Begin typing your search above and press return to search.

గొల్లపూడిలో దేవినేని ఉమా దీక్ష .. సీఎం జగన్ పై విమర్శలు , హైటెంక్షన్ !

By:  Tupaki Desk   |   20 Jan 2021 9:37 AM GMT
గొల్లపూడిలో దేవినేని ఉమా దీక్ష .. సీఎం జగన్ పై విమర్శలు , హైటెంక్షన్  !
X
ఏపీలో విమర్శలు , ప్రతి విమర్శలతో కృష్ణా జిల్లా రాజకీయంగా రంజుగా మారింది. మాజీ మంత్రి దేవినేని ఉమా పై మంత్రి కొడాలి నాని చేసిన సంచలన వ్యాఖ్యల నేపథ్యంలో ఈ వివాదం రాజుకుంది. ఇదిలా ఉంటే .. నేటికి అమరావతి ఉద్యమం 400వ రోజుకు చేరిన సందర్భంగా గొల్లపూడిలోని ఎన్టీఆర్‌ విగ్రహం వద్ద మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు నిరసన దీక్షకు సిద్ధమయ్యారు.

దేవినేని ఉమా తలపెట్టిన దీక్షకు మద్దతు తెలిపేందుకు తెదేపా సీనియర్‌ నేత ధూళిపాళ్ల నరేంద్ర ఉమా నివాసానికి చేరుకున్నారు. ఇక దీక్ష చేయడానికి ఎన్టీఆర్‌ విగ్రహం వద్దకు బయల్దేరిన దేవినేని ఉమా, ధూళిపాళ్ల నరేంద్రలను ఇంటి నుంచి బయటకు రాకుండా పోలీసులు అడ్డుకున్నారు.

ఈ సమయంలో పోలీసులతో కొంత వాగ్వాదం చోటుచేసుకుంది. అధికార పార్టీ నేతలకు అనుమతులిచ్చి తమను ఎలా అడ్డుకుంటారని నిలదీశారు. ఎందుకు అడ్డుకుంటున్నారో లిఖితపూర్వకంగా వివరణ ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. అయితే ,ఎన్టీఆర్ విగ్రహం వద్ద దీక్షకి పోలీసులు అనుమతి నిరాకరించడంతో దేవినేని ఉమా ఇంట్లోనే నిరసన దీక్షకు కూర్చున్నారు. మరో వైపు గొల్లపూడిలోని ఎన్టీఆర్‌ విగ్రహం వద్దకు ఎవరూ వెళ్లకుండా పోలీసులు భారీ భద్రత ఏర్పాటు చేశారు.

పోలీసులు తమని గొల్లపూడిలోని ఎన్టీఆర్‌ విగ్రహం వద్దకి వెళ్లనీయకుండా అడ్డుకోవడం పై దేవినేని ఉమా మాట్లాడుతూ .. సీఎం జగన్‌ పోలీసులను అడ్డు పెట్టుకుని పాలన సాగిస్తున్నారని విమర్శలు కురిపించారు. రాష్ట్రంలో అంబేడ్కర్‌ రాజ్యాంగం అమలు కావడంలేదు. రాజారెడ్డి రాజ్యాంగం అమలు చేస్తున్నారని , నిజాయితీగల పోలీసు అధికారులు ఆత్మహత్య చేసుకునే పరిస్థితి ఏర్పడింది అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీసులు వైకాపా కార్యకర్తల్లా వ్యవహరిస్తున్నారని , పోలీసు వ్యవస్థను అపహాస్యం చేస్తున్నారు.

భారతి సిమెంట్‌ గురించి మాట్లాడిన తెదేపా అధికార ప్రతినిధి పట్టాభిని అరెస్టు చేయాలని ఆదేశాలు రావడం సిగ్గుచేటు అని , సీఎం ఢిల్లీ ఎందుకు వెళ్లారో చెప్పాలి అని ప్రశ్నించారు. ఈడీ కేసుపైనే అమిత్‌ షాను కలిసింది వాస్తవం కాదా, దిల్లీలో అమిత్‌ షా కాళ్లు పట్టుకున్నారు. ప్రశాంతమైన గొల్లపూడిలో వందలమంది పోలీసులను ఎందుకు మోహరించారు అంటూ సీఎం జగన్ ను దేవినేని ఉమా ప్రశ్నించారు.