Begin typing your search above and press return to search.

రీపోలింగ్ రచ్చ: చంద్రగిరిలో తీవ్ర ఉద్రిక్తత!

By:  Tupaki Desk   |   17 May 2019 10:45 AM GMT
రీపోలింగ్ రచ్చ: చంద్రగిరిలో తీవ్ర ఉద్రిక్తత!
X
చిత్తూరు జిల్లా చంద్రగిరి అసెంబ్లీ నియోజకవర్గంలో ఐదు పోలింగ్ బూత్ ల పరిధిలో రీ పోలింగ్ నిర్వహణకు ఈసీ సమాయత్తం అవుతున్న నేపథ్యంలో అక్కడ తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొంటూ ఉన్నాయని తెలుస్తోంది. రీ పోలింగ్ జరగనున్న ఊర్లలో తెలుగుదేశం వర్సెస్ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పోరు తీవ్ర స్థాయికి చేరింది. నిన్న రాత్రి నుంచినే ఆయా ఊర్లలో ఉద్రిక్తత నెలకొనడం విశేషం.

ఎన్ ఆర్ కమ్మపల్లి అనే ఊరిలో ఉద్రిక్తత తీవ్రత మరింత ఎక్కువగా కనిపిస్తూ ఉంది. రీ పోలింగ్ నేపథ్యంలో ఆ ఊర్లోకి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి వెళ్లారు. ఆయనను స్థానిక తెలుగుదేశం కార్యకర్తలు అడ్డుకున్నట్టుగా తెలుస్తోంది. చెవిరెడ్డి వెంట ఉన్న వాళ్లు కూడా ప్రతిఘటించడంతో గొడవ చెలరేగింది. ఈ అంశంపై సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటిన అక్కడకు చేరుకున్నారు. ఉన్నతాధికారులు కూడా
రంగంలోకి దిగి పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు ప్రయత్నించారు.

చెవిరెడ్డి ఆ ఊర్లోకి వెళ్లిన సమయంలోనే తెలుగుదేశం అభ్యర్థి కూడా అక్కడకు వెళ్లడంతో పరిస్థితి మరింత ఉద్రిక్తంగా మారినట్టుగా తెలుస్తోంది. మొత్తానికి పోలీసులు రంగంలోకి దిగి పరిస్థితిని అదుపులోకి తీసుకున్నారు. ఈ నియోజకవర్గం పరిధిలో రీ పోలింగ్ ను తెలుగుదేశం పార్టీ తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఉంది. ఆ పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడే ఈ అంశంలో అసహనం వ్యక్తం చేశారు. దీంతో కిందిస్థాయి కార్యకర్తలు మరింతగా రెచ్చిపోతున్నారు.

ఈ ఆదివారం మొత్తం ఐదు బూత్ ల పరిధిలో రీ పోలింగ్ జరగనుంది. ఈ నేపథ్యంలో మరింత గా ఘర్షణలు చోటు చేసుకునే అవకాశం ఉందని స్పష్టం అవుతోంది. దీంతో ఈ అంశంపై పోలీసు శాఖ మరింతగా దృష్టి పెట్టినట్టుగా సమాచారం.