Begin typing your search above and press return to search.

హైదరాబాద్ రోడ్లన్నీ వెలవెలబోతున్నాయ్

By:  Tupaki Desk   |   10 Nov 2016 3:48 AM GMT
హైదరాబాద్ రోడ్లన్నీ వెలవెలబోతున్నాయ్
X
ఓపక్క శుభకార్యాలు జోరుగా జరుగుతున్న రోజులివి. మరోపక్క కార్తీకమాసం. రెండూ కలిసి.. హైదరాబాద్ రోడ్లు మొత్తం జనాలతో కిటకిటలాడిపోవాల్సిన పరిస్థితి. కానీ.. అందుకు భిన్నమైన దృశ్యం బుధవారం ఆవిష్కృతమైంది. సంక్రాంతి పండక్కి కనుక రోడ్లు మొత్తం ఖాళీ అయిపోయి.. షాపులన్నీ ఎంతలా వెలవెలబోతాయో సరిగ్గా అలాంటి పరిస్థితే హైదరాబాద్ మహానగరంలో నెలకొంది. సంక్రాంతి లాంటి పండగ సమయాల్లో పార్కులు.. మల్టీఫ్లెక్సులు.. సినిమా హాళ్లు అయినా కిటకిటలాడే పరిస్థితి.

బుధవారం మాత్రం ఎక్కడా సందడి అన్న మాటే కనిపించలేదు. సాయంత్రం ఆరు గంటల వేళ.. దిల్ సుఖ్ నగర్ నుంచి కూకట్ పల్లి వరకూ వెళ్లాలంటే కనీసం గంటన్నర.. లేదంటే రెండు గంటలు పట్టే పరిస్థితి. కానీ.. బుధవారం మాత్రం అందుకు భిన్నంగా కేవలం 45 నిమిషాలు.. లేదంటే గంటకు మించి పట్టని పరిస్థితి. ఉన్నట్లుండి హైదరాబాద్ కు ఏమైందన్న సందేహం అక్కర్లేదు. పెద్ద నోట్ల రద్దుతో ఏర్పడిన చిత్రమైన పరిస్థితిగా చెప్పాలి.

చేతిలో డబ్బులున్నా.. చిల్లిగవ్వ లేని వారి మాదిరి తయారయ్యారు హైదరాబాదీయులు. ఇంట్లో రూ.500.. రూ.వెయ్యి నోట్లు దండిగా ఉన్నా.. అవేమీ చెల్లుబాటు కానీ పరిస్థితి. చెల్లుబాటు అయ్యే చిన్న నోట్లు చేతిలో లేకపోవటంతో చాలా ముఖ్యమైన పనులు.. ఆఫీసులకు వెళ్లే వారు మాత్రమే బయటకు వచ్చారు కానీ.. మిగిలినవారు కూడా కనిపించలేదు. కార్లు సైతం చాలా తక్కువగా బయటకు వచ్చాయి.

కార్లను బయటకు తీసి.. గంటల తరబడి పెట్రోల్ బంకుల వద్ద క్యూలో నిలుచునే కన్నా.. బండి బయటకు తీయకుండా ఉండటానికే ఎక్కువ మంది ప్రాధాన్యత ఇచ్చారు. ఒకవేళ.. క్యూలకు ఓకే అన్నా.. పెద్ద నోట్ల విషయంలో పెట్రోల్ బంకులు వ్యవహరిస్తున్న తీరుతో ఎందుకైనా మంచిదన్న ఉద్దేశం ప్రజల్లో కనిపించింది. చివరకు చిన్న చిన్న టిఫిన్ సెంటర్లకు సైతం పెద్ద నోట్ల రద్దు ఎఫెక్ట్ పడటం గమనార్హం.

నిత్యం రూ.10వేల అమ్మే ఒక మోస్తరు హోటల్ లో బుధవారం వ్యాపారం అనూహ్యంగా రూ.3వేల వరకూ అమ్మకాలు తగ్గిపోయి రూ.7వేలకు మాత్రమే పరిమితమైందని చెబుతున్నారు. ఇక.. పెద్ద పెద్ద దుకాణాలు.. షాపింగ్ మాల్స్ అయితే ఈగలు తోలుకునే పరిస్థితి. నిత్యం జనాలతో కళకళలాడే సినిమా థియేటర్లు సైతం బుధవారం వెలవెలబోయాయి. సంక్రాంతి సందర్భంగా జనాలందరూ ఊళ్లకు వెళ్లిపోయి వెలవెలబోయే హైదరాబాద్ కు తగ్గట్లే బుధవారం వాతావరణం నెలకొని ఉంది. ఇలాంటి పరిస్థితి మరికొద్ది రోజులు ఉండే అవకాశం ఉందని చెబుతున్నారు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/