Begin typing your search above and press return to search.

ఏపీలో పోలింగ్.. అక్కడక్కడ ఉద్రిక్తతలు!

By:  Tupaki Desk   |   11 April 2019 5:29 AM GMT
ఏపీలో పోలింగ్.. అక్కడక్కడ ఉద్రిక్తతలు!
X
పోలింగ్ వేళ ఏపీలో ఉద్రిక్త పరిస్థితి నెలకొని ఉంది. భారీ స్థాయిలో ఓటర్లు చాలా చోట్ల ప్రశాంతంగా ఓటు హక్కును వినియోగించుకుంటున్నా… మరి కొన్ని చోట్ల మాత్రం ఉద్రిక్త పరిస్థితులు తప్పడం లేదు. అందుకు సంబంధించి మీడియాలో కొన్ని వార్తలు వస్తూ ఉన్నాయి.

ప్రత్యేకించి గుంటూరు జిల్లాలో ఇలాంటి సంఘటనలు చోటు చేసుకున్నట్టుగా వార్తలు వస్తున్నాయి. నరసరావు పేట నియోజకవర్గంలోని యలమందలో ఉద్రిక్తత చోటు చేసుకున్నట్టుగా సమాచారం. అక్కడ తెలుగుదేశం - వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఏజెంట్లు బాహాబాహీకి దిగినట్టుగా తెలుస్తోంది.

అక్కడ ముగ్గురు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఏజెంట్లను కిడ్నాప్ చేసినట్టుగా వార్తలు వస్తున్నాయి. ఈ అంశం పై ఎన్నికల అధికారులు వివరణ ఇవ్వలేదు. అది పోలింగ్ స్టేషన్ బయట జరిగిన సంఘటన అని అంటున్నారు. ఇక అక్కడ చోటు చేసుకున్న సంఘటనలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి గోపిరెడ్డి శ్రీనివాస రెడ్డి మీద కూడా దాడి జరిగినట్టుగా సమాచారం. ఆయన సెల్ ఫోన్ తో పాటు, ఘటనను చిత్రీకరిస్తున్న కెమెరా కూడా ధ్వంసం అయ్యిందని తెలుస్తోంది.

ఇక విశాఖ - చిత్తూరు - కడప జిల్లాల్లో కూడా చెదరుమదరు సంఘటనలు చోటు చేసుకున్నట్టుగా తెలుస్తోంది. కడప జిల్లాలో సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలున్నాయి. జమ్మలమడుగు నియోజకవర్గంలో ప్రతి సారీ కూడా ఉద్రిక్త పరిస్థితులు తలెత్తుతూ ఉంటాయి. ఈ నేపథ్యంలో ఈ సారి కూడా అక్కడ అదే పరిస్థితి కనిపిస్తూ ఉంది.

పోట్ల దుర్తిలో టీడీపీ నేత సీఎం రమేశ్ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఏజెంటు పై చేయి చేసుకున్నట్టుగా వార్తలు వస్తున్నాయి. ఉదయం పూటే ఇలాంటి ఉద్రిక్తతలు తలెత్తడం గమనార్హం. సాయంత్రానికి పరిస్థితి ఎలా ఉంటుందో చూడాలి!