Begin typing your search above and press return to search.

హైటెన్షన్‌.. ఆస్పత్రిలోనే దీక్ష కొనసాగిస్తున్న కాపు నేత!

By:  Tupaki Desk   |   2 Jan 2023 5:48 AM GMT
హైటెన్షన్‌.. ఆస్పత్రిలోనే దీక్ష కొనసాగిస్తున్న కాపు నేత!
X
కేంద్ర ప్రభుత్వం ఈడబ్ల్యూఎస్‌ వర్గాలకు కల్పించిన పది శాతం రిజర్వేషన్లలో 5 శాతం కాపులకు కల్పించాలని మాజీ మంత్రి చేగొండి హరిరామ జోగయ్య డిమాండ్‌ చేసిన సంగతి తెలిసిందే. ఇదే విషయంపై జగన్‌ ప్రభుత్వం స్పందించకుంటే తాను నిరాహార దీక్షకు దిగుతానని హరిరామ జోగయ్య ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో డిసెంబర్‌ 30 వరకు జగన్‌ ప్రభుత్వానికి సమయం ఇచ్చారు. అయితే ప్రభుత్వం నుంచి సానుకూల స్పందన రాకపోవడంతో జనవరి 2 నుంచి ఆమరణ నిరాహార దీక్షకు ఆయన సిద్ధమయ్యారు.

ఈ క్రమంలో పోలీసులు ఆయనను దీక్ష విరమించాలని కోరారు. అయితే జోగయ్య వినిపించుకోకపోవడంతో 400 మంది పోలీసుల భద్రత మధ్య జనవరి 1 రాత్రి ఆయనను పాలకొల్లులో పోలీసులు తమ అదుపులోకి తీసుకున్నారు. బలవంతంగా ఆయన కూర్చున్న వీల్‌ చైర్‌ తో సహా అంబులెన్సు ఎక్కించారు. అక్కడ నుంచి ఆయనను అంబులెన్సులో ఏలూరు ఆస్పత్రికి తరలించారు. మీడియాను సైతం జోగయ్య ఇంటిలోకి పోలీసులు అనుమతించలేదు.

దీంతో ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రిలోనే హరిరామ జోగయ్య తన దీక్ష కొనసాగిస్తున్నారు. అగ్రవర్ణాలలోని పేదలకు కేంద్ర ప్రభుత్వం కల్పించిన పది శాతం రిజర్వేషన్లు కాపులకు ఐదు శాతం కేటాయించాలని జోగయ్య డిమాండ్‌ చేస్తున్నారు. కాపులకు ఐదు శాతం రిజర్వేషన్‌ అమలు చేసే వరకు తన దీక్ష కొనసాగిస్తానని ప్రకటించారు. అదేవిధంగా జీవో నెంబర్‌ 60 రద్దు చేయాలని.. యాక్ట్‌14, 15 అమలులోకి తీసుకు రావాలని ఆయన డిమాండ్‌ చేస్తున్నారు.

జనవరి 1 సాయంత్రం ఏడు గంటలకి తనను పోలీసులు హౌస్‌ అరెస్ట్‌ చేశారని జోగయ్య ప్రకటించారు. అప్పటి నుంచి తాను నిరాహార దీక్షలో ఉన్నానని వెల్లడించారు. కాపు రిజర్వేషన్‌పై ప్రభుత్వానికి ఇచ్చిన అల్టిమేటంపై స్పందన లేదన్న ఆయన కాపు రిజర్వేషన్ల సాధన కోసం చావడానికైనా సిద్ధమంటూ ప్రకటించారు. నరసాపురం గాంధీ బొమ్మల సెంటర్‌లో అనుమతి ఇవ్వకపోతే ఇంటి ఆవరణలోనే దీక్ష చేపడతానన్నారు. భగ్నం చేస్తే ఆసుపత్రిలోనైనా దీక్ష కొనసాగిస్తా అంటూ ప్రకటించిన సంగతి తెలిసిందే.

మరోవైపు.. దీక్షలో ఉన్న హరిరామ జోగయ్య షుగర్‌ లెవెల్స్‌ పడిపోయాయని ఏలూరు ప్రభుత్వాస్పత్రి వైద్యులు చెబుతున్నారు. అలాగే బీపీ కూడా పెరిగిందని వెల్లడించారు. మరోవైపు జోగయ్యను పోలీసులు అదుపులోకి తీసుకోవడంతో పశ్చిమగోదావరి జిల్లాలో హైటెన్షన్‌ వాతావరణ ఏర్పడింది. దీక్ష భగ్నం చేసేందుకు జనవరి 1న ఆయన ఇంటి దగ్గర 400 మంది పోలీసులు మోహరించారు. ఏలూరు, మచిలీపట్నం, నరసాపురం, పాలకొల్లు డీఎస్పీలు ఆయన ఇంటి వద్దకు చేరుకున్నారు.

కాగా కాపులకు గత టీడీపీ ప్రభుత్వం 5 శాతం రిజర్వేషన్లు అమలు చేసింది. అయితే 2019లో అధికారంలోకి వచ్చిన జగన్‌ ప్రభుత్వం ఈ రిజర్వేషన్లను ఎత్తేసింది. పైగా కాపుల రిజర్వేషన్‌ తమ చేతుల్లో లేదని.. అది కేంద్రమే నిర్ణయించాలని ప్రకటించింది. అయితే ఇటీవల పార్లమెంటులో బీజేపీ ఎంపీ జీవీఎల్‌ నరసింహారావు అడిగిన ప్రశ్నకు కేంద్రం స్పందిస్తూ ఆయా కులాలకు రిజర్వేషన్లు కల్పించడమనేది ఆయా రాష్ట్ర ప్రభుత్వాల ఇష్టమని ప్రకటించిన సంగతి తెలిసిందే.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.