Begin typing your search above and press return to search.

కాంగ్రెస్ బృందం ప‌ర్య‌ట‌న‌..ఓయూలో ఉద్రిక్త‌త‌!

By:  Tupaki Desk   |   24 May 2020 8:20 AM GMT
కాంగ్రెస్ బృందం ప‌ర్య‌ట‌న‌..ఓయూలో ఉద్రిక్త‌త‌!
X
తెలంగాణ ఉద్య‌మానికి ఊపిరిగా ఉన్న ఉస్మానియా విశ్వ‌విద్యాల‌యాన్ని టీఆర్ఎస్ ప్ర‌భుత్వం ప‌ట్టించుకోవ‌డం లేద‌ని, విశ్వ‌విద్యాల‌య భూములు క‌బ్జాకు గుర‌వుతున్నాయ‌ని తెలంగాణ కాంగ్రెస్ ఆందోళ‌న వ్య‌క్తం చేసింది. ఈ సంద‌ర్భంగా ఉస్మానియా విశ్వ‌విద్యాల‌య భూముల పరిశీలనకు టీపీసీసీ అధ్య‌క్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి - ప్ర‌తిప‌క్ష నాయ‌కుడు భట్టి విక్ర‌మార్క‌, మాజీ ఎంపీ వి.హ‌నుమంత‌రావు వెళ్లారు. విశ్వ‌విద్యాల‌య భూములు కబ్జా అవుతుంటే ప్రభుత్వం ఏమి చేస్తుందని ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తూ విశ్వ‌విద్యాల‌యంలోకి వెళ్లేందుకు ప్ర‌య‌త్నించారు. దీంతో అక్క‌డ ఉద్రిక్త‌త వాతావ‌ర‌ణం ఏర్ప‌డింది. వారికి మద్దతుగా విశ్వ‌విద్యాల‌య విద్యార్థులు ఆందోళనకు దిగారు.

ఈ సంద‌ర్భంగా కాంగ్రెస్ పార్టీ నాయ‌కుల‌ను పోలీసులు అడ్డుకున్నారు. దీంతో పోలీసులు - నాయ‌కుల‌కు మ‌ధ్య తోపులాట జ‌రిగింది. ఈ క్ర‌మంలో మాజీ ఎంపీ వి.హనుమంతరావు కిందపడ్డారు. ప్రైవేటు విశ్వ‌విద్యాల‌యాలకు అనుమ‌తి నిలిపివేయాలని, ఉస్మానియా విశ్వ‌విద్యాల‌య భూముల‌పై సమగ్ర విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు.

ఉస్మానియా విశ్వ‌విద్యాల‌యం తెలంగాణ ప్రజల గుండె అనింద‌ని - నిజాం స్థాపించిన విశ్వ‌విద్యాల‌యం ప్రపంచ ప్రఖ్యాతి చెందిందని కాంగ్రెస్ నాయ‌కులు తెలిపారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో విశ్వ‌విద్యాల‌యం కీలక పాత్ర పోషించింద‌ని పేర్కొన్నారు. ఇక్కడి ఆచార్యులు - అధ్యాప‌కుల పోరాటం - విద్యార్థుల త్యాగంతోనే స్వ‌రాష్ట్రం తెలంగాణ ఏర్పాటయిందని వివ‌రించారు. సీఎం కేసీఆర్ ఉస్మానియా విశ్వ‌విద్యాల‌యంతో సహా రాష్ట్రంలోని అన్ని విశ్వ‌విద్యాల‌యాలను నిర్వీర్యం చేశారని తెలిపారు. విశ్వ‌విద్యాల‌య భూములు ఆక్రమణకు గుర‌వుతున్నాయని.. వెంట‌నే ప‌రిర‌క్షించాల‌ని డిమాండ్ చేశారు. విశ్వ‌విద్యాల‌య భూముల‌ను కాపాడాలని - అన్యాక్రాంతం కాకుండా చర్యలు తీసుకోవాలని కోరారు.