు చేసుకుంది. బహదూర్ పురా.. మాసాబ్ ట్యాంక్.. నెక్లెస్ రోడ్.. ముసారాంబాగ్.. కాచితూడ క్రాస్ రోడ్స్.. టోలీ చౌకీ ప్రాంతాల్లో బుధవారం రాత్రి 8 గంటలకు మెరుపు ధర్నాకు రెఢీగా ఉండాలని.. ఈ ధర్నాలకు ప్రజలు భారీగా హాజరు కావాలంటూ సందేశాలు పలువురికి చేరాయి. ఇలాంటి సందేశమే పోలీసులకు వచ్చింది.

దీంతో.. ఉలిక్కిపడిన పోలీసులు ఒక్కసారిగా అలెర్ట్ అయ్యారు. తాము సిద్ధంగా లేని వేళ.. ఇలాంటి మెరుపు ధర్నాలు జరిగితే పరిస్థితులు విషమిస్తాయన్న ఆందోళనతో పోలీసులు భారీగా రంగంలోకి దిగారు. ఉరుకులు పరుగులు పెడుతూ.. పోలీసులు.. స్పెషల్ పోలీసులతో పాటు రాపిడ్ యాక్షన్ ఫోర్స్.. క్విక్ రియాక్షన్ టీం.. టాస్క్ ఫోర్స్.. సిటీ ఆర్మడ్ రిజర్వ్ డ్ ప్లాటూన్స్ ను రంగంలోకి దించారు.

ఏం జరుగుతుందో అర్థం కాని వేళ.. ఎక్కడైనా ఏదైనా జరిగిందా? అన్న అనుమానాలు వ్యక్తమయ్యాయి. అయితే.. న్యూస్ చానళ్లతో పాటు.. సోషల్ మీడియాలోనూ ఎలాంటి సమాచారం లేకపోవటం.. అందుకు భిన్నంగా పోలీసులు పెద్ద ఎత్తున పలు ప్రాంతాల్ని మొహరించటంతో ఏదో జరుగుతుందన్న భావన వ్యక్తమై.. ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకున్నాయి. అయితే.. పోలీసులకు అందిన మెసేజ్ లో ఉన్నట్లుగా ఎలాంటి మెరుపు ధర్నాలు నగరంలో చోటు చేసుకోకపోవటంతో పోలీసులు హాయిగా ఊపిరిపీల్చుకున్నారని చెప్పక తప్పదు.